Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

మనసున్న మారాజు.. మత్స్యకారుల్లో వెలుగులు

Published Fri, Mar 29 2024 1:50 AM

తుపానుకు ఫిషింగ్‌ హార్బర్‌లో మునిగిపోయిన బోటు - Sakshi

టీడీపీ హయాంలో మునిగిన, కాలిన బోట్లకు సాయం

ఇలాంటి 36 బోట్లకు రూ.1.35 కోట్ల పరిహారం

ఈనెల 16న నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

ఈసీ నుంచి అనుమతి రాగానే పంపిణీకి సన్నద్ధం
 

సాక్షి, విశాఖపట్నం, అచ్యుతాపురం:

త్స్యకారులపై మమకారంతో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి పట్ల మరోసారి ఉదారతను చాటుకున్నారు. ఇప్పటికే మత్స్యకారుల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల భృతి, లీటర్‌పై రూ.9 డీజిల్‌ సబ్సిడీ, 50 ఏళ్లకే పెన్షను, వేట సమయంలో ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల పరిహారం వంటి పలు ప్రయోజనాలను చేకూరుస్తున్నారు. వారికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకుంటున్నారు.

గత నవంబర్‌ 19 అర్ధరాత్రి ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 బోట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. బాధిత బోటు యజమానులకు మూడు రోజుల్లోనే భారీ మొత్తంలో రూ.7.11 కోట్ల పరిహారాన్ని అందజేశారు. ఈ బోట్లపై ఆధారపడ్డ కలాసీలు 400 మంది జీవనోపాధి కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున చెల్లించారు. ఊహించిన దానికంటే ఎక్కువ పరిహారాన్ని అందించడంపై బాధిత మత్స్యకారులు ఎంతగానో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమకు ఈ మేళ్లన్నీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే జరుగుతున్నాయన్న ఆనందంలో ఉన్నారు.

మత్స్యకారులపై మమకారం

గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సముద్రంలో మ త్స్యకారుల బోట్లు కాలిపోయినా, మునిగిపోయి నా, తుపాన్లలో దెబ్బతిన్నా పరిహారం సక్రమంగా ఇచ్చేవారు కాదు. ఇచ్చే అరకొర సాయం కూడా ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందుకు భిన్నంగా మత్స్యకారులపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారికొచ్చే కష్టాలపై తక్షణమే స్పందించి ఉదారంగా సాయమందిస్తున్నారు. టీడీపీ హయాంలో మునిగిన, అగ్ని ప్రమాదానికి గురైన, తుపాన్లలో దెబ్బతి న్న బోట్లకు కూడా పరిహారం అందించేలా చూడాల ని బాధిత మత్స్యకారులు తాజా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కోరారు. దీనిపై ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం బాధిత మత్స్యకారులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వివిధ ప్రమాద ఘటనల్లో దెబ్బతిన్న 36 బోట్లకు రూ.1.35 కోట్ల నిధులు విడుదల చేస్తూ మత్స్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ ఈనెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ నిధులు జిల్లా కలెక్టర్‌ అకౌంట్‌లో జమయ్యాయి.

జగనన్న ప్రభుత్వం ఆదుకుంది

చేపల వేటే నాకు జీవనాధారం. నేను భార్య, ముగ్గురు పిల్లల్ని పోషించాలి. చేపల్ని పట్టి అమ్ముకుంటే వచ్చే సొమ్ము జీవనానికే సరిపోతుంది. వేట నిషేధ సమయంలో అక్కరకొస్తుందని ఆదా చేద్దామనుకుంటే ఎప్పుడూ వీలయ్యేది కాదు. జగనన్న ప్రభుత్వం వేట నిషేధ సమయంలో రూ.10 వేల మత్స్యకార భరోసా అందిస్తోంది. దాంతో నా కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించగలుగుతున్నాను. డీజిల్‌ కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాను.

–గనగళ్ల దేముడు, పూడిమడక గ్రామం, అచ్యుతాపురం మండలం

చంద్రబాబు హయాంలో పస్తులే

వేటకెళితేనే కడుపు నిండేది. లేకుంటే పస్తులే. చంద్రబాబు హయాంలో మత్స్యకార భృతి ఎప్పుడో ఇచ్చేవారు. అది కూడా రూ.4 వేలు. వేట నిషేధ సమయంలో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సివచ్చేది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యకార భరోసా కింద రూ.10 వేల పరిహారం నిషేధ కాలంలోనే ఇవ్వడంతో కుటుంబ పోషణకు ఎంతో ఉపయోగపడు తోంది. నాకు ఒక బోటు ఉండడంతో సబ్సిడీపై డీజిల్‌ అందిస్తున్నారు. ఇది నాకు ఎంతో ఆర్థిక ఉపశమనం కలిగిస్తోంది.

–చోడపల్లి సింహాచలం, తంతడి గ్రామం, అచ్యుతాపురం మండలం

దెబ్బతిన్న బోట్లు

2014–2019 మధ్య కాలంలో మొత్తం 36 బోట్లు దెబ్బతిన్నాయి. వీటిలో 21 బోట్లు సముద్రంలో మునిగిపోగా, నాలుగు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఐదు నీటి అడుగున చిక్కుకుపోయాయి. మరో ఆరు బోట్లు ఫిషింగ్‌ హార్బర్‌లో ప్రమాదాల పాలై పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఇందులో 2014 హుద్‌హుద్‌ తుపానుకు మునిగిపోయిన రెండు బోట్లకు, 2018 తిత్లీ తుపానులో మునిగిన మూడు బోట్లకు, 2019 పెథాయ్‌, జావద్‌ తుపాన్లకు మునిగిపోయిన 11 బోట్లకు టీడీపీ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో దెబ్బతిన్న బోట్లకు కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాయమందిస్తుండడంపై మనసున్న మారాజు అంటూ సీఎం జగన్‌ను మత్స్యకారులు కొనియాడుతున్నారు. ఆయన రుణం తీర్చుకుంటామని పేర్కొంటున్నారు.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250