Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. కెప్టెన్‌గానూ రాటు దేలుతున్నాడు

Published Thu, Apr 18 2024 12:02 PM

Pant Best Wicketkeeper Batter In World His Captaincy Getting Sharper: DC Coach - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌పై ఆ జట్టు అసిస్టెంట్‌ జేమ్స్‌ హోప్స్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అంటూ కొనియాడాడు. కెప్టెన్‌గానూ రోజురోజుకూ మరింత రాటుదేలుతున్నాడని సంతోషం వ్యక్తం చేశాడు.

కారు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమైన పంత్‌.. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఆడుతున్న పంత్‌ ఫిట్‌నెస్‌పై ఆదిలో సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ వికెట్‌ కీపర్‌గా.. బ్యాటర్‌గా అద్భుత ఆటతీరుతో అలరిస్తున్నాడు పంత్‌. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కెప్టెన్సీ నైపుణ్యాలతో ఆకట్టుకున్న పంత్‌.. ఢిల్లీకి అద్బుత విజయం అందించాడు.

అహ్మదాబాద్‌లో టాస్‌ గెలిచిన పంత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ ఢిల్లీ బౌలర్లు సంచలన ప్రదర్శనతో చెలరేగారు. సమిష్టి కృషితో గుజరాత్‌ను కేవలం 89 పరుగులకే ఆలౌట్‌ చేసి సత్తా చాటారు.

ఇక 90 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే ఛేదించిన ఢిల్లీ ఈ సీజన్‌లో ఎట్టకేలకు మూడో విజయం అందుకుంది. ఈ గెలుపులో కెప్టెన్‌గా.. వికెట్‌ కీపర్‌గా.. బ్యాటర్‌గా రిషభ్‌ పంత్‌ కీలక పాత్ర పోషించాడు. 

అద్బుత రీతిలో రెండు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు రెండు స్టంపింగ్‌లతో ఆకట్టుకున్నాడు. అదే విధంగా.. 11 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఈ నేపథ్యంలో జేమ్స్‌ హోప్స్‌ మాట్లాడుతూ.. ‘‘పంత్‌ కీపింగ్‌ చేస్తున్నాడు. అది కూడా అద్బుతంగా! గతేడాది అతడు లేని లోటు మాకు బాగా తెలిసింది. 

ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయగలం. అయితే, ఇప్పుడు అతడు తిరిగి వచ్చాడు.

కీపింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. కెప్టెన్సీ పరంగానూ రాటుదేలుతున్నాడు. బ్యాటర్‌గానూ మంచి ఫామ్‌లో ఉన్నాడు’’ అని పేర్కొన్నాడు. కాగా పంత్‌ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కలిపి 210 పరుగులు సాధించాడు.

ఇదిలా ఉంటే టైటాన్స్‌పై విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దూసుకువచ్చింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడింట గెలిచి ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉంది. తదుపరి ఏప్రిల్‌ 20న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢిల్లీలో తలపడనుంది.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250