Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కాంగ్రెస్‌ సొంత ఇల్లులాంటిది..

Published Fri, Mar 29 2024 4:41 AM

MP K Keshava Rao To Resign BRS and Joins In Congress: telangana - Sakshi

53 ఏళ్లు అందులో పనిచేశా: కేకే 

నేను ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా..

త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వెల్లడించిన కె.కేశవరావు

అంతకుముందు కేసీఆర్‌తో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో భేటీ 

ఇటీవల కేకే వెల్లడించిన అభిప్రాయాలపై బీఆర్‌ఎస్‌ అధినేత తీవ్ర అసంతృప్తి 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి పలువురు కీలక నేతల నిష్క్రమణలు కొనసాగుతుండగా.. తాజాగా పార్టీ సెక్రెటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు (కేకే) కూడా అదే బాట పట్టారు. ‘కాంగ్రెస్‌ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే. 53 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీ లోనే పని చేశా. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లినవారు ఎప్పటికైనా ఇంటికే చేరతారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరతా..’ అని కేకే గురువా రం నాడిక్కడ మీడియాకు చెప్పారు. అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తో కేకే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసినట్లు సమాచారం కాగా..ఆ తర్వాత బంజారాహిల్స్‌ నివాసంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

తెలంగాణ కోసం బీఆర్‌ఎస్‌లో చేరా
‘బీఆర్‌ఎస్‌లో నేను పని చేసింది పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్‌లో చేరా. కానీ కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటి సారి కాంగ్రెస్‌ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యస భకు ఎన్నికయ్యా. ప్రస్తుతం నేను బీఆర్‌ఎస్‌కు ఇంకా రిజైన్‌ చేయలేదు. నా కూతురు చేరిన రోజే నేను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదు. ఏ రోజు చేరేదీ తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..’ అని కేకే చెప్పారు.

నేను బీఆర్‌ఎస్‌లో ఉండి చేసేదేమీ లేదు
‘కేసీఆర్‌ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్య కర్తలు బాగా సహకరించారు. కానీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేశా. పీసీసీ అధ్యక్ష పదవి మొదలు కొని రాజ్యసభ వరకు నాకు కాంగ్రెస్‌ ఎన్నో అవకా శాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయ చరమాంకంలో ఉన్న నేను బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండి కూడా చేసేదేమీ లేదు. కేసీఆర్‌కు కూడా ఇదే చెప్పా. బీఆర్‌ఎస్‌కు సంబంధించిన అంశాలపై కూడా ఆయనతో మాట్లాడా. కవిత అరెస్టుతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగింది. కవితను అక్రమంగా అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలని అనుకుంటున్న నా కుమారుడు విప్లవ్‌ నిర్ణయం మంచిదే..’ అని కేశవరావు అన్నారు.

నేను మాత్రం పార్టీ మారను: విప్లవ్‌కుమార్‌
పార్టీ మారే విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మి తీసుకునే నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేకే కుమారుడు విప్లవ్‌ కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై వారు స్పష్టత ఇచ్చిన తర్వాతే, దానిపై తన అభిప్రా యం వెల్లడిస్తానని చెప్పారు. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్‌కు గట్టి మద్దతుదారుడినని, కేసీఆర్‌ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్‌ ప్రభు త్వంలో విప్లవ్‌కుమార్‌ తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేయడం తెలిసిందే.

కేకే నివాసానికి ఇంద్రకరణ్‌రెడ్డి
కేసీఆర్‌తో భేటీ తర్వాత కేకే బంజారాహిల్స్‌ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి, అరవింద్‌రెడ్డితో పాటు కేకే కుమా ర్తె, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. 

మీ కుటుంబానికి ఏం తక్కువ చేశా?: కేసీఆర్‌
విశ్వసనీయ సమాచారం మేరకు.. కేసీఆర్‌తో జరిగిన భేటీలో బీఆర్‌ఎస్‌లో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలతో కూడిన ఓ నోట్‌ను కేకే అందజేశారు. ఈ సందర్భంగానే కేకేతో పాటు విజయలక్ష్మి పార్టీని వీడుతున్నారనే వార్తలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై కేకే వివరణ ఇస్తూ.. రాజకీయంగా ఇదే తన చివరి ప్రయాణం అని, కాంగ్రెస్‌లోనే చనిపోతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యూ ట్యూబ్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో కేకే వెల్లడించిన అభిప్రాయాలపై కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తారు. మీ ఆలోచన మానుకోండి. మీ కుటుంబానికి పార్టీ తక్కువేమీ చేయలేదు. మీకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సెక్రటరీ జనరల్‌ పదవితో పాటు రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపించా. మీ కుమారుడికి కార్పొరేషన్‌ పదవి ఇచ్చా. మీరు కోరిన మీదటే పార్టీలో ఎంతోమంది నిబద్ధత కలిగిన వారిని పక్కన పెట్టి మరీ మీ కూతురు విజయలక్ష్మికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పదవి ఇచ్చాం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పెద్దరికంతో వ్యవహరించాల్సింది పోయి మీడియాలో నాపైనా, పార్టీ నాయకులపైనా విమర్శలు చేయడం సరికాదు..’ అంటూ కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ అర్ధంతరంగా ముగిసిందని సమాచారం.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250