Sakshi News home page

అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలు

Published Tue, Nov 21 2023 4:04 AM

BSP state president RS Praveen Kumar in Vemulawada - Sakshi

వేములవాడ: బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యో గాలిచ్చి నిరుద్యోగులకు బాసటగా నిలుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఇందులో మహిళలకే 5 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ ప్రకృతి ఆగ్రహించి టెంట్లను కూల్చి వేసినట్లుగానే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు.

ఏనాడూ రాని దొరలు ఇప్పుడు ఓటుకు రూ.2 వేలు ఇస్తామంటూ మన ఇంటికి వస్తున్నారన్నారు.  ఒక్కసారి ఓటు అమ్ముకుంటే మన బిడ్డల భవిష్యత్‌ను బొంద పెట్టుకున్నట్లేనని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వం రాగానే భూమిలేని ప్రతీ నిరుపేదకు ఎకరం భూమి ఇస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ మూడెకరాలు ఇస్తామని నమ్మబలికి దళితులకు చెందిన 35 వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. గల్ఫ్‌ బాధితుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్‌ వాగ్దానం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్‌ బాధితులకోసం రూ.5 వేల కోట్లతో ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కులాలవారీగా కాంట్రాక్టులు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ఎమ్మెల్సీ కవిత అక్రమంగా రూ.100 కోట్లు ఢిల్లీకి పంపిందని, ఆమె రూ.20 లక్షల ఖరీదైన వాచ్‌ ధరిస్తుందని ఆరోపించారు. పార్టీ వేములవాడ అభ్యర్థి, విద్యావంతుడైన డాక్టర్‌ గోలి మోహన్‌కు కాకుండా ఎవరికి ఓటు వేసినా మీ జీవితాలు నాశనమేనన్నారు.  

కూలిన టెంట్లు.. పలువురికి గాయాలు 
సభ ప్రారంభంలో వేములవాడ అభ్యర్థి గోలి మోహన్‌ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన సుడిగాలితో టెంట్లు కూలిపోయాయి. అనుకోని ఈ ఘటనతో పలువురు మహిళలు, జర్నలిస్టులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి పరామర్శించారు.  

Advertisement

homepage_300x250