Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

IPL 2024 PBKS VS MI: బుమ్రాను భయపెట్టిన పంజాబ్‌ బ్యాటర్‌.. ఊహలకందని స్వీప్‌ షాట్‌ సిక్సర్‌

Published Fri, Apr 19 2024 12:08 PM

IPL 2024 PBKS VS MI: Ashutosh Sharma Stunning Sweep Shot Six Against Jasprit Bumrah Goes Viral - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి ముచ్చెమటలు పట్టించారు. 184 పరుగుల లక్ష్య ఛేదనలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని పంజాబ్‌ను అశుతోష్‌ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్‌ సింగ్‌ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో తిరిగి మ్యాచ్‌లో నిలబెట్టారు. అయితే ఆఖర్లో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. 

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడినా ఆశుతోష్‌ ఆడిన ఇన్నింగ్స్‌ మాత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆశుతోష్‌ ఆడిన కొన్ని షాట్లు క్రికెట్‌ పండితులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించాయి. బుమ్రా బౌలింగ్‌లో ఆడిన ఓ షాట్‌ అయితే న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంది. ప్రపంచ బ్యాటర్లనంతా గడగడలాడించే బుమ్రా బౌలింగ్‌లో అశుతోష్‌ ఊహలకందని స్వీప్‌ షాట్‌ సిక్సర్‌ కొట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇలాంటి షాట్‌ ఆడటం దాదాపుగా అసాధ్యం.

అయితే అశుతోష్‌ మాత్రం​ ఏమాత్రం తడబడకుండా  ఈ షాట్‌ను అద్భుతంగా ఎగ్జిక్యూట్‌ చేశాడు. అశుతోష్‌ ఈ షాట్‌ ఆడిన విధానం చూసి ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా నోరెళ్లబెట్టాడు. మ్యాచ్‌ అనంతరం ఈ సిక్సర్‌ గురించి మాట్లాడుతూ నమ్మశక్యంగా లేదని అన్నాడు. ఈ షాట్‌ చూసిన క్రికెట్‌ అభిమానులైతే బుమ్రా బౌలింగ్‌ ఇలా కూడా సిక్సర్‌ కొట్టొచ్చా అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అశుతోష్‌ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్‌లో దాదాపు ప్రతి షాట్‌ అణిముత్యమే అని ఫ్యాన్స్‌ కొనియాడుతున్నారు. టీమిండియా నయా 360 ప్లేయర్లంటున్నారు.  అశుతోష్‌ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. సూర్యకుమార్‌ యాదవ్‌ (53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (25 బంతుల్లో 36;2 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్‌ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో పంజాబ్‌.. శశాంక్‌ సింగ్‌ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అశుతోష్‌ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగినప్పటికీ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ బుమ్రా (4-0-21-3), గెరాల్డ్‌ కొయెట్జీ (4-0-32-3), అద్భుతంగా బౌలింగ్‌ చేసి పంజాబ్‌ ఓటమిని అడ్డుకున్నారు.


 

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250