Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

టీడీపీ ‘తమ్ముళ్ల’ నిరుత్సాహం..

Published Fri, Apr 19 2024 2:05 AM

- - Sakshi

శ్రీసత్యసాయి జిల్లాలో నామినేషన్ల తొలిరోజే వెలవెల

పల్లె సింధూర నామినేషన్‌కు జనం కరువు

ఫలించని మాజీ మంత్రి పరిటాల సునీత ప్లాన్‌

రాప్తాడు నుంచి ప్రొఫెసర్‌ రాజేష్‌ నామినేషన్‌

సాక్షి, అనంతపురం: ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టంలోనే టీడీపీ కథ తేలిపోయింది. మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతకు తొలిరోజే షాక్‌ తగిలింది. రాప్తాడు బరిలో ఉంటానని ముందుగానే ప్రకటించిన ప్రొఫెసర్‌ రాజేష్‌ స్వతంత్ర అభ్యర్థిగా తొలిరోజే నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన రాప్తాడు టీడీపీ టికెట్‌ ఆశించిన సంగతి తెలిసిందే. ఇక మరో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి గురువారం నామినేషన్‌ పత్రాలు సమర్పించగా, జనం కరువయ్యారు.

జనంలేక.. నానా హంగామా..
భారీ జనసమీకరణతో ఆర్భాటంగా నామినేషన్‌ వేయాలని భావించిన ‘పల్లె’ కుటుంబ సభ్యులకు కార్యకర్తలు ఝలక్‌ ఇచ్చారు. భోజన వసతి ఏర్పాటు చేసి.. మద్యం, డబ్బు ఎరగా వేసి ఆహ్వానించినా జనం పెద్దగా స్పందించలేదు. ఓడిపోయే వారి వెంట ఎందుకు నడవాలని కార్యకర్తలూ రాలేదు. దీన్ని కవర్‌ చేసుకునేందుకు తెలుగు ‘తమ్ముళ్లు’ మద్యం మత్తులో పుట్టపర్తి రోడ్ల వెంట ఓవరాక్షన్‌ చేస్తూ.. సామాన్యులను ఇబ్బందులకు గురి చేశారు.

బైక్‌ల సైలెన్సర్లు తీసేసి పెద్దపెద్ద శబ్ధాలతో హడావిడి చేశారు. అనంతరం కొందరు తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయం ముందుకు వెళ్లి హంగామా చేశారు. ప్రచారం రథం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అర్బన్‌ సీఐ కొండారెడ్డి అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు.

‘పరిటాల’కు రెబల్స్‌ బెడద..
రాప్తాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పరిటాల సునీతను అధిష్టానం ఖరారు చేసింది. అయితే ధర్మవరం టికెట్‌ ఆశించి.. పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వడంతో ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ రాప్తాడు నుంచి పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. రోజుకొకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. మిగతా ఎక్కడా నాయకులే లేరా? పరిటాల కుటుంబానికే టికెట్‌ ఇవ్వాలా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాప్తాడు టీడీపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్‌ రాజేష్‌.. తొలిరోజే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో పరిటాల కుటుంబానికి తొలిరోజే షాక్‌ తగిలింది.

‘తమ్ముళ్ల’ నిరుత్సాహం..
ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినా.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రాలేదు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతే కారణంగా కార్యకర్తలెవరూ పెద్దగా స్పందించడం లేదు. చాలా చోట్ల అభ్యర్థులను మార్చాలని అధిష్టానానికి విన్నవించినా.. చంద్రబాబు – నారా లోకేశ్‌ వినకుండా.. వారినే బరిలో దింపడాన్ని చాలామంది సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

దీంతో టీడీపీలో కొందరు నాయకులు కొనసాగుతున్నా.. వారు అనుచరులందరినీ అధికార పార్టీ వైపు పంపిస్తున్నారు. హిందూపురం పార్లమెంటు వ్యాప్తంగా రోజుకు సగటున వంద పైగా కుటుంబాలు వైఎస్సార్‌సీపీ గూటికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనం.

తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
కొత్తచెరువు:
‘పల్లె’ నామినేషన్‌ అనంతరం గురువారం సాయంత్రం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన కమ్మ, బోయ సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జయప్ప నాయుడు, బోయ రామాంజి పుట్టపర్తిలో జరిగిన ‘పల్లె’ సింధూర నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీలో తాము గొప్ప అంటే తాము గొప్ప అంటూ ఘర్షణ పడ్డారు. అనంతరం జయప్ప నాయుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు.

దీంతో రామాంజి పుట్టపర్తి, భైరాపురంలోని తన బంధువర్గాన్ని ఓ ఆటోలో తీసుకుని కమ్మవారిపల్లి వెళ్తున్నాడు. అయితే బండ్లపల్లి క్రాస్‌ సమీపంలో జయప్ప ఎదురుపడటంతో అతనిపై దాడికి దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న జయప్ప నాయుడు వర్గీయులు సైతం రామాంజి బంధువులపై దాడులు చేశారు. ఒకానొక దశలో ఆటోకు సైతం నిప్పుపెట్టాలని చూడగా... కొత్తచెరువుకు చెందిన ఓ టీడీపీనేత ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ ఘటనలో భైరాపురం గ్రామ యువకులు గాయపడినట్లు తెలుస్తోంది.

ఇవి చదవండి: అక్కడ వ్యాపారుల సొమ్మంతా ప్రసాదార్పణం..

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250