Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

సర్వేలన్నీ సీఎం జగన్ వైపే.. పచ్చ బ్యాచ్‌ సైలెంట్‌!

Published Wed, Apr 17 2024 12:28 PM

Kommineni Srinivasa Rao Analysis On Survey Reports Of AP 2024 Elections - Sakshi

ఏపీలో ఏ పార్టీ గెలవబోతోంది? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమా? ఈ ప్రశ్న సహజంగానే ఎన్నికల సమయంలో వస్తుంది. కానీ, ఈసారి గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తి  నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇందుకు రెండు ప్రధాన కారణాలు కనిపిస్తాయి. ఒకటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో తీసుకువచ్చిన పెనుమార్పులు, సంక్షేమంలో ఆయన చేపట్టిన విప్లవాత్మక చర్యలు, అభివృద్దిలో కొత్త మోడల్.. ఇవన్ని దేశం అంతటిని ఆకర్షిస్తున్నాయి. సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఆ మోడల్ విజయవంతం అయినట్లుగా అంతా భావిస్తారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఏపీలో అమలు అవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలించి వెళుతున్నాయి. ఈ నేపద్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు అంటే ఏపీలో ఉన్న పేద ప్రజల విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాళ్లా, వేళ్లపాడి జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కూటమి 2014లో గెలిచినా, ఆ తర్వాత ప్రభుత్వం నడపడంలో విఫలం అయింది. బీజేపీకి టీడీపీ దూరం అయితే, టీడీపీకి జనసేన అప్పట్లో జెల్లకొట్టింది. ఈ మూడు పార్టీలు పరస్పరం విమర్శించుకున్నాయి. ప్రధాని మోదీని చంద్రబాబు తీవ్రంగా దూషిస్తే, మోదీ వచ్చి చంద్రబాబు అంత అవినీతిపరుడు లేడని ఎద్దేవ చేసి వెళ్లారు. మరోవైపు చంద్రబాబు, లోకేష్ లను తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ ఒక భారీ సభ పెట్టి మరీ తిట్టిపోశారు. అలాగే పవన్ కళ్యాణ్ ను కూడా టీడీపీ నేతలు చులకన చేసి మాట్లాడారు. అయినా తిరిగి మళ్లీ ఈ మూడు పార్టీలు ఒక కూటమి కట్టి ఎన్నికల గోదాలోకి వచ్చాయి. ఈ ఎన్నికలలో సీఎం జగన్ మోడల్ ప్రభుత్వంపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారన్న అభిప్రాయం నెలకొంది.

నిజానికి ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో టీడీపీ  కూటమి అధికారంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ పార్టీకి పెద్ద పోటీగా కనిపించదు. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరిలకు ఒక విశ్వసనీయత లేకపోవడమే. దీనిని గమనించిన తెలుగుదేశం మీడియాగా పేరొందిన ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాదాకృష్ణ, టీవీ-5 నాయుడు వంటివారు మీడియా కూటమి కట్టి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. రోజూ కొన్ని లక్షల పత్రికలను టీడీపీ కరపత్రాల కన్నా అద్వాన్నంగా ముద్రించి ప్రజలపై వెదజల్లుతున్నారు. తద్వారా తమ ప్రతిష్ట పూర్తిగా పోయిందన్న బాధ లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు.

పలు చోట్ల ఈనాడు మీడియా అయితే తన పత్రికలను ఉచితంగా పంచుతోందని సమాచారం వస్తోంది. టీడీపీ కూటమి కన్నా, ఈ మీడియా కూటమే చాలా పట్టుదలగా పనిచేస్తోంది. దానికి చాలా కారణాలు  ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది టీడీపీ కూటమి వస్తే, చంద్రబాబు లేదా ఆయన కుమారుడు లోకేష్లలో ఎవరైనా ముఖ్యమంత్రి అయితే తాము ఆడింది ఆటగా సాగుతుందన్నదే రామోజీ, రాధాకృష్ణ వంటివారి అభిప్రాయం. అందుకోసం రాజకీయ పార్టీల కన్నా ఘోరమైన రీతిలో వీరు కుట్రలకు పాల్పడుతున్నారు.

పచ్చి అబద్దాలను రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు.  ఈ పరిణామాల కారణంగా ఏపీ శాసనసభ ఎన్నికలపై అందరి దృష్టి పడిందని చెప్పాలి. దీనికోసం గత ఏడాది కాలంగా అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. గత కొద్దినెలలుగా ఈ సర్వేల జోరు మరీ పెరిగింది. ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఆరంభం కాబోతోంది. దాంతో సర్వేలన్నీ ఈరోజే తమ ఫలితాలు అందించాయి.  వీటి ప్రకారం చూస్తే  అందుబాటులోకి వచ్చిన సర్వేలలో అత్యధికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఒక్క సీ-ఓటర్ సర్వే సంస్థ మాత్రం టీడీపీ కూటమికి అనుకూలంగా ఫలితాన్ని ఇచ్చింది. దానిని పరిశీలిస్తే, గతంలో వారు ఏ అంకెలు ఇచ్చారో, వాటినే కొనసాగించినట్లు అనిపిస్తుంది. ఆ అంకెలను చివరికి టీడీపీ శ్రేణులు కూడా నమ్మలేని విధంగా ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు.  దానిని పక్కనబెడితే మిగిలిన సర్వేలను పరిశీలిద్దాం.  

ఏప్రిల్ పదహారు వరకు చేసిన సర్వేలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సర్వేలలో వైఎస్సార్సీపీకి కనీసం 97 నుంచి గరిష్టంగా 156 వరకురావచ్చని అంచనా వేస్తున్నాయి. తెలుగుదేశం కోసం సర్వేలు చేస్తుందని భావించే ఒక సంస్థ కూడా వైఎస్సార్‌సీపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అంచనా వేసింది. టైమ్స్ నౌ అనే ప్రతిష్టాత్మక జాతీయ సంస్థ, ఈటీజీ గ్రూపు చేసిన సంయుక్త సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 శాతం ఓట్లతో 21-22 లోక్ సభ స్థానాలు వస్తాయని తెలిపింది. ఈ సంస్థ లోక్సభ సీట్లనే ప్రాతిపదికగా తీసుకుని సర్వే చేసింది. ఈ లెక్కన గతంలో మాదిరే వైఎస్సార్‌సీపీకే 150 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని భావించాలి.

మరో జాతీయ సంస్థ జీన్యూస్-మాట్రిజ్ గ్రూప్ 133 అసెంబ్లీ సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయని పేర్కొంది.
భారత్ పొలిటికల్ సర్వే కూడా 150-156 సీట్లతో శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయపతాక ఎగురవేస్తుందని తేల్చింది.
డెక్కన్ 24/7 సంస్థ అంచనా ప్రకారం 135-140 సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయి.
న్యూస్ ఎరినా ఇండియా 127 సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయని చెబితే,
చాణక్య సంస్థ వైఎస్సార్‌సీపీకి 102-107 సీట్లు కనిష్టంగా వస్తాయని పేర్కొంది.
జన్ మత్ పోల్స్ అనే సంస్థ 120-123 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
ఆత్మ సాక్షి సంస్థ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 97-118 సీట్లు రావచ్చని ప్రకటించింది.

నాగన్న సర్వే ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కనీసం 103 వరకు రావచ్చని, ఆ పైన మరో ఇరవైఐదు సీట్లకు అవకాశం ఉందని తెలిపింది. ఒక సీనియర్  జర్నలిస్టు పోతిన రేణుక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఉన్న వివిధ మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడి ఒక అంచనాకు వచ్చారు. ఆమె అంచనా ప్రకారం వైఎస్సార్‌సీపీకి 134 సీట్లు రావచ్చని  చెబుతున్నారు. ఈ సంస్థల సర్వేల ప్రకారం టీడీపీకి కూటమికి 19 నుంచి అరవైరెండు వరకు రావచ్చని పేర్కొంటున్నాయి. ఏ రకంగా చూసినా టీడీపీ కూటమి అధికారంలోకి రావడం అసాద్యమని సర్వే నిపుణులు చాలా వరకు భావిస్తున్నారు. మరో విశేషం చెప్పాలి.

నాలుగైదు నెలల క్రితం బెట్టింగ్ యాప్ లు వైఎస్సార్‌సీపీకి 53 స్థానాలు ఇచ్చాయట. అవి ఇప్పుడు వైఎస్సార్‌ సీపీకి 88 వరకు ఇస్తున్నాయట. వారి పందాల స్ట్రాటజీ ప్రకారం పందెగాళ్లను ఆకర్షించడానికి ఇలా చేస్తుండవచ్చు. నిజానికి పందాలను ప్రోత్సహించకూడదు. దీనివల్ల ఎవరో ఒకరు నష్టపోతారు కనుక. అయినా పందాల ఆలోచన  ఉన్నవాళ్లు ఎటూ ఆగరు కనుక ఈ విషయాన్ని ప్రస్తావించవలసి వస్తోంది. ఈ యాప్ల లెక్కల ప్రకారం చూసినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతున్నదన్నమాట.

రెండు నెలల క్రితం తెలుగుదేశం వర్గాలు ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలలో వ్యతిరేకత ఉందని ప్రచారం చేశాయి. ఎల్లో మీడియా అయితే ఏదో రకంగా రెచ్చిపోతూ వ్యతిరేక వార్తలు నిరంతరం ఇస్తున్నాయి. వీటి ప్రభావానికి గురైన కొందరు అమాయకులు వైసిపి అధికారంలోకి రాలేదోమేనని అనుకోవాలని,కృత్రిమంగా మౌత్ టాక్ సృష్టించడానికి వీరు విపరీత యత్నం చేశారు. టీడీపీ కూటమి వ్యవస్థలను మేనేజ్ చేసి గతంలో మాదిరి తొలి దశ ఎన్నికలు కాకుండా నాలుగో దశకు అంటే ఒక నెలరోజుల పాటు ఎన్నికలను ఆలస్యం చేయించగలిగాయి. దీనివల్ల వైఎస్సార్‌ సీపీకి నష్టం అని వారు అనుకున్నారు. కాని అదే  జగన్ కు పెద్ద అడ్వాంటేజ్ గా మారిందంటే  అతిశయోక్తి కాదు. జగన్ ఈ సమయాన్ని బస్ యాత్రకు వినియోగించడానికి ప్లాన్ చేసుకుని ఆ ప్రకారం ఆరంభించారు. రాయలసీమ నుంచి తూర్పు  గోదావరి వరకు ఈ యాత్ర చేరుకుంది. అన్ని ప్రాంతాలలో జగన్ పట్ల ప్రజలలో విపరీత ఆదరణ కనిపించడంతో టీడీపీ కూటమికి, ఎల్లో మీడియాకు మతి పోయినంత పనైంది. సీఎం జగన్‌పై ప్రజలలో ముఖ్యంగా బలహీనవర్గాలలో ఇంత క్రేజ్ ఉందా అని వారు నివ్వెరపోతున్నారు.

దీనికి తోడు విజయవాడలో ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనతో మరింత సానుభూతి పెరిగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీచేస్తూ ఒక స్పష్టతతో, ఒక ఎజెండాతో ముందుకు వెళుతుంటే, కూటమిలో ఇంకా సీట్ల గొడవలే సర్దుబాటు కాలేదు. జగన్ సభలతో పోల్చితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల సభలకు జనం అంతంత మాత్రంగానే వస్తున్నారు. జగన్ సభలలో విపరీతమైన జోష్ కనిపిస్తుంటే, కూటమి సభలలో ఆ ఉత్సాహం కొరవడుతోంది. జగన్ 2019లో చేసిన వాగ్దాలన్నిటిని 99 శాతం అమలు చేయడం ఆయన విజయానికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు చేసిన  పాలనలో ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చకపోవడంతో ప్రజలలో ఆయనపై విశ్వాసం పూర్తిగా పోయింది. దీనికి తోడు టిక్కెట్ల గందరగోళం కూడా కూటమిని దెబ్బతీస్తోంది.

పవన్ కళ్యాణ్ ను పూర్తిగా చంద్రబాబు లొంగదీసుకున్నారన్న అభిప్రాయంతో జనసేన అభిమానులలో అసంతృప్తి ఏర్పడింది. బీజేపీతో పొత్తు  కుదిరిన తర్వాత మైనార్టీలలో కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు ఒక అభివృద్ది ఎజెండాతో వెళ్లలేకపోతున్నారు. జగన్ చేసిన స్కీములన్నిటిని తాము కూడా అమలు చేస్తామని చెప్పక తప్పడం లేదు. మరోవైపు జగన్ ధైర్యంగా తాను ఐదేళ్లలో చేసిన పనులన్నీ ప్రజలకు వివరిస్తూ మన్ననలు పొందగలుగుతున్నారు. అందువల్లే సర్వేలు సైతం వైఎస్సార్‌సీపీదే మళ్లీ అధికారం అని, సీఎం జగనే మరోసారి ముఖ్యమంత్రి అని స్పష్టం చేస్తున్నాయి.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250