Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Japnit Ahuja: డిజిటల్‌ జెండర్‌ గ్యాప్‌ను కోడింగ్‌ చేసింది!

Published Fri, Apr 12 2024 4:21 AM

Go Girl: Free Coding Lessons, Japnit Ahuja Is Closing Digital Gender Gap - Sakshi

స్త్రీలు సాంకేతికంగా కూడా సాధికారిత సాధించాలనే లక్ష్యంతో వారికి ఉచితంగా కోడింగ్‌ పాఠాలు నేర్పుతోంది ఢిల్లీవాసి 23 ఏళ్ల జష్నిత్‌ అహుజా. కోడింగ్‌ తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. ఈ రకంగా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆశాజ్యోతిగా మారింది జప్నిత్‌. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు ఉచితంగా డిజిటల్‌ పాఠాలు నేర్పింది. వంద మంది వాలంటీర్ల బృందానికి నాయకత్వం వహిస్తోంది.

ఢిల్లీకి చెందిన జప్నిత్‌ అహుజాకు కోడింగ్‌ అంటే చాలా ఆసక్తి. దాంతో కోడింగ్‌ నేర్చుకోవడం మీదనే దృష్టిపెట్టింది. అదే సమయంలో ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. అదేమంటే, కోడింగ్‌ రంగంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనీ, ఆ ఉన్న వారిలో కూడా చాలామందికి దానిపై తగినంత పరిజ్ఞానం లేదనీ. మిగిలిన వారితో పోల్చితే కోడింగ్‌ తెలిసిన వాళ్లకి ఉద్యోగావకాశాలు కాసింత ఎక్కువగానే దొరుకుతాయి. అయితే ఆ రంగంలో పురుషులదే పై చేయి. దాంతో సాంకేతికపరంగా ఏమైనా ఉద్యోగాలు ఉంటే కోడింగ్‌లో వారే ముందుకు దూసుకుపోవడం వల్ల ఆ ఉద్యోగాలు కూడా వారే ఎక్కువగా దక్కించుకోగలుగుతున్నారు.

ఇప్పటిదాకా స్త్రీలు ఎన్నో రంగాలలో పట్టుదలతో కృషి చేసి, పై చేయి సాధించగలుగుతున్నప్పుడు కోడింగ్‌లో మాత్రం పట్టు ఎందుకు సాధించకూడదు... అని ఆలోచించింది.

అంతే... ముందు తాను ఆ రంగంలో బాగా కృషి చేసింది. పట్టుదలతో కోడింగ్‌ నేర్చుకుంది... ఆ రకంగా అందులో చకచకా పై మెట్టుకు చేరిపోగలిగింది. తనలాగే మరికొందరు ఆడపిల్లలకు కూడా కోడింగ్‌ నేర్పితేనో... అనుకుంది. అలా అనుకోవడం ఆలస్యం... ఇతర ఆమ్మాయిలను కొందరిని పోగు చేసి తనకు తెలిసిన దానిని వారికి ఉచితంగా పాఠాలు నేర్పడం ఆరంభించింది.

అలా తన 16వ ఏట ఆమె ‘గో గర్ల్‌’ అనే సంస్థను స్థాపించింది. అయితే భాష సమస్య రాకుండా వారికి వచ్చిన స్థానిక భాషలోనే ఉచితంగా కోడింగ్‌ను నేర్పడం ఆమె ప్రత్యేకత. తోటి ఆడపిల్లలను సాంకేతికంగా ఎదిగేలా చేయడం కోసం ఎంచుకున్న లక్ష్యం, అందుకు ఆమె చేసిన కృషీ వృథా పోలేదు. చాలామంది అమ్మాయిలు ఆమె దగ్గర కోడింగ్‌ నేర్చుకుని మంచి ఉద్యోగావకాశాలను సాధించుకోగలిగారు.

అలా తనకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తన వయసు ఆడపిల్లలకే కాదు, తల్లి వయసు స్త్రీలకు కూడా కోడింగ్‌ నేర్పడం మొదలు పెట్టింది. అలా తనకు 23 ఏళ్లు వచ్చేసరికి చిన్న, పెద్ద కలిసి దాదాపు రెండు వేల మందికి పైగా ఆమె వద్ద కోడింగ్‌ నేర్చుకుని సాంకేతికంగా అభివృద్ధి చెంది, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆరవ తరగతి చదివేటప్పుడే కోడింగ్‌ రంగంలో సాధించిన ప్రావీణ్యం బాల మేధావిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు స్కూల్‌ నుంచి రాగానే అమ్మానాన్న ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేలోగా వారికోసం ఎదురు చూస్తూ రకరకాల వెబ్‌సైట్లకు రూపకల్పన చేసేదానిని. అప్పుడు నాన్న నాతో.. ‘ఈ పిచ్చి పిచ్చి వెబ్‌సైట్లు కాదు బేబీ... నువ్వు నాసా సైంటిస్ట్‌గా ఎదగాలి. తలచుకుంటే నీకదేమీ ఒక లెక్కలోనిది కాదు’ అని చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది.

అలా ఎయిత్‌ క్లాస్‌కు వచ్చేసరికి పెద్దయ్యాక నేను చేయవలసింది ఉద్యోగం కాదని... సాంకేతికంగా అభివృద్ధి చెందడం, దానిద్వారా నేను నేర్చుకున్న పాఠాలను పదిమందికీ చెప్పడంలోనే ఎంతో థ్రిల్‌ ఉందనీ అర్థమైంది. నా దగ్గర కోడింగ్‌ పాఠాలు నేర్చుకున్న వారే తమంతట తాము స్వచ్ఛందంగా ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ‘కోడింగ్‌ ఫర్‌ ఉమెన్‌ బై ఉమెన్‌’ కాన్సెప్ట్‌ మాకు బాగా ఉపకరించింది.

అంతేకాదు, డిజిటల్‌ జెండర్‌ గ్యాప్‌ అనే వివక్షను పూడ్చాలన్న నా స్వప్నం సాకారం అయ్యేందుకు ఉపకరించింది. ఏమైనా పిల్లలు గ్యాడ్జెట్స్‌తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లు వాటితో ఏం చేస్తున్నారో... తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. దానిని వారు మంచికే ఉపయోగిస్తున్నారు అని గుర్తించగలిగితే ఆ దిశగా వారిని ప్రోత్సహించడం మంచిది. నా తల్లిదండ్రులు కోడింగ్‌పై నాకున్న ప్యాషన్‌ను గుర్తించకుండా ఏవో పిచ్చి ఆటలు ఆడుతున్నాను అనుకుని దానికి అడ్డుకట్ట వేసి ఉంటే  నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేదానిని కాను’’ అని ఆమె చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి.      

∙కోడింగ్‌లో
శిక్షణ పొందుతున్న
అమ్మాయిలు

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250