breaking news
Ad - Sakshi_Home_Sticky
-
చంద్రబాబుపై చర్యలకు ఎన్నికల సంఘం సిఫార్సు
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉల్లంఘించడంపై తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా బాబు తన ప్రసంగాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతూ సీఎం జగన్‌పై అభ్యంతరకర పదజాలంతో దూషిస్తూ, ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రసంగాలకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదు చేసింది. వాటిలో 18 ఫిర్యాదులకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ బాబుకు నోటీసులు జారీ చేయగా.. కొన్నింటికి సమాధానాలు ఇచ్చిన బాబు మరికొన్నింటికి అసలు స్పందించలేదు. బాబు సమాధానంపై సంతృప్తి చెందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత బాబు ప్రసంగాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఈ 18 ఫిర్యాదులకు సంబంధించిన వీడియో క్లిప్పులను జత చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ముఖేష్‌కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్‌కు లేఖ రాశారు. తాజాగా మరో ఫిర్యాదు ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ మంగళవారం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డి వెలగపూడి సచివాలయంలో సీఈవోకు ఫిర్యాదు అందించారు. ఈ నెల 22న జగ్గంపేట బహిరంగ సభలో బాబు ప్రసంగిస్తూ.. సీఎం జగన్, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధం కాబట్టి బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగ్గంపేట సభతోపాటు నర్సంపేట, ఎస్.కోట సభల్లో కూడా చంద్రబాబు పరుష పదజాలం వాడారని, సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యను చంద్రబాబు పదే పదే కొనసాగిస్తున్నారని, పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం అంటూ నిరుద్యోగులకు మళ్లీ దగా చేయాలని చూస్తున్నారని, వీటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. -
అంతా బాబు జట్టే.. పచ్చ కుట్రే..
సాక్షి, అమరావతి: ‘పచ్చ’ ముఠా ముసుగు పూర్తిగా తొలగిపోయింది. చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, పవన్ కళ్యాణ్, లోకేశ్, పురందేశ్వరి, బీటెక్ రవి అంతా ఒకే తానులో ముక్కలని తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వారికి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలే తప్ప, అసలు హంతకులకు శిక్ష పడటం కాదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. వివేకాను రాజకీయంగా, ఆ తర్వాత భౌతికంగానూ తొలగించుకొన్న వారితో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటకాగుతున్నారన్న విభ్రాంతికర వాస్తవం మరోసారి సాక్ష్కాత్కరించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున, ఈ కేసుపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నందున ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదన్న పులివెందుల న్యాయస్థానం తీర్పును అందరూ శిరసావహిస్తారని భావించారు. కానీ, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేయడం పచ్చ కుట్రను బయటపెట్టంది. రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా ఉన్న వివేకానందరెడ్డిని తానే ఓడించానని చంద్రబాబు నమ్మిన బంటు సీఎం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వివేకాను అంతమొందించే కుట్రకు ఎంత ముందుగా భూమికను సిద్ధం చేశారో అర్థమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు చాలా ముందుగానే స్క్రిప్టు సిద్ధం చేశారు. దస్తగిరి, సునీత, సౌభాగ్యమ్మ, షర్మిల.. ఇలా పలువురు పాత్రధారులు తెరపైకి వస్తూ వారికి ఇచ్చిన డైలాగులు చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత మరింతగా విషం చిమ్మేందుకు తెగించారు. ఓటర్లను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడాలని, సామరస్యపూర్వక రాజకీయ వాతావరణంలో ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ భావించింది. పలు న్యాయస్థానాల్లో విచారణ సాగుతున్న ఈ హత్యపై ఎవరూ మాట్లాడటం సరైన విధానం కాదని కూడా అభిప్రాయపడింది. ఇదే అంశాన్ని విన్నవిస్తూ చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, లోకేశ్, పవన్, పురందేశ్వరి, బీటెక్ రవిని ప్రతివాదులుగా చేరుస్తూ పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరింది. ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలతో న్యాయస్థానం ఏకీభవించింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడవద్దని ఈ నెల 16న తీర్పునిచ్చింది. మంచి ఉద్దేశంతో న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అడ్డగోలు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యమైన చంద్రబాబు అండ్ కోకు మింగుడు పడలేదు. దీంతో పక్కా పన్నాగంతో మొదట సునీతతో ఈ తీర్పుపై అభ్యంతరం తెలిపారు. ఆమె హైకోర్టులో ఈ తీర్పును సవాల్ చేస్తారని అందరూ భావించారు. కానీ, పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పుపై సునీత వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఈ పిటిషన్లో ప్రస్తావించారు. తద్వారా అంతా చంద్రబాబు తానులో ముక్కలేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కుట్రలో పాత్రధారుల ప్రవేశం ఇలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కొనే సత్తా లేక కుట్ర రాజకీయాలు చేస్తున్నానని చంద్రబాబు మరోసారి పరోక్షంగా చెప్పారు. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురైన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రచారంలోకి తీసుకువచ్చిన కట్టుకథను ప్రజలు ఆ ఎన్నికల్లో తిప్పికొట్టారు. ఎన్నికల తరువాత చంద్రబాబు రూటు మార్చారు. తాము చేసిన నిరాధార ఆరోపణలనే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులతో చెప్పించే సరికొత్త డ్రామాకు తెరతీశారు. ముందుగా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతతో మూడేళ్లకుపైగా డ్రామా నడిపించారు. ఆ తరువాత బాబు స్క్రిప్ట్ ప్రకారమే షర్మిలను రాష్ట్ర రాజకీయ తెరపైకి తెచ్చారు. సునీత చేస్తున్న నిరాధార ఆరోపణలనే షర్మిల కూడా వినిపిస్తున్నారు. ఇటీవల వివేకా సతీమణి సౌభాగ్యమ్మనూ తెరపైకి తెచ్చారు. వివేకా వర్ధంతి కార్యక్రమంలో సౌభాగ్యమ్మ, సునీత, షర్మిలతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వారందరి ప్రసంగాలు ఒకే రాజకీయ లక్ష్యంతో సాగడం గమనార్హం. తాజాగా పులివెందుల కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సునీత, బీటెక్ రవి ఒకేలా చంద్రబాబు పాటనే పాడారు. వివేకా శత్రువులు, హంతకులతోనే జట్టు కట్టిన సునీత దంపతులు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదంగా, సందేహాస్పదంగా ఉంది. వివేకాను 2017లో రాజకీయంగా వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్సీగా ఓడించిన బీటెక్ రవి తదితరులతో వారు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉంది. అయినప్పటికీ, వైఎస్సార్సీపీ అభ్యర్థి వివేకాను అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి బీటెక్ రవిని గెలిపించారు. వివేకాను కుట్రతో ఓడించిన ఇదే బ్యాచ్‌తో సౌభాగ్యమ్మ, సునీత దంపతులు నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉండటం వివాదాస్పదంగా మారింది. సునీత ఇటీవల మీడియా సమావేశంలోనూ చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, మహాసేన రాజేశ్ తదితరులకు కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. మరోవైపు వివేకాను కిరాతకంగా నరికి హత్య చేశానన్న దస్తగిరితోనూ సఖ్యతతో ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది. హత్య జరిగిన రోజునా సందేహాస్పదంగా.. వైఎస్ వివేకా హత్య అనంతరం ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం వెనుక సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2019 మార్చి 15న ఉదయం వివేకా తలపై తీవ్ర గాయాలతో మృతిచెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదటగా గుర్తించారు. ఆ వెంటనే వివేకా సతీమణి, కుమార్తె, అల్లుడికి సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో ఉన్న వివేకా మృతదేహం ఫొటోలు తీసి వాట్సాప్ చేశారు. అయినప్పటికీ ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. ఇక వివేకా రాసిన లేఖను బయటపెట్టవద్దని పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం ద్వారా గుండెపోటుతో మరణించారన్న ప్రచారాన్ని ఆయన కుమార్తె, అల్లుడు కొనసాగించారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. లేఖను వారు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం. -
చంద్రబాబు, లోకేశ్ ప్రకటించిన ఆస్తులు రూ.1,474 కోట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వారి ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి. అపారమైన ఆస్తులు ఉన్నా చాలా తక్కువ ఆస్తుల్ని మాత్రమే వారు బయటపెట్టినట్లు తెలుస్తోంది. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా లోకేశ్ విడివిడిగా ఆస్తులు చూపించారు. కానీ వారు కలిసే ఉంటున్నారు. ఆస్తుల్ని మాత్రం పక్కాగా పంచుకున్నారు. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నప్పటికీ, విడివిడిగా ఆస్తుల్ని చూపించడం ద్వారా తక్కువ ఆస్తిపరులని ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అఫిడవిట్లలో అధికారికంగా వారు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,474 కోట్లు. చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.931.83 కోట్లు కాగా, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.542.17 కోట్లుగా చూపారు. వారి ఆస్తుల్లో ఎక్కువ హెరిటేజ్ షేర్ల రూపంలో ఉన్నాయి. స్థిరాస్తులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా ఉండగా, కొన్ని తమిళనాడులోనూ ఉన్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం నామమాత్రంగా రెండు స్థలాలున్నాయి. వారు తమదిగా చెప్పుకునే అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో మాత్రం ఈ కుటుంబంలోని ఐదుగురిలో ఎవరికీ ఒక్క ఆస్తి కూడా లేదు. వారి సొంతిల్లు హైదరాబాద్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్, భువనేశ్వరి హెరిటేజ్ షేర్ల విలువే రూ.1102 కోట్లు చంద్రబాబు ఆస్తుల్లో ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్‌కి ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల విలువే రూ.1102.11 కోట్లు. భువనేశ్వరికి రూ.763 కోట్ల విలువైన షేర్లు ఉండగా, లోకేశ్‌కి రూ.339.11 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు, భువనేశ్వరి పేరు మీద రూ.121.41 కోట్ల స్థిరాస్తులు, రూ.815.17 కోట్ల చరాస్తులుగా చూపించారు. అలాగే భువనేశ్వరికి రూ.1.84 కోట్ల విలువైన బంగారం, రూ. 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా చూపారు. లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌కు కలిపి రూ.394 కోట్ల చరాస్తులు ఉండగా, స్థిరాస్తులు రూ.148.07 కోట్ల విలువైనవి ఉన్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణికి 2500.338 గ్రాముల బంగారం, 97.441 కిలోల వెండి, రూ.1.48 కోట్లు విలువైన వజ్రాభరణాలు ఉండగా, దేవాన్స్ వద్ద 7.5 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆస్తుల విలువ తగ్గించి చూపారు చంద్రబాబు కుటుంబం అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించింది. హైదరాబాద్ మదీనగూడలో లోకేశ్, భువనేశ్వరి పేరు మీద ఉన్న 10 ఎకరాల వ్యవసాయ భూమి విలువను రూ.100 కోట్లుగా చూపించారు. నిజానికి అక్కడ ఎకరం రూ.50 కోట్లకు పైనే ఉంటుంది. ఆ లెక్కన ఆ భూమి విలువ రూ.500 కోట్లకు పైమాటే. అలాగే ఈ భూమి వ్యవహారాన్ని చంద్రబాబు గతంలో రహస్యంగా ఉంచారు. 10 ఎకరాల్లో 5 ఎకరాలు లోకేశ్‌కి ఉన్నట్లు బయటపడినప్పుడు అది ఎలా వచ్చిందనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. నానమ్మ అమ్మణ్ణమ్మ నుంచి లోకేశ్‌కి గిఫ్ట్‌గా రాసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కుప్పంలో ఉండే అమ్మణ్ణమ్మకు ఖరీదైన ప్రాంతంలో అంత భూమి ఎలా వచ్చిందనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. మదీనగూడలోనే మరో 5 ఎకరాలను భువనేశ్వరి కొన్నట్లు చూపారు. రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల ఆస్తి కొన్న దేవాన్ష్ చంద్రబాబు మనుమడు దేవాన్ష్ రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల విలువైన ఆస్తిని కొన్నట్లు చూపడం విశేషం. జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి ఉన్న వాణిజ్య భవనాన్ని దేవాన్ష్ 2017లో కొన్నట్లు పేర్కొన్నారు. అతను పుట్టింది 2015లో. పిల్లలకు వారసత్వంగా ఆస్తి ఇవ్వడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఆ వయసులో కొన్నట్లు చూపడమే కొసమెరుపు. చంద్రబాబు పేరుతో ఉన్న స్థిరాస్థులు 1. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొడుకు లోకేశ్‌తో కలిపి 1,285 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.70.20 కోట్లుగా చూపారు. 2. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి. విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. 3. నారావారిపల్లె శేషాపురంలో ఇల్లు. విలువ రూ.43.66 లక్షలుగా పేర్కొన్నారు. భువనేశ్వరి పేరుతో స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో 5 ఎకరాల వ్యవసాయ భూమి (ఫామ్ హౌస్). దాని విలువ రూ.55 కోట్లుగా చూపారు. 2. తమిళనాడు కాంచీపురం జిల్లా సెన్నేర్ కుప్పం గ్రామంలో 2.33 ఎకరాల వాణిజ్య భూమి. విలువ రూ.30.10 కోట్లుగా చూపారు. లోకేశ్ స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో నానమ్మ గిఫ్ట్‌గా ఇచ్చిన 5 ఎకరాల వ్యవసాయ భూమి. దాని విలువ రూ.57.21 కోట్లుగా చూపారు. 2. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తండ్రి చంద్రబాబుతో కలిపి (50 శాతం వాటా) 1285 గజాల్లో నివాస భవనం. విలువ రూ.35.10 కోట్లుగా పేర్కొన్నారు. బ్రాహ్మణి స్థిరాస్థులు 1. హైదరాబాద్ మాదాపూర్‌లో 924 గజాల స్థలం. విలువ రూ.4.15 కోట్లుగా పేర్కొన్నారు. 2. రంగారెడ్డి జిల్లా మల్లాపూర్‌లో 4 వేల గజాల స్థలం. విలువ రూ.90.39 లక్షలుగా చూపించారు. 3. హైదరాబాద్ మణికొండలో 2,440 గజాల స్థలం. విలువ రూ.3.66 కోట్లుగా చూపారు. 4. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొడుకు దేవాన్ష్‌తో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల్లో వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా చూపారు. 5. చెన్నైలో 383 గజాల స్థలం. విలువ రూ.6.69 కోట్లుగా పేర్కొన్నారు. దేవాన్ష్ స్థిరాస్థులు 21. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా పేర్కొన్నారు. -
ఆర్థికాభివృద్ధి అదుర్స్
సెల్ ఫోన్ నేనే కనిపెట్టా.. ఐటీని నేనే సృష్టించా.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌నూ నేనే కట్టా.. హైదరాబాద్‌లో రింగు రోడ్డునూ నేనే వేశా.. సింధూకు బాడ్మింటన్ ఆడమని నేనే చెప్పా.. అంతెందుకు నా గైడెన్స్ మేరకే సత్య నాదెళ్ల ఇవాళ అంతటివాడయ్యాడు.. తుపాన్లనే ఆపగలిగాను.. సంపద సృష్టికి నేనే బ్రాండ్ అంబాసిడర్..’ ఇలా కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పేదెవరంటే, చంద్రబాబు అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అప్పుడు బాబు హయాంలో, ఇప్పుడు జగన్ హయాంలో దాదాపు ఒకే బడ్జెట్.. అప్పులు అప్పటి కంటే ఇప్పుడే తక్కువ.. అయినప్పటికీ సీఎం జగన్ ఈ ఐదేళ్లలో పేద ప్రజల ఖాతాల్లో వివిధ పథకాల రూపేణ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. తద్వారా ఆర్థిక చక్రాన్ని పరుగులు పెట్టించారు. అభివృద్ధి విషయంలో కొత్త పుంతలు తొక్కించారు. ఈ ఐదేళ్లలో వార్షిక సగటు వృద్ధి 6.20 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనం. అన్ని రంగాల్లోనూ స్పష్టమైన అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది. ఇందుకు కేంద్ర గణాంకాలే సాక్ష్యం. ► స్థిర ధరల ప్రకారం గత ఐదేళ్లలో జీఎస్డీపీ పెరుగుదల రూ.1,94,063 కోట్లు ► అదే బాబు పాలనలో రూ.1,28,341 కోట్లే ► కోవిడ్ సంక్షోభంలోనూ జగన్ హయాంలోనే భారీగా పెరిగిన సంపద ► స్థిర ధరల ఆధారంగా 2023–24 రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 7.35 శాతం ► బాబు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6.26 లక్షల కోట్లు ► 2023–24లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.8.20 లక్షల కోట్లు ► కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ లెక్కలేఇందుకు నిదర్శనం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ వైపు సంక్షేమాభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ.. మరో వైపు పేదరికాన్ని తగ్గించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే ముందంజలో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి, సంపద సృష్టించారనడానికి కొలమానం అ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలే. ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభాలను సైతం అధిగమించి సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో వరుసగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కోవిడ్ సంక్షోభం లేనప్పటికీ గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటు వార్షిక వృద్ధి రేటు 5.15 శాతం నమోదు కాగా, అదే సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సగటు వార్షిక వృద్ధి 6.20 శాతం నమోదైంది. పదే పదే సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లి ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు.. తన ఐదేళ్ల పాలనలో కోవిడ్ లాంటి సంక్షోభం లేనప్పటికీ సంపద సృష్టించడంలో ఎందుకు వెనుకబడ్డారో చెప్పాలి. ప్రజలు ఏది చెబితే అదే నమ్ముతారనుకోవడం ఎల్లవేళలా సాగదనే విషయం చంద్రబాబు మరిచిపోతున్నారు. తనకొక్కడికే సంపద సృష్టించడం వచ్చనే ధోరణిలో చంద్రబాబు ఇస్తున్న బిల్డప్ అంతా తుస్ అని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ద్వారా వెల్లడైంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నమోదులో టాప్ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉందని స్పష్టమైంది. ఈ గణాంకాలన్నీ 2011–12 సంవత్సరం స్థిర ధరల ఆధారంగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ గణాంకాలన్నీ పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. కోవిడ్‌లోనూ రయ్.. రయ్.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,28,341 కోట్లు పెరిగింది. అంటే మొత్తం ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 25.74 శాతం పెరిగింది. అంటే సగటు వార్షిక వృద్ధి 5.15 శాతంగా నమోదైంది. అదే సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,94,063 కోట్ల మేర పెరిగింది. అంటే ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 30.95 శాతం. వార్షిక సగటు వృద్ధి 6.20 శాతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే సంపద సృష్టించడంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో గత చంద్రబాబు పాలన కన్నా సీఎం వైఎస్ జగన్ పాలన ఎంతో మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభంతో రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రూపంలో రాబడి తగ్గిపోయినప్పటికీ రాష్టంలో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకుండా కొనసాగించే చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నారు. మరో పక్క కోవిడ్‌లోనూ పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. ఈ చర్యలతో రాష్ట్ర ఆర్థిక చక్రం ఆగిపోకుండా నిలదొక్కుకుంది. అందువల్లే జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల ఎక్కువగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.35 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ వేసిన అడుగులు చక్కటి ఫలితాలిచ్చాయి. ప్రధానంగా పారిశ్రామికాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. ఎలాంటి హడావుడి లేకుండా అన్ని ప్రాంతాలకు భారీ పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా, అవి ఉత్పత్తిని ప్రారంభించేలా అన్ని విధాలా ఊతమందించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా టాటాలు, బిర్లాలు, అదానీ, అర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతో పాటు విదేశీ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఉత్తరాంధ్రలోని అచ్యుతాపురం వద్ద జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్ (అలయన్స్ టైర్స్ గ్రూపు), అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, లారస్ ల్యాబ్ వంటి దిగ్గజ సంస్థలు, విజయనగరంలో శారడా మెటల్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోస్తాంధ్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్, కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద పెన్సులిన్ తయారీ సంస్థ లూఫిస్ ఫార్మా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఐటీసీ స్పైసెస్ పార్కు, పిడుగురాళ్ల వద్ద శ్రీ సిమెంట్స్, నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ, క్రిభ్కో ఇథనాల్, గ్రీన్‌లామ్ సొల్యూషన్స్, గోకుల్ ఆగ్రో ప్రారంభం అయ్యాయి. రాయలసీమలోని చిత్తూరులో బ్లూస్టార్, డైకిన్, హావెల్స్, యాంబర్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్స్, టీసీఎల్, వైఎస్సార్ జిల్లాలో డిక్సన్, సెంచురీ ప్లేవుడ్స్, బిర్లా గార్మెంట్స్, కర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్ వంటి భారీ పెట్టుబడులు వచ్చాయి. ► చంద్రబాబు ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ.59,970 కోట్లు ►ఈ 5 ఏళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల్లో రూ.78,514 కోట్ల పెట్టుబడులు ►వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాలేదంటూ ఎల్లో మీడియాతో కుట్ర చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. ►తప్పుడు సమాచారంతో యువతను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనే చంద్రబాబు అండ్ కోకు ఈ వాస్తవాలు కనిపించవా... ►సంక్షేమంతో పాటు సమానంగా పరిశ్రమలకు అగ్రతాంబూలం ఇస్తే నీచమైన రాతలా.. – చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి, అమరావతి ఇదీ జగన్ అంటే.. ►గత ప్రభుత్వంలా ఏటా పెట్టుబడుల సదస్సు అంటూ హడావుడి చేయలేదు. ఒక్కసారి మాత్రమే 2023లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించగా.. 386 ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఏ రాష్ట్ర పెట్టుబడుల సదస్సుకు రాని రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా విశాఖ రావడమే కాకుండా రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఐదేళ్లలో బిర్లాలు, అదానీ, మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి విచ్చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ► సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయి. మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది తిరక్కుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఎంఎస్ఎంఈలకు పునరుజ్జీవం కోవిడ్ సమయంలో రీస్టార్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్ఎంఈలు మళ్లీ ఊపిరిపోసుకున్నాయి. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలతో ఆదుకుంటోంది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. నిర్వహణ వ్యయం తగ్గించి పెద్ద పరిశ్రమలతో పోటీ పడేలా క్లస్టర్ విధానాన్ని, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రూ.118 కోట్లతో జగన్ ప్రభుత్వం ర్యాంప్ కార్యక్రమం చేపట్టింది. చంద్రబాబు సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్ఎంఈలు ఉంటే.. ఇప్పుడు ఏడు లక్షలు దాటాయని ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక కారిడార్లతో రాష్ట్రం రికార్డులు పరిశ్రమలకు అన్ని రకాల మౌలికవసతులు ఒకే చోట లభించేలా మూడు పారిశ్రామిక కారిడార్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మూడు పారిశ్రామిక కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రంగా రికార్డులకు ఎక్కింది. ►విశాఖ–చెన్నై కారిడార్(వీసీఐసీ) ►చెన్నై–బెంగళూరు కారిడార్ ►హైదరాబాద్–బెంగళూరు కారిడార్.. ఈ మూడూ అభివృద్ధి దశలో ఉన్నాయి. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఇందులో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌గా రూపుదిద్దుకుంటోంది. తిరుపతి జిల్లాలోని 2,500 ఎకరాల్లో క్రిస్ సిటీ ఏర్పాటు కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలి్పస్తోంది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. విశాఖ–చెన్నై కారిడార్(వీసీఐసీ) విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా రెండు గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్లు తీర్చిదిద్దారు. విశాఖపట్నంలోని నక్కపల్లి–రాంబిల్లి క్లస్టర్లు, చిత్తూరు నోడ్‌లో ఏర్పేడు, శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో అంతర్గత మౌలిక సదుపాయాలు కల్పించారు. వీసీఐసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్స్టర్నల్ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి స్పెషల్ జోన్‌లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్ జోన్‌లోని అచ్యుతాపురం ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేశారు. నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటుతో రూ.3,051 కోట్ల పెట్టుబడులతో 9,030 ఉద్యోగాలు కల్పించారు. అచ్యుతాపురంలో మొత్తం 2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు రాగా 60 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ► వీసీఐసీలో భాగంగా వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిలో 6,740 ఎకరాలలో పరిశ్రమల హబ్ తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. కొప్పర్తి కేంద్రంగా మోడల్ ఇండ్రస్టియల్ పార్కు, ఎంఎస్ఈ సీడీపీ, వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.2595.74 కోట్ల నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధికి కార్యాచరణ రూపొందించారు. అక్కడ 66 పరిశ్రమలు కొలువుదీరాయి. ప్లగ్ అండ్ ప్లే పరిశ్రమల కోసం ఇప్పటికే షెడ్ల నిర్మాణం పూర్తయింది. మొత్తం రూ.1,875.16 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది. హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఈ కారిడార్‌లో ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చంద్రబాబు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ► పెట్టుబడుల సదస్సు అంటూ గత ప్రభుత్వం రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయని ఎల్లో మీడియాలో ఊదరగొట్టేశారు. కనీసం అందులో 10 శాతం పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోయేది. బాబు హయాంలో కనీసం 5 శాతం పెట్టుబడులు కూడా రాలేదు. దీనిపై మీ ఎల్లో మీడియాలో రాయించగలవా.. ►బాబు హయాంలో కేంద్ర సహకారం అందినా.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్నా.. పెట్టుబడుల ప్రవాహానికి అనుకూల వాతావరణం ఉన్నా.. తన సొంత అజెండాతో పారిశ్రామిక ప్రగతిని బాబు నిర్లక్ష్యం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే పరిశ్రమలకు పట్టం కడుతున్న వేళ.. కోవిడ్ లాక్‌డౌన్‌తో రెండేళ్లు ప్రపంచమంతా పడకేసింది. అయినా జగన్ గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు. ►జగన్ పాలనలో రాష్ట్రంలో 163 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.78,514 పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. ఉత్పత్తి ప్రారంభించాయి. బాబు హయాంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు పెడితే.. జగన్ హయాంలో ఏటా రూ.15,702.8 కోట్ల పెట్టుబడులు పెట్టారు. వివిధ దశల్లో రూ.2.46 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందం జరిగిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. అదనంగా దావోస్ పర్యటనలో మరో రూ.1,26,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా యువతకు 38 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక ఫోన్ కాల్ దూరంలో మీకు నేను ఉన్నానంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఇచ్చిన అభయం వారి నమ్మకాన్ని రెట్టింపు చేసింది. గత మూడేళ్ల నుంచి పూర్తిగా 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు ఆధారంగా నిర్వహిస్తున్న సులభతర వాణిజ్యం సర్వేలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 6 లక్షల మందికిపైగా ఉపాధి ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా రాష్ట్రంలో 6 లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తోంది. ఎంఎస్ఎంఈలు ఒక సంఘంగా ఏర్పడి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునే విధంగా క్లస్టర్ రూపంలో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశారు. ఇందుకు ప్రతి జిల్లాలో కనీసం రెండు చొప్పున మొత్తం 54 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల్ని అందించేలా మరో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మరో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో టెక్నాలజీ సెంటర్ కొనసాగుతోంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో ఈ టెక్నాలజీ సెంటర్ అభివృద్ధి చేస్తున్నారు. బంధం కొనసాగిస్తాం ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టిన తాము భవిష్యత్తులో కూడా అదే బంధాన్ని కొనసాగిస్తాం. ఇందులో భాగంగా 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. రిలయన్స్ రిటైల్ ద్వారా రాష్ట్రంలో 1.20 లక్షల మంది కిరాణా వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాం. 6,000 గ్రామాల్లో సేవలు అందిస్తున్న రిలయన్స్ రిటైల్ ద్వారా రాష్ట్రంలో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలి్పస్తున్నాం. – ముఖేశ్ అంబానీ రెండు నెలల్లో రెండు యూనిట్లు ఆదిత్య బిర్లా గ్రూపు ద్వారా రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేశాం. వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఆరు వ్యాపారాల్లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. – కుమార్ మంగళం బిర్లా అర నిమిషంలోనే ఒప్పించారు మే నెలలో సీఎం జగన్‌ను కలిసి 30 సెకన్లు మాత్రమే మాట్లాడా. ఈ సందర్భంగా మా అబ్బాయి బయో ఇథనాల్ ప్లాంట్ స్థాపనకు వివిధ రాష్ట్రాలు పరిశీలిస్తున్న విషయం చెప్పా. ఎక్కడో ఎందుకు? మా రాష్ట్రంలో పెట్టండి అని సీఎం ఆహా్వనించారు. బయో ఇథనాల్ పాలసీని యూనిట్ ప్రారంభమయ్యే సరికి రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఆరు నెలల్లోనే రాజమహేంద్రవరంలో యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. –సీపీ గుర్నానీ, సీఈవో, టెక్ మహీంద్రా రాష్ట్రం వైపు ఐటీ దిగ్గజ సంస్థల చూపు దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రంలో తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఇన్ఫోసిస్, విప్రో, రాండ్‌స్టా్టండ్, బీఈఎల్, అమెజాన్ డీసీ వంటి అనేక దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. బీపీఓ కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలిచిన విశాఖ నగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్(డీసీ)ను ఆకర్షిస్తోంది. ఇన్ఫోసిస్ రాష్ట్రంలో తొలి డెవలప్మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడంతో.. విప్రో కూడా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. విశాఖ అనగానే పల్సస్ గ్రూపు, డబ్ల్యూఎన్ఎస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బీపీవో కార్యకలాపాలే కనిపించేవి. ఇప్పుడు బీచ్ ఐటీ డెస్టినీ పేరుతో విశాఖకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ల ఆకర్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఐటీ హబ్‌గా విశాఖ గత నాలుగేళ్లుగా రాష్ట్రంలోని ఐటీ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరిగాయి. చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643గా ఉంది. అందులో సగం మందికి ఉద్యోగాలు దివంగత నేత వైఎస్సార్ హయాంలో వచ్చినవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కొత్తగా 47,908 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 75,551కు చేరుకుంది. స్టార్టప్స్ కూడా 161 నుంచి 586కు చేరాయి. స్టార్టప్స్‌లో 2019 నాటికి 1,552 మంది పనిచేస్తుంటే ఇప్పుడు ఆ సంఖ్య 55,669కు చేరింది. ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) చెబుతున్నవే. తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ‘కల్పతరువు’తో పాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో ముందు వరుస పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటమే కాకుండా అధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల గుంటూరులో వెల్కమ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను ప్రారంభించాం. ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల పార్క్ ప్రారంభిస్తున్నాం. – సంజయ్ పూరి, ఐటీసీ సీఈవో
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019