Sakshi News home page

శాంతం–సంగీతం

Published Mon, Sep 25 2023 12:55 AM

Explanation of shantam, sangeetham - Sakshi

వాగ్గేయకారులైన వారు రచించిన గీతాలు మహాకవులయిన ఇతరులు రచించిన పద్యాల సందర్భాల్లాగే ఉంటాయి. శివలింగం అంటే శివుడితో మాట్లాడుతున్నట్లే, ఇది విగ్రహం కాదు రాముడే, ఇది శిల కాదు.. అక్కడ ఉన్నది కామాక్షియే, అది మూర్తి కాదు సాక్షాత్‌ కృష్ణ పరమాత్ముడే.. అని పరవశాన్ని పొంది లోపలి భావాలను గీతాలుగా స్వరయుక్తంగా ప్రవహింపచేశారు. అవి అజరామరమై ఎన్ని శతాబ్దాలు గడిచినా రామాయణ, భారత, భాగవతాల్లాగే ఉండిపోతున్నాయి.

వారికి అనేక శాస్త్రాల్లో నిష్ఠ ఉండేది. త్యాగరాజ స్వామివారి ‘‘మా జానకిచేతపట్టగ..’ కీర్తననే చూడండి.రామాయణాన్ని భవిష్యపురాణంతో కలిపారు. రామావతారంలోంచి శ్రీవేంకటేశ్వర అవతారం లోకి వెళ్ళింది. అంటే వారికి సమస్త పురాణేతిహాసాలు, వేదవేదాంగాలు సప్తధాతువుల్లో జీర్ణమయిపోయాయి. అన్ని సంగీత పరికరాల్లోకి అత్యంత ప్రధానమైన నాదోపాసనకు సాధనమైన వీణ మీద వీరు అధికారం పొందారు.

‘‘వీణావాదనతత్త్వజ్ఞః శృతిజాతి విశారదః తాళజ్ఞప్రయాసేన మోక్షమార్గం సగచ్ఛతి’’ ఎవరయితే ఆ వీణావాద తత్త్వాన్ని, నాదోపాసన చేయగలిగిన స్థితిని పొంది ఉన్నారో, సంగీతంలో ఉన్న అన్ని శబ్దాల గురించి పరిపూర ్ణజ్ఞానాన్ని పొంది ఉన్నారో, తాళం వినగానే తాళ లక్షణాల గురించి చెప్పగలరో వారు మోక్షమార్గంలో పోతున్నారనడం నిస్సందేహం. అంటే భారతీయ సంగీతం మోక్షానికి కారణం.

త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, రామదాసు, అన్నమాచార్యులూ ఆ స్థితినే పొందారు. కేవలం మనోరంజకత్వం కాదు, భగవంతునిలో ఐక్యమయిపోవడానికి దివ్యసాధనంగా మనకు ఆ సంగీతాన్ని çపవిత్రమైన వస్తువుగా, గంగాజల భాండంగా, ఆవుపాల కుండగా అందించారు. వారి సంగీతం ఎంత గొప్పగా ఉంటుందో, సాహిత్యం కూడా అంత గంభీరంగా ఉంటుంది. వీరిలో మరో విశేషం కనపడుతుంది. అది సర్వకాల సర్వావస్థల్లో పరమ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితి.

మనం ఎంత సాధన చేసినా, ఏ యజ్ఞయాగాదులు, జపాలు, పూజలు చేసినా ఎక్కడో ఒకచోట శాంతం తప్పుతాం. అందుకే త్యాగరాజస్వామి అంటారు...‘శాంతములేక సౌఖ్యము లేదు...’ అని. శాంతం అంటే రాగద్వేషాలు లేకుండా ఉండడం. నాకిది కావాలని కానీ, నాకు వారంటే కోపం అని కానీ, వీరంటే చికాకని కానీ ఉండదు. ఎవరిమీదా ప్రేమా ఉండదు, ద్వేషం ఉండదు.

రాగద్వేషా లు లేకుండా ఎలా ..? అమ్మ ఈ రెండే పట్టుకుని ఉంటుంది.‘‘రాగ స్వరూపపాశాధ్య క్రోధాంకారేంమేశోజ్వలా..’’ నన్ను ఉపాసన చేయగా చేయగా నీకున్న రాగం అన్న పాశం తీసి భక్తి అన్న పాశం వేసి నా దగ్గరకు లాక్కుంటాను... అంటుంది. అంకుశం పెట్టి పొడిస్తే ఏనుగు ఎంత బాధ పడుతుందో తన కోపం తన శత్రువయి అంత బాధపెడుతుంది. అందువల్ల రాగద్వేషాలు లేని ప్రశాంత స్థితిని పొందాలి. సాధన చేస్తున్నప్పుడు ఈ స్థితిని కొంతవరకే పొందగలం. కానీ ఎప్పుడూ అలా ఉండడం అంత సులభం కాదు. దానిని సాధ్యం చేసేది ఒక్క సంగీతం మాత్రమే. అలా సాధ్యం చేసి చూపారు మనకు వాగ్గేయకారులు.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Advertisement

homepage_300x250