Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

IPL 2024 GT VS DC: పిచ్చెక్కించిన పంత్‌

Published Wed, Apr 17 2024 9:20 PM

IPL 2024 GT VS DC: Rishabh Pant Great Work Behind Stumps, Two Stump Outs And One Catch - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ఐపీఎల్‌ 2024 సీజన్‌తోనే క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్‌.. మునుపటి తరహాలో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో బ్యాట్‌తో ఇదివరకే ప్రూవ్‌ చేసుకున్న పంత్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 17) జరుగుతున్న మ్యాచ్‌లో వికెట్ల వెనుక కూడా సత్తా చాటాడు.

ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచి చురుగ్గా ఉన్న పంత్‌.. రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు రెండు మెరుపు స్టంపౌట్లు చేశాడు. తొలుత ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో లెగ్‌ సైడ్‌ దిశగా డేవిడ్‌ మిల్లర్‌ ఆడిన బంతిని అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌గా మలిచిన పంత్‌.. ఆతర్వాత ట్రిస్టన్‌ స్టబ్స్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఏకంగా రెండు స్టంపౌట్లు చేసి మునుపటి పంత్‌ను గుర్తు చేశాడు.

తొమ్మిదో ఓవర్‌ మూడో బంతికి అభినవ్‌ మనోహర్‌ను వికెట్ల వెనక దొరకబుచ్చుకున్న పంత్‌.. ఆతర్వాత ఐదో బంతికి షారుఖ్‌ ఖాన్‌ను కూడా ఇదే తరహాలో స్టంపౌట్‌ చేశాడు. అనంతరం 18వ ఓవర్‌ తొలి బంతికి ముకేశ్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ క్యాచ్‌ పట్టిన పంత్‌.. ఈ మ్యాచ్‌లో మొత్తంగా నలుగురిని ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో వికెట్ల వెనుక పంత్‌ ప్రదర్శన చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. రీ ఎంట్రీలో పంత్‌ మరింత డేంజరెస్‌గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. పంత్‌ వికెట్‌కీపింగ్‌ మెరుపులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. 

కాగా, అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్‌ బ్యాటింగ్‌ లైనప్‌పై ఎదురుదాడికి దిగింది. 

ఇషాంత్‌ శర్మ (2-0-8-2), ముకేశ్‌ కుమార్‌ (2.3-0-14-3), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (1-0-11-2), అక్షర్‌ పటేల్‌ (4-0-17-1), ఖలీల్‌ అహ్మద్‌ (4-1-18-1) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్‌ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో రషీద్‌ ఖాన్‌ (31) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్‌ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 
 

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250