"; ?> ఆ కారు నడిపింది రహీలే! | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఆ కారు నడిపింది రహీలే!

Published Wed, Apr 17 2024 8:20 AM

తండ్రి షకీల్‌ తో కొడుకు ర హీల్‌ (ఫైల్‌) - Sakshi

2022 నాటి ప్రమాదంలోనూ షకీల్‌ కుమారుడే నిందితుడు

జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు... పక్కాగా సాగని దర్యాప్తు

స్నేహితుడు వాహనం నడిపినట్లుగోల్‌మాల్‌ చేసిన వైనం

ఎట్టకేలకు అసలు విషయం గుర్తించిన వెస్ట్‌జోన్‌ అధికారులు

అప్పట్లో పని చేసిన పోలీసుల వ్యవహారశైలీ పరిగణనలోకి

సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్‌: పంజగుట్ట పోలీసుస్టేషన్‌ పరిధిలోని ప్రజాభవన్‌ ఎదురుగా చోటు చేసుకున్న ‘బీఎండబ్ల్యూ కారు ప్రమాదం’లో ఇటీవల అరైస్టెన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్‌ మరో కేసులో నిందితుడిగా మారాడు. 2022లో జూబ్లీహిల్స్‌ ఠాణా పరిఽధిలో చోటు చేసుకున్న ‘మహేంద్ర థార్‌ యాక్సిడెంట్‌’కు ఇతడే కారణమని అధికారులు తేల్చారు. ఈ కేసులోనూ బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ పాత్రపై ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అప్పట్లో జూబ్లీహిల్స్‌ కేసు దర్యాప్తు చేసిన, పర్యవేక్షించిన అధికారుల చుట్టూ ఉచ్చుబిగుస్తోందని సమాచారం. ప్రజాభవన్‌ వద్ద చోటు చేసుకున్న ప్రమాదం కేసులో రహీల్‌, ఇద్దరు పోలీసులు సహా 15 మంది అరెస్టు అయిన విషయం విదితమే. ఆ ప్రమాదంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలోనే జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌ తెరపైకి తెచ్చింది.

ప్రాణాలు కోల్పోయిన రెండు నెలల చిన్నారి..
జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో 2022 మార్చి 17వ తేదీ రాత్రి దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ వైపు నుంచి జూబ్లీహిల్స్‌ వైపు దూసుకువచ్చిన మహేంద్ర థార్‌ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన కాజల్‌ చౌహాన్‌, సారికా చౌహాన్‌, సుష్మ చౌహాన్‌ భోస్లే గాయపడగా.. కాజల్‌ కుమారుడు రఘువీర్‌ (రెండు నెలలు) అక్కడిక్కడే మృతి చెందాడు.

ఈ వాహనంపై ఎమ్మెల్యే షకీల్‌ స్టిక్కర్‌ ఉండటంతో అప్పట్లో రహీల్‌పై ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజు స్పందించిన షకీల్‌ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. సదరు కారు తన సోదరుడిదని (కజిన్‌), తానూ అప్పుడప్పుడు వాడుతుంటానని పేర్కొన్నారు. సోదరుడి కుటుంబం కారులో వెళుతుండగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 వద్ద సిగ్నల్‌ సమీపంలో బెలూన్లు అమ్ముకునే యువతికి కారు గాయమైందని, ఆ భయంలో ఆమే పసిపాను పడేయడంతో దుర్ఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని పేర్కొన్నాడు.

అప్పట్లో పోలీసులూ క్లీన్‌చిట్‌ ఇచ్చేశారు...
అదే నెల 19న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు రహీల్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చేశారు. ఆ వాహనాన్ని తానే నడుపుతున్నట్లు షకీల్‌ బంధువు సయ్యద్‌ అఫ్మాన్‌ అహ్మద్‌ లొంగిపోయినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇతడి పక్కన సీటులో రహీల్‌ కూర్చోగా... వెనుక సీటులో స్నేహితుడు మహ్మద్‌ మాజ్‌ ఉన్నట్లు వెల్లడించారు. వాహనంలో సేకరించిన వేలిముద్రలు సైతం అఫ్మాన్‌ ఫింగర్‌ ప్రింట్స్‌తో సరిపోలినట్లు చెప్పుకొచ్చారు.

ఇలా ఈ ప్రమాదంలో రహీల్‌ పాత్ర లేనట్లు తేల్చేశారు. అయితే ప్రజాభవన్‌ వద్ద ప్రమాదం కేసు దర్యాప్తులో భాగంగా నాటి కేసుపై దృష్టి పెట్టిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీళ్లు నాటి రికార్డులను పరిశీలించగా అనేక లోపాలు కనిపించాయి. కాజల్‌ వాంగ్మూలంలో ఎక్కడా ప్రమాద సమయంలో డ్రైవింగ్‌ ఎవరు చేశారనే ప్రస్తావన లేదు. ఆమెతో ఆఫ్మాన్‌కు టెస్ట్‌ ఐడెంటికేషన్‌ పెరేడ్‌ నిర్వహించిన దాఖలాలు లేవు. మరోపక్క అప్పట్లో పోలీసుల ప్రకటించిన వేలిముద్రల రికార్డులు కోర్టుకు సమర్పించలేదు. అదే ఏడాది నవంబర్‌లో దాఖలు చేసిన చార్జిషీట్‌ లోపభూయిష్టంగా ఉన్నట్లు తేల్చారు. ఈ వ్యవహారం వెనుక షకీల్‌–రహీల్‌ పాత్రను అనుమానించిన వెస్ట్‌జోన్‌ పోలీసులు ఆ ఫైల్‌ను రీ–ఓపెన్‌ చేశారు.

విచారణలో అసలు విషయం వెలుగులోకి...
‘జూబ్లీహిల్స్‌ ప్రమాదం’ కేసు దర్యాప్తులో భాగంగా వెస్ట్‌జోన్‌ పోలీసులు ఫిర్యాది, ఇతర బాధితురాళ్లను విచారించారు. నిందితుడిగా ఉన్న అఫ్మాన్‌ను సైతం ప్రశ్నించగా రహీల్‌ పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో నాటి దర్యాప్తు అధికారి విచారణలోనూ ఆరోపణలకు బలాన్నిచ్చే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా ముందుకెళ్లిన పోలీసులు రహీల్‌ను నిందితుడిగా చేర్చారు. ప్రజాభవన్‌ వద్ద ప్రమాదంతో దుబాయ్‌ పరారైన ఇతడు ఇటీవలే వచ్చి అరైస్టె బెయిల్‌ పొందాడు. రహీల్‌ను జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని నిర్ణయించారు. అలా వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. అప్పట్లో ఈ కేసు సెటిల్‌ చేయడంలో ఓ పోలీసు ఉన్నతాధికారి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అతడే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.5 లక్షలు ఇప్పించినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో ఆయనతో పాటు మరో అధికారీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. రహీల్‌ విచారణ తర్వాతే షకీల్‌ పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250