Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కమెడియన్‌ రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

Published Thu, Apr 18 2024 9:35 AM

- - Sakshi

నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణ సమీపంలోని లెప్రసీ కాలనీ వద్ద నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు (48) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. నకిరేకల్‌ మండలం మంగలపల్లి గ్రామానికి చెందిన జనార్దన్‌రావు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ నల్లగొండలో స్థిరపడ్డాడు. బుధవారం సాయంత్రం లెప్రసీ కాలనీ వద్ద వెంచర్‌లో వాకింగ్‌ చేసి, బైక్‌పై నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి వస్తున్నాడు.

లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా.. హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ వైపు బీఎండబ్ల్యూ కారులో వెళ్తున్న హాస్యనటుడు రఘుబాబు వేగంగా వచ్చి ఇతడి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో జనార్దన్‌రావు మొదట కారు అద్దంపై పడి, ఆ తర్వాత ఎగిరి 100 మీటర్ల దూరంలో పడ్డాడు. బైక్‌ కారు ఇంజన్‌లో ఇరుక్కుపోయింది. జనార్దన్‌రావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న వారు గమనించి, కమెడియన్‌ రఘుబాబుతో వాగ్వాదానికి దిగారు. అనంతరం టూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు.

రఘుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనార్దన్‌రావు మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య నాగమణి, కుమార్తె ఝాన్సీ, కుమారుడు భరత్‌ ఉన్నారు. కుమార్తె ఇటీవల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరగా, కుమారుడు బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కమెడియన్‌ రఘుబాబు అజాగ్రత్తగా కారు నడిపి తన భర్త మృతికి కారణమయ్యాడని నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

పలువురి సంతాపం..
జనార్దన్‌రావు మృతి పట్ల బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్‌, మారగోని గణేష్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్యగౌడ్‌, పలువురు వ్యాపారవేత్తలు సంతాపం తెలిపారు.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250