Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కేకే పార్టీ జంప్‌.! కేసీఆర్‌ రియాక్షన్‌ ఏంటంటే?

Published Thu, Mar 28 2024 4:35 PM

Kk Meets Kcr At Erravalli Farmhouse - Sakshi

పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్న సీనియర్ నేత కేకే

పార్టీ మారబోతున్న విషయం కేసిఆర్‌కు చెప్పిన కేశవరావు

కే కేశవరావు నిర్ణయంపై కెసిఆర్‌ తీవ్ర అసహనం

మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు సూచించిన కేసిఆర్

సాక్షి, సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం.

ఇక సెలవు మరి.!

ప్రస్తుత పరిస్థితుల్లో BRSలో ఉండలేనని కే. కేశవరావు చెప్పినట్టు సమాచారం. ఓ రకంగా ఇది కెసిఆర్‌కు మింగుడుపడని విషయం. పార్టీలో కేకేకు ఇచ్చిన ప్రాధాన్యత, పదవుల దృష్ట్యా కేకే శాశ్వతంగా ఉంటారని కెసిఆర్‌ భావించారు కానీ సీన్‌ రివర్స్‌ అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై కెసిఆర్‌తో కొద్దిసేపు చర్చించిన కేకే.. తనకు ఈ పరిస్థితి అనివార్యంగా మారిందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారుతానని కేశవరావు చెప్పగానే కెసిఆర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు చెప్పినట్టు తెలిసింది.

లోపల గరం.. గరం

ఫాంహౌస్‌ లోపల అంతా గరంగరంగా సమావేశం జరిగినట్టు తెలిసింది. నేను పుట్టింది కాంగ్రెస్‌లో.. కాంగ్రెస్ లోనే చనిపోతానని తేల్చిచెప్పిన కేకే చెప్పగా.. కెసిఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడతానంటే ఎలా? ప్రజలు అన్నీ గమనిస్తారని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం. నీకు, నీ ఫ్యామిలీ కి BRS పార్టీ ఏం తక్కువ చేసిందని కేసీఆర్  ప్రశ్నించినట్టు తెలిసింది.

కేకే అభ్యంతరాలు ఇవి

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు
  • జాతీయ రాజకీయాల్లో అనవసరంగా తల దూర్చారు
  • TRS పేరును BRSగా మార్చి గాల్లో మేడలు కట్టారు
  • మహారాష్ట్రలో ప్రచారం చేయడం పెద్ద తప్పు
  • అసలు రాజకీయ క్షేత్రం తెలంగాణను వదిలిపెట్టారు
  • పార్టీని నమ్ముకున్న నాయకుల మాటలను పెడచెవిన పెట్టారు
  • కొందరు అధికారులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు
  • నిర్ణయాధికారాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుల కంటే అధికారుల మాట విన్నారు

కూతురు వెంటే కేకే

ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారాన్ని కేకే నిజం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే చేసిన ప్రకటన సంచలనమయింది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేకే.. ఏకంగా బీఆర్ఎస్‌ మూడో స్థానంలో ఉండబోతుందంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్న కేకే..ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధుల పైకి దురుసుగా దూసుకు వచ్చారు. తీసుకుంటారా వీడియా.. నన్ను తీసుకోండి అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు.

కేసీఆర్‌.. కేకే.. సుదీర్ఘ ప్రయాణం

ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. ఒకప్పుడు కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్‌. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవాడంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకేకు ఏకంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఇచ్చారు కేసీఆర్. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు.

పోతూ పోతూ విసుర్లు

పార్టీ మారే పరిస్థితి వచ్చిన తర్వాత కేకే తన అసంతృప్తిని బయటపెట్టారు. తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, ఇంజినీర్లు చేయాల్సిన పనిలో తల దూర్చారని, ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్‌ 30న కేకే కాంగ్రెస్‌ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు తెలిసింది.

మా నాన్న సంగతి నాకు తెలియదు : కేకే కొడుకు విప్లవ్‌

"పార్టీ మారే ఆలోచనలో కె.కె,  విజయలక్ష్మి ఉన్నట్టు వస్తున్న వార్తలకు, వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనే BRSలోనే ఉన్నాను, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరితే, వారు ధృవీకరిస్తే అప్పుడు మాత్రమే నేను మరింత మాట్లాడగలను."

ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు: KTR ఆవేదన

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250