Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ప్రభం‘జనం’.. సీఎం జగన్‌ బస్సు యాత్రకు నీరాజనాలు

Published Fri, Mar 29 2024 4:54 AM

Today the bus trip will continue in Kurnool district - Sakshi

నంద్యాల జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్రకు నీరాజనాలు 

జన సంద్రంలా నంద్యాల.. బహిరంగ సభకు పోటెత్తిన జనం 

నేడు కర్నూలు జిల్లాలో కొనసాగనున్న యాత్ర 

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్‌ కలిస్తే ప్రభంజనమేననే మరోసారి రుజువైంది. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రెండో రోజు జైత్రయాత్రలా కొనసాగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ క్రాస్‌ వద్ద సీఎం జగన్‌ బస చేసిన శిబిరం వద్దకు గురువారం ఉదయం నుంచే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎంను కలిశారు.

ప్రజల కేరింతల మధ్య రెండో రోజు బస్సు యాత్ర ఉదయం 9.30 గంటలకు మొదలైంది. ఆళ్లగడ్డ క్రాస్‌ నుంచి నల్లగట్ల వరకూ కిలోమీటర్ల కొద్దీ జనం బారులు తీరారు. సీఎం తమ వద్దకు చేరుకోగానే ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై బంతిపూల వర్షం కురిపించారు. నల్లగట్ల వద్ద అంబు­లెన్స్‌కు దారి ఇచ్చిన జగన్‌.. శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల సమీపంలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులను ఆశీర్వదించారు. ఎర్రగుంట్ల గ్రామముఖ ద్వారంలో సీఎం జగన్‌ బస్సుపై బంతి పూలవర్షం కురిపిస్తూ హారతులు ఇస్తూ ప్రజలు ఘనస్వాగతం పలికారు.

ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో మమేకమై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రతి ఇంటికీ మంచి చేశారంటూ సీఎం జగన్‌పై ఎర్రగుంట్ల వాసులు ప్రశంసలు కురిపించారు. అనంతరం ఎర్రగుంట్ల నుంచి శిరివెళ్ల మండలం గోవిందపల్లి, చాబోలు మీదుగా బస్సు యాత్ర సాగింది. చాబోలులో భోజన విరామం తరువాత నంద్యాల నియోజకవర్గం నూనెపల్లికు చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్రకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. 

నంద్యాలలో జనహోరు..
నంద్యాలలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ ప్రారంభమవుతుందని ప్రకటించినా ఉదయం 11 గంటల నుంచే జనప్రవాహం మొద­లైంది. ఎండ వేడి పెరిగేకొద్దీ జనం పెరిగారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఆళ్లగడ్డ క్రాస్‌ నుంచి నూనెపల్లి వరకూ జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టడంతో గంట ఆలస్యంగా సాయంత్రం 5.30 గంటలకు సీఎం జగన్‌ చేరుకున్నారు.

సభా వేదికపైకి సీఎం జగన్‌ చేరుకోగానే జనం హర్షద్వానాలు, కేరింతలతో సభా ప్రాంగణం హోరెత్తింది. సీఎం జగన్‌ ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అభివాదం చేస్తున్నప్పుడు జనం జయహో జగన్‌ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. సంక్షేమాభివద్ధి పథకాల ద్వారా చేసిన మంచి, రాష్ట్రం రూపురేఖలు మార్చేలా చేసిన అభివృద్ధిని వివరించడంతోపాటు 2014–19 మధ్య టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన మోసాలను సీఎం జగన్‌ ఎండగట్టారు.

మళ్లీ ఇప్పుడు అదే కూటమితో చంద్రబాబు పోటీ చేస్తుండటాన్ని ప్రస్తావించిన­ప్పుడు విశేష స్పందన లభించింది. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు.. మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ సీఎం జగన్‌ పిలుపునిచ్చినప్పుడు మేమంతా సిద్ధం అంటూ దిక్కులుపిక్కటిల్లేలా జనం నినదించారు.

విద్యార్థుల ఉత్సాహం..
నంద్యాల సభ రాత్రి 7 గంటలకు ముగియగా అనంతరం బస్సు యాత్ర తిరిగి ప్రారంభమైంది. సీఎం జగన్‌ బస్సు యాత్ర కడప–కర్నూలు జాతీయ రహదారిపై నిర్వహించనున్నట్లు తెలియడంతో ఆర్‌జీ­ఎం కాలేజీ విద్యార్థులు మధ్యాహ్నం నుంచే భారీగా తరలి వచ్చారు. రాత్రి 8.30 గంటలకు సీఎం జగన్‌ బస్సు చేరుకోగానే విద్యార్థులు హర్షధ్వానాలు చేయగా వారికి సీఎం జగన్‌ అభివాదం చేశారు. అక్కడి నుంచి బస్సు యాత్ర పాణ్యం నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

సుగాలిమిట్ట వద్ద ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. హుస్సేనాపురం, ఓర్వకల్లుల్లో రాత్రి 9.30 గంటలైనా జనం రోడ్డుపైనే నిలబడ్డారు. నన్నూర్‌ వద్ద నారాయణ కాలేజీ విద్యార్థులను యాజమాన్యం నియంత్రించినా లెక్క చేయకుండా భారీ ఎత్తున రహదారిపైకి చేరుకుని బంతిపూల వర్షంతో స్వాగతం పలికారు. నన్నూర్‌ వద్ద బస్సు యాత్ర కర్నూలు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

కర్నూలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇంతియాజ్‌ సార«­ద్యం­­లో నేతలు అక్కడ సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు.  పెద్దటే­కూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురం మీదుగా పెంచికలపాడు వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ రాత్రి 11.06 గంటలకు చేరుకున్నారు.   

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250