Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
Paarijatha Parvam Review: ‘పారిజాత పర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: పారిజాత పర్వం నటీనటులు: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , గడ్డం నవీన్, జబర్దస్త్ రోహిణి తదితరులు నిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్ రచన, దర్శకత్వం: సంతోష్ కంభంపాటి సంగీతం: రీ ఎడిటర్: శశాంక్ వుప్పుటూరి విడుదల తేది: ఏప్రిల్ 19, 2024 ‘పారిజాత పర్వం’ కథేంటంటే? చైతన్య(చైతన్య రావు) దర్శకుడు కావాలని హైదరాబాద్ వస్తాడు. తన స్నేహితుడు(వైవా హర్ష)ని హీరోగా పెట్టి ఓ సినిమాను తెరకెక్కించాలనేది అతని కల. దాని కోసం కథతో నిర్మాతల చుట్టూ తిరుగుతాడు. కానీ కొంతమంది కథ నచ్చక రిజెక్ట్ చేస్తే.. మరికొంతమంది హీరోగా అతని స్నేహితుడిని పెట్టడం ఇష్టంలేక రిజెక్ట్ చేస్తుంటారు. చివరకు చైతన్యనే నిర్మాతగా మారి సినిమా తీయాలనుకుంటాడు. డబ్బు కోసం ప్రముఖ నిర్మాత శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) భార్య(సురేఖ వాణి)ను కిడ్నాప్ చేయాలనుకుంటారు. మరోవైపు బారు శ్రీను -పారు(శ్రద్ధాదాస్) గ్యాంగ్ కూడా శెట్టి భార్యనే కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యను కిడ్నాప్ చేసిందెవరు? అసలు బారు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏంటి? చైతన్య, బార్ శ్రీను ఎలా కలిశారు? శెట్టి భార్యను కిడ్నాప్ చేయమని బార్ శ్రీను గ్యాంగ్‌కి చెప్పిందెవరు? వాళ్ల ప్లాన్ ఏంటి? చివరకు చైతన్య సినిమా తీశాడా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా తీయడం ఓ కళ. ప్రేక్షకుడిని నవ్వించో, భయపెట్టో.. ఏదో ఒకటి చేసి రెండున్నర గంటల పాటు థియేటర్స్‌లో కూర్చోబెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు. రొటీన్ కథనే మరింత రొటీన్‌గా చూపిస్తానంటే ఎందుకు వస్తాడు? ఈ విషయం తెలిసి కూడా పారిజాత పర్వం తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్ కంభంపాటి. క్రైమ్ కామెడీ జోనర్లో సెఫెస్ట్ కాన్సెప్ట్ అయిన కిడ్నాప్ డ్రామానే కథగా మలుచుకొని.. రొటీన్ ట్విస్టులతో సాదాసీదాగా కథనాన్ని నడిపించాడు. ఫన్, సస్పెన్స్, థ్రిల్..వీటిల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుడికి పూర్తిగా అందించలేకపోయాడు. కథ ప్రారంభం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చైతన్య సినిమా కష్టాలను చూపిస్తూనే బారు శ్రీను నేపథ్యాన్ని పరిచయం చేయడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత కథ అస్సలు ముందుకు సాగదు. చెప్పిన కథనే మళ్లీ చెప్పడం..వచ్చిన సీన్లే మళ్లీ రావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. వైవా హర్ష పంచులతో పాటు హీరోయిన్ కారు డ్రైవింగ్ సీన్లు కాస్త నవ్విస్తాయి. అసలు కథంతా(కిడ్నాప్) సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అయితే కిడ్నాప్ కోసం రెండు టీమ్‌లు చేసే ప్లాన్ మొదలుకొని..చివరి సీన్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యారు. కన్ఫ్యూజన్ డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. కిడ్నాప్ తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంది. పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్ ట్విస్టులతో కథను సాగదీశాడు. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని ప్రకటించడమే ప్రేక్షకుడికి పెద్ద ట్విస్ట్. ఎవరెలా చేశారంటే.. నటన పరంగా చైతన్యకు వంక పెట్టలేం కానీ ఆయన ఎంచుకుంటున్న కథలే రొటీన్ ఉంటున్నాయి. ఇందులోనూ ఆయన రొటీన్ పాత్రే పోషించాడు. సునీల్‌కి మంచి పాత్రే లభించింది. కానీ అటు విలన్‌గాను, ఇటు కమెడియన్‌గానూ పూర్తిగా మెప్పించలేకపోయాడు. కొన్ని చోట్ల మాత్రం తనదైన కామెడీతో నవ్విస్తాడు. పార్వతిగా శ్రద్ధాదాస్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగాను కనిపించింది. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష పండించే కామెడీ బాగుంది. ఇక చైతన్య లవర్‌గా మాళవికా సతీశన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. వైవా హర్షకు, ఆమె మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, సురేఖ వాణితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమాలో నటించిన ఆర్టిస్టుల నుంచి తనకు కావల్సిన నటనను దర్శకుడు సరిగా రాబట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘తెప్పసముద్రం’ మూవీ రివ్యూ
టైటిల్: తెప్పసముద్రం నటీనటులు: చైతన్య రావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ రాపోలు నిర్మాత: నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మాణ సంస్థ: శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ సంగీతం: : పి.ఆర్ సినిమాటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లి ఎడిటర్: సాయిబాబు తలారి విడుదల తేది: ఏప్రిల్ 19, 2024 ‘తెప్పసముద్రం’ కథేంటంటే.. తెలంగాణలోని తెప్పసముద్రం అనే గ్రామంలో తరచు స్కూల్ పిల్లలు మాయం అవుతుంటారు. వారిని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని ఛేదించడానికి ఎస్సై గణేష్(చైతన్య రావు) ప్రయత్నిస్తుంటాడు. క్రైమ్ మిర్రర్ రిపోర్టర్‌గా పని చేస్తున్న ఇందు(కిశోరి ధాత్రిక్) కూడా ఈ మిస్సింగ్ కేసు గురించి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. ఇందుని ప్రాణంగా ప్రేమించే ఆటో డ్రైవర్ విజయ్(అర్జున్ అంబటి) కూడా తప్పిపోయిన పిల్లల కోసం వెతుకుతుంటాడు. మరోవైపు ఎస్సై గణేశ్ తండ్రి లాయర్ విశ్వనాథ్(రవిశంకర్) కూడా తన దగ్గరకు ట్యూషన్ వచ్చే పిల్లలు తప్పిపోవడంతో..ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గజా చేసే గంజాయి దందా బయటపడుతుంది. ఈ కేసులో విజయ్‌తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేస్తాడు గణేష్. ఆ సమయంలోనే పిల్లల కిడ్నాప్‌కి సంబంధించిన విషయంలో విస్తుపోయే నిజం ఒకటి తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? తప్పిపోయిన పిల్లలు ఏమయ్యారు? ఎస్సై గణేష్ ఈ కేసును ఛేదించాడా లేదా? సైకో కిల్లర్‌ని చంపిందెవరు? చివరకు లాయర్ విశ్వనాథ్ తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలాంటి సినిమాల్లో ఒక్కసారి ట్విస్ట్ తెలిస్తే.. సినిమాపై ఆసక్తి పోతుంది. అలా అని ట్విస్ట్ చెప్పకుండా ఉంటే ఎంగేజ్ చేద్దామంటే.. కథనం ఆసక్తికరంగా సాగాలి. ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాలి. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉండాలి. అలా అయితే ఆ సినిమా విజయం సాధిస్తుంది. ఈ విషయంలో తెప్ప సముద్రం కొంతవరకు సఫలం అయింది. చిన్నారులను హత్య చేసే సైకో కిల్లర్ ఎవరనేది చివరి వరకు తెలియకుండా సస్పెన్స్ కొనసాగిస్తూ ఆసక్తికరంగా కథననాన్ని నడిపించాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది రొటీన్ చిత్రమే. ఓ సైకో.. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతూ.. వారిని హత్య చేయడం, చివరకు అతన్ని కనిపెట్టి అంతమొందించడం.. సింపుల్‌గా చెప్పాలంటే తెప్పసముద్రం కథ ఇంతే. కానీ దర్శకుడు దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. స్క్రీన్‌ప్లే కథపై ఆసక్తిని కలిగించేలా చేశాయి. అసలు హంతకుడు ఎవరనేది చివరివరకు కనిపెట్టలేం. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనం సాగుతుంది. ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ తెలంగాణాలో సంచలనం సృష్టించిన ‘హాజీపూర్ ఘటనను గుర్తు చేస్తోంది. రొటీన్ లవ్‌స్టోరీగా సినిమా ప్రారంభం అవుతుంది. తన ప్రేమ విషయాన్ని హీరోయిన్‌కి చెప్పడానికి హీరో భయపడడం.. ఆమెకు తెలియకుండానే ఆమె పేరుమీద డొనేషన్ ఇవ్వడం.. ఆ విషయం తెలిసి హీరోని హీరోయిన్ ప్రేమించం..ఫస్టాఫ్ ఇలా రొటీన్‌గా సాగుతుంది. వరుస హత్యలపై ఎస్సై గణేష్ చేసే ఇన్వెస్టిగేషన్‌ని కథపై ఆస్తకిని పెంచుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్దుంది. సెకండాఫ్ అంతా ట్విస్టులతో సాగుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఒకింత షాక్‌కి గురవుతారు. ఆ తర్వాత కిల్లర్ బాల్యం నుంచి హత్య వరకు ప్రతిది డిటెయిల్డ్గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చివరిలో దర్శకుడు ఇచ్చిన మెసేజ్ కూడా అందరిని ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఆటోడ్రెవర్, హీరోయిన్ లవర్‌గా అర్జున్ అంబటి చక్కగా నటించాడు. డ్యాన్స్ తో పాటు ఉన్నంతలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. క్రైమ్ రిపోర్టర్ ఇందుగా కిశోరి దాత్రిక్ తన పాత్ర పరిధిమేర నటించి మెప్పించింది. ఎస్సై గణేశ్‌గా చైతన్య రావు అద్భుతంగా నటించాడు. చైతన్య రావు గతంలో ఈ తరహా పాత్రను పోషించలేదు. లాయర్ విశ్వనాథ్ గా రవిశంకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. పి.ఆర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. చివర్లో వచ్చే పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ గుండెను బరువెక్కిస్తుంది.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి -
‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ
టైటిల్: మార్కెట్ మహాలక్ష్మి నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు నిర్మాణ సంస్థ: బి2పి స్టూడియోస్ నిర్మాత: అఖిలేష్ కలారు దర్శకత్వం: వియస్ ముఖేష్ సంగీతం: జో ఎన్మవ్ నేపథ్య సంగీతం: సృజన శశాంక సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి విడుదల తేది: ఏప్రిల్ 19, 2024 ‘కేరింత’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పార్వతీశం. ఆ సినిమాలో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రివ్యూ ఏర్పాటు చేసింది చిత్రబృందం. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి(కేదార్ శంకర్) తన కుమారుడు (పార్వతీశం)ని ఇంజనీరింగ్ చదివిస్తాడు. అతని చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తోంది. లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి కోటి రూపాయలు కట్నంగా ఇచ్చే అమ్మాయితోనే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు తండ్రి. అలాంటి సంబంధాలనే తీసుకొస్తాడు. కానీ పార్వతీశం(ఈ సినిమాలో హీరో పాత్రకి పేరు లేదు) మాత్రం అన్నింటిని రిజెక్ట్ చేసి, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి అలియాస్ ‘మార్కెట్ మహాలక్ష్మి(ప్రణీకాన్వికా)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు.కానీ మహాలక్ష్మి మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తుంది.దీంతో తనను ఒప్పించేందుకు మార్కెట్లోనే తిష్టవేస్తాడు. చివరకు మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పార్వతీశం.. కూరగాయలు అమ్ముకునే అమ్మాయినే ఎందుకు ఇష్టపడ్డాడు? మహాలక్ష్మి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? తన సంపాదనతోనే బతకాలని మహాలక్ష్మి ఎందుకు డిసైడ్ అయింది? మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..? పెళ్లి తర్వాత అమ్మాయి.. అబ్బాయి వాళ్ల ఇంటికే ఎందుకు వెళ్లాలి? అబ్బాయియే అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చి ఎందుకు కాపురం చేయకూడదు? ఉద్యోగ రిత్యా చాలా మంది తమ పెరెంట్స్కి దూరంగా ఉంటున్నారు కదా? మరి అమ్మాయి ఇంటికి వెళ్లి ఉంటే జరిగే నష్టమేంటి? అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు. అది మన సంప్రదాయం అని.. ఫాలో అవ్వడమే తప్ప అలానే ఉండాలని ఎక్కడా రాసి పెట్టిలేదు. ఇదే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు వియస్ ముఖేష్. పెరెంట్స్కి దూరంగా ఉన్నా సరే..వారి బాగోగులను చూసుకునే బాధ్యత మనదనే విషయం గుర్తుంటే చాలు అనే సందేశాన్ని వినోదాత్మకంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్‌గా ఎందుకు బతకాలో ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా, సందేశాత్మకంగా ఉంది కానీ.. ఆ పాయింట్‌ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో పూర్తిగా సఫలం కాలేదు. కథలోని ఎమోషన్ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. హీరో.. హీరోయిన్ని చూసి ప్రేమలో పడే సీన్‌తో పాటు చాలా సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. అలాగే ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు కూడా అంతగా ఆకట్టుకోవు. అక్కడ మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా.. సరిగా వాడుకోలేదోమో అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు బలమైన సన్నివేశాలను రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో ప్రేక్షకులను ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథే ఇది. కట్నం కోసం కొడుకును ఇంజనీరింగ్ చదివించాలని గుమాస్తాగా పని చేసే తండ్రి ఆలోచించే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో ఎంట్రీ సీన్ కూడా అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం స్లోగా సాగుతుంది. మార్కెట్లో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడిన తర్వాత వచ్చే కొన్ని సీన్లు వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ కథంతా మార్కెట్ చుట్టే తిరుగుతుంది. మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడం కోసం హీరో చేసే పనులు పాత సినిమాలను గుర్తు చేస్తాయి. అలాగే చాలా వరకు కథనం నెమ్మదిగా, ఊహకందేలా సాగుతుంది. మహాలక్ష్మి ఎందుకు ఇండిపెండెంట్‌గా బతకాలని అనుకోవాడానికి గల కారణం కన్విన్సింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ బాగుటుంది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పార్వతీశం చక్కగా నటించాడు. గత సినిమాలతో పోల్చితే నటన పరంగా ఆయన బాగా మెప్పించాడని చెప్పొచ్చు. ఇక మార్కెట్ మహాలక్ష్మిగా ప్రణికాన్విక ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. తెరపై ఆ విషయం తెలియకుండా చక్కగా నటించింది. హీరో ప్రెండ్‌గా ముక్కు అవినాష్ కనిపించేంది కాసేపే అయినా నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ బ్రదర్, తాగుబోతుగా మహబూబ్ బాషా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ‘కోటర్ ఇస్తే చెబుతా’ అంటూ ఆయన పండించిన కామెడీ బాగుంది. కేదార్ శంకర్, జయ, పద్మ, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సృజన శశాంక భ్యాగ్రౌండ్ స్కోర్, జో ఎన్మవ్ మ్యూజీక్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!
ఓటీటీల్లో బోర్ కొట్టని జానర్ అంటే థ్రిల్లరే. మిగతా సినిమాల సంగతేమో గానీ థ్రిల్లర్స్ ని థియేటర్లలో కంటే సింగిల్ గా ఇంట్లోనే చూడటం బెస్ట్ అని చెప్పొచ్చు. అలా హాలీవుడ్ లో 2014లోనే వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ 'ప్రీ డెస్టినేషన్'. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నిజంగా అంత బాగుందా? ఏంటనేది డీటైల్డ్ గా చూద్దాం. (ఇదీ చదవండి: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ) 'ప్రీ డెస్టినేషన్' విషయానికొస్తే.. ఈ సినిమాలో బేబీ జేన్, జేన్, జాన్, బార్ కీప్, ఫిజిల్ బాంబర్ అని ఐదు పాత్రలు ఉంటాయి. 1945-1992 మధ్య కాలంలో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అసలు వీళ్ల ఐదుగురికి కనెక్షన్ ఏంటి? చివరకు ఏమైందనేదే అసలు కథ. కొన్ని సినిమాలు చూడటానికి చాలా సాధారణంగా ఉంటాయి. 40 నిమిషాలు అయ్యేవరకు 'ప్రీ డెస్టినేషన్' కూడా అలానే అనిపిస్తుంది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఐదు పాత్రలకు సంబంధించిన డీటైల్స్ అన్ని ప్రేక్షకుల అర్థమైన దగ్గర నుంచి థ్రిల్ కలిగిస్తుంది. ఐదు పాత్రలు టైమ్ ట్రావెలింగ్ చేస్తుంటే.. చూస్తున్న మనకు సరికొత్త అనుభూతి, థ్రిల్ అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా టైమ్ ట్రావెల్ అనేది సాధ్యమా కాదా అనేది పక్కనబెట్టి చూస్తే మాత్రం మూవీ నచ్చేస్తుంది. ఇంతకంటే ఒక్క విషయం ఎక్కువ చెప్పినా సరే మళ్లీ కథ లీక్ చేసి, మేమే మీకు స్పాయిలర్స్ ఇచ్చేసినట్లు అయిపోద్ది! (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య) 'ప్రీ డెస్టినేషన్' సినిమాని గ్రేటెస్ట్ అని చెప్పలేం కానీ డిఫరెంట్ మూవీస్ అంటే ఇష్టపడే మూవీ లవర్స్ కచ్చితంగా మిస్సవకుండా చూడాల్సిన మూవీ. 2014లోనే రిలీజైన ఈ చిత్రం హాలీవుడ్ ఆడియెన్స్ కి తెగ నచ్చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత చేరువైంది. ఇదే మూవీ కథని స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో పలు సినిమాలు తీయడం విశేషం. అవేంటో చెబితే మళ్లీ స్టోరీ చెప్పిసినట్లు అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్.. ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత 'అత్తారింటికి దారేది' సినిమాలోని ఫేమస్ డైలాగ్ కచ్చితంగా గుర్తొస్తుంది. అదేంటనేది 'ప్రీ డెస్టినేషన్' చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కేవలం 97 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాని అలా మొదలుపెడితే ఇలా ముగించేయొచ్చు. మరి ఇంకెందుకు లేటు త్వరగా చూసేయండి. (ఇదీ చదవండి: ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!) -
DeAr Movie Review : గురక కాన్సెప్ట్‌తో వచ్చిన ‘డియర్’ ఎలా ఉందంటే?
టైటిల్: డియర్ నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులు నిర్మాతలు: జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేని దర్శకత్వం: ఆనంద్ రవించంద్రన్ సంగీతం: జీవీ ప్రకాశ్ విడుదల తేది: ఏప్రిల్ 12, 2024 అర్జున్(జీవీ ప్రకాశ్ కుమార్) ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అవ్వాలనేది అతని కల. కానీ అతని అన్నయ్య చరణ్(కాళి వెంకట్), అమ్మ లక్ష్మీ(రోహిణి) మాత్రం అర్జున్‌కి పెళ్లి చేయాలని ఫిక్స్ చేస్తారు. ఓ మంచి సంబంధం చూస్తారు. అమ్మాయి పేరు దీపిక(ఐశ్వర్య రాజేష్). ఆమెకు గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఈ విషయాన్ని దాచి అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుంది. అర్జున్‌కి ఏమో నిద్రపోయినప్పుడు చిన్న శబ్దం వినిపించినా.. లేచి కూర్చునే అలవాటు. వీరిద్దరికి ఉన్న విభిన్నమైన అలవాట్లు.. వారి కాపురంలో కలతలు తెచ్చిపెడతాయి. అర్జున్ ఉద్యోగానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? భార్య పెట్టే గురక వల్ల అర్జున్‌కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? విడాకుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొత్త పాయింట్‌తో ఓ సినిమా వచ్చి..అది సూపర్ హిట్ అయిన తర్వాత అలాంటి కాన్సెప్ట్‌తోనే మళ్లీ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? పాత కథే అయినా తెరపై కొత్తగా చూపిస్తే కొంతలో కొంత ఆదరించే అవకాశం ఉంటుంది. కానీ హిట్ సినిమా కాన్సెప్ట్ తీసుకొని.. అతి సాధారణంగా కథనాన్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? ‘డియర్’ మూవీలా ఉంటుంది. గురక సమస్యతో అల్రేడీ ‘గుడ్‌నైట్’ అనే సినిమా వచ్చి.. ప్రేక్షకులను మనసును దోచుకుంది. అలాంటి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కిన మూవీ ‘డియర్’. ‘గుడ్‌నైట్’లో హీరోకి గురక సమస్య ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌కి ఉంటుంది. అంతే తేడా. కానీ గుడ్‌నైట్ సినిమాలో వర్కౌట్ అయిన ఎమోషన్ ఈ చిత్రంలో కాలేదు.. కథనాన్ని అటు వినోదాత్మకంగాను..ఇటు ఎమోషనల్‌గాను మలచడంతో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు. సినిమాలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. గురక సమస్యను అధిగమించేందుకు హీరో తీసుకునే నిర్ణయం సిల్లీగా అనిపిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు చాలా మార్గాలే ఉన్నా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. పైగా మధ్యలో హీరో పేరేంట్స్ సంబంధించిన స్టోరీని తీసుకొచ్చారు. పోనీ అదైనా కొత్తగా ఉందా అంటే.. అరగదీసిన ఫార్ములానే మళ్లీ వాడేశారు. ఏ దశలోను కథనం ఆసక్తికరంగా సాగదు. హీరోహీరోయిన్లకు ఉన్న సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోయిన్‌కి గురక పెట్టే సమస్య.. హీరోకి పెన్సిల్ కిందపడిన శబ్దం వినించినా నిద్రలేచే అలవాటు. ఈ ఇద్దరికి ఉన్న సమస్యల మధ్య బోలెడంత కామెడీ పండించొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. పోనీ ఎమోషనల్‌గా అయినా చూపించారా అంటే అదీ లేదు. తమకున్న సమస్యలను దాచి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయడం.. ఇవన్నీ రొటీన్‌గా ఉంటాయి. ఇక హీరో ఉద్యోగం పోవడానికి గల కారణం బాగున్నా..దానికి సంబంధించిన సన్నివేశాలు అయితే సిల్లీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త ఆస్తకరంగా అనిపించినా.. సెకండాఫ్ మరింత సాగదీతగా ఉంటుంది. పేరెంట్స్‌ని కలిపే ఎపిసోడ్ మెయిన్ కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. గుడ్‌నైట్ సినిమా చూడనివారిని ఈ సినిమా కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్‌గా జీవీ ప్రకాశ్ చక్కగా నటించారు. అయితే ఆయన పాత్రను బలంగా తిర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీపిక పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించింది. హీరో తల్లిగా రోహిణిది రొటీన్ పాత్రే. కాళీ వెంకట్, ఇళవరసుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు సోసోగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019