Akshay Tritiya 2023: Key things to keep in mind while buying gold this time - Sakshi
Sakshi News home page

Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...

Published Fri, Apr 14 2023 2:36 PM

Akshay Tritiya 2023 Key things to keep in mind while buying gold - Sakshi

అక్షయ తృతీయ హిందువులకు పవిత్రమైన రోజు. దీన్ని అఖ తీజ్ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజున బంగారం కొంటే అంతులేని సిరి సంపదలు కలుగుతాయని భావిస్తారు.

అయితే ఏప్రిల్ 1 నుంచి బంగారు వస్తువులు, ఆభరణాల కొనుగోలుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగారం  కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు మోసపోకుండా గమనించాల్సిన విషయాలు తెలుసుకోవడం అవసరం. బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్స్ (BIS) ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించడాన్ని నిషేధించింది.

బంగారం స్వచ్ఛతను పరిశీలించడం ఎలా?
HUID హాల్‌మార్క్ 3 మార్కులను కలిగి ఉంటుంది. BIS లోగో, బంగారం స్వచ్ఛత, ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID ఉంటాయి. ఒక్కో బంగారు వస్తువు లేదా ఆభరణానికి ఒక్కో విశిష్టమైన ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ ఉంటుంది.

 

BIS లోగో
BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్స్. ప్రతి బంగారు వస్తువు, ఆభరణంపైనా BIS లోగో ఉంటుంది. ఇది ఉంటే ఆ ఆభరణం BIS అధీకృత ల్యాబ్‌లో పరీక్షించి ధ్రువీకరించినట్లు అర్థం. కొనుగోలుదారులు బంగారు ఆభరణంపైనా ఈ లోగో ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. భారతదేశంలోని బంగారు వస్తువులు, ఆభరణాల స్వచ్ఛతను ధ్రువీకరించే ఏకైక సంస్థ BIS.

స్వచ్ఛత గ్రేడ్
ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారాన్ని ధ్రువీకరించే మరో గుర్తు ఫైన్‌నెస్ నంబర్, క్యారెట్ (KT లేదా Kగా పేర్కొంటారు). వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కూడిన బంగారు మిశ్రమాలలో నాణ్యతను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం చాలా మృదువైనది కావడంతో ఆభరణాల కోసం ఇతర లోహాలను దీనికి కలుపుతారు. 916 అనేది ఫైన్‌నెస్ నంబర్. 22 క్యారెట్ల బంగారానికి మరో పదం. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల బరువు ఉంటే అందులో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.

6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ (HUID)
బంగారు ఆభరణాలను అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్‌లో మాన్యువల్‌గా ప్రత్యేక నంబర్‌తో స్టాంప్ చేస్తారు. ప్రతి ఆభరణానికి ప్రత్యేకమైన HUID ఉంటుంది. ఇది విశ్వసనీయతకు కీలకం.

పాత బంగారు ఆభరణాలు?
ఇది వరకే ఉన్న నిబంధనల ప్రకారం.. వినియోగదారుల వద్ద ఉన్న పాత హాల్‌మార్క్ ఆభరణాలు కూడా చెల్లుబాటులో ఉంటాయి. BIS రూల్స్ 2018 సెక్షన్ 49 ప్రకారం..  ఆభరణాలపై పేర్కొన్న  దానికంటే తక్కువ స్వచ్ఛతతో ఉన్నట్లు గుర్తించినట్లయితే కొనుగోలుదారులు నష్టపరిహారం పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement