Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

#MI: హార్దిక్‌ రాగానే కోపంగా వెళ్లిపోయిన మలింగ! పొలార్డ్‌ చేయిపట్టి మరీ..

Published Thu, Mar 28 2024 7:54 PM

IPL 2024 Lasith Malinga Leaves Chair For Hardik Walks Away Fans Reacts - Sakshi

ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ అంటే చాలు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యానే ట్రెండింగ్‌లోకి వస్తున్నాడు. సారథిగా తప్పిదాలు చేయడమే గాకుండా.. సీనియర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నాడంటూ నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు.

ఐపీఎల్‌-2024లో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడినపుడు.. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ పొజిషన్‌ను పాండ్యా పదే పదే మారుస్తూ అతడిని పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. ప్రధాన పేసర్‌, ఎంఐ సీనియర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను కాదని తానే బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ ఏడో స్థానంలో వచ్చి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఆరు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తాజాగా ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది.

పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో 31 రన్స్‌ తేడాతో ప్రత్యర్థి చేతిలో పరాజయం చవిచూసింది. ఇక్కడ కూడా పాండ్యా.. అరంగేట్ర క్వెనా మఫాకాతో ముంబై బౌలింగ్‌ ఎటాక్‌ను ఆరంభించాడు. మరోసారి.. బుమ్రాను పక్కనపెట్టి మూల్యం చెల్లించాడు.

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌ లసిత్‌ మలింగతో పాండ్యా ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. మ్యాచ్‌ అనంతరం కరచాలనం చేస్తున్న సమయంలో మలింగను నెట్టివేసినంత పనిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది.

అనంతరం మరో వీడియో కూడా తెరమీదకు వచ్చింది. ఇందులో బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పొలార్డ్‌, మలింగ కుర్చీల్లో కూర్చుని ఉండగా.. హార్దిక్‌ అక్కడికి వచ్చాడు. ఇద్దరూ అక్కడి నుంచి లేచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పొలార్డ్‌ను చెయ్యిపట్టి ఆపిన మలింగ.. కుర్చీ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న పాండ్యా పొలార్డ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అతడు కూడా ముభావంగా ఉన్నట్లు కనిపించింది. ఏదేమైనా.. ముంబై ఇండియన్స్‌లో ఇప్పుడు పాండ్యా పెత్తనమే నడుస్తోందని.. ఇది ఎవరికీ మింగుడుపడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250