Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అమెరికా స్పందన

Published Wed, Apr 17 2024 2:03 PM

US says we wont involve PM Modi remark on terrorism - Sakshi

ప్రధాన మంత్రి నరేం‍ద్ర మోదీ ఇటీవల ఉగ్రవాదులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఉగ్రవాదులను హతమార్చేందుకు సరిహద్దులు దాటేందుకు భారత్ వెనుకాబోదని మోదీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ బుధవారం స్పందించారు. ‘ఈ విషయంలో ఇప్పటికే ఒకసారి స్పష్టత ఇచ్చాను. అమెరికా ఈ  విషయంలో అస్సలు జోక్యం చేసుకోదు. కానీ భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు సమరస్యంగా చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోవాలి’ అని మిల్లర్‌ అన్నారు.

ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు భారత​దేశంలో  చాలా దృఢమైన ప్రభుత్వం ఉంది.  ప్రధాని మోదీ  ప్రభుత్వంలో సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వారి ఇళ్ల వద్ద హతమార్చడానికి కూడా వెనకాడబోము’ అని అన్నారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం ఇలాంటి వ్యాఖ్యలే  చేశారు. ‘భారత దేశంలోని శాంతికి భంగం కల్గిస్తే.. ఉగ్రవాదలు పాకిస్తాన్‌లో ఉన్నా అంతం చేస్తాం’ అని అన్నారు. మరోవైపు రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ స్పందించింది.‘భారత్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది’ అని పేర్కొంది.

అంతకుముందు.. పాకిస్తాన్‌లో ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉందని బ్రిటన్‌కు  చెందిన దీ గార్డియన్‌ పత్రిక ఓ నివేదిక విడుదల చేసింది. 2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్‌ పాటిస్తోందని పేర్కొంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్‌, పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్‌ పత్రిక పేర్కొనటం గమనార్హం.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250