Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

29 ఏళ్ల వయసులోనే మాజీ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ రిటైర్మెంట్‌

Published Thu, Apr 18 2024 4:15 PM

Former Number 1 Kento Momota Retires From International Badminton At 29 - Sakshi

జపాన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌, ప్రపంచ మాజీ చాంపియన్‌ కెంటో మొమోటా ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ స్థాయి టోర్నీల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు గురువారం ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదం తర్వాత తాను పూర్తిగా కోలుకోలేకపోయానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

కాగా జపాన్‌కు చెందిన 29 ఏళ్ల కెంటో మొమోటా ఒకప్పుడు బ్యాడ్మింటన్‌ రంగంలో మకుటంలేని మహారాజుగా నీరాజనాలు అందుకున్నాడు. 2019లో ఏకంగా 11 టైటిళ్లు సాధించి సత్తా చాటాడు. ఆ ఏడాది ఆడిన 73 మ్యాచ్‌లలో మొమోటా కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయాడు.

అయితే, ఆ మరుసటి ఏడాది మొమోటా కారు ప్రమాదానికి గురయ్యాడు. మలేషియా మాస్టర్స్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత కౌలలంపూర్‌ విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు  ప్రమాద ఘటనలో నుజ్జునుజ్జయింది. ఆ కారు డ్రైవర్‌ చనిపోగా.. మొమోటాకు తీవ్ర గాయాలయ్యాయి.

మొమోటా కంటికి బలమైన దెబ్బ తలగడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరో రెండు టైటిళ్లు గెలిచిన మొమోటా.. ఏడాది తర్వాత రెండో కంటి చూపు కూడా మందగించడంతో ఫామ్‌ కోల్పోయాడు. 

ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌ ‍ప్రకటిస్తూ.. ‘‘కారు ప్రమాదం జరిగిన సమయంలో నేను నా గురించి ఆందోళన చెందలేదని చెప్తే అది అబద్ధమే అవుతుంది. ఆ యాక్సిడెంట్‌ తర్వాత కఠిన సవాళ్లు ఎదురయ్యాయి.

ఆడాలనే తపన ఉన్నా నా శరీరం అందుకు సహకరించడం లేదు. అందుకే ఈ నిర్ణయం. అయితే, ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు’’ అని కెంటో మొమోటా చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌గా వెలుగొందిన మొమోటా ప్రస్తుతం 52వ ర్యాంకులో ఉన్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన అతడు.. థామస్‌, ఉబెర్‌ కప్‌ తర్వాత ఆటకు దూరం కానున్నాడు.  

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250