Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Business Deal: కలిసి బిజినెస్‌ చేయనున్న దిగ్గజ వ్యాపారవేత్తలు..!

Published Fri, Mar 29 2024 12:24 PM

RIL Bought 26 Percentage Stake In Adani Power Project - Sakshi

అదానీ కంపెనీలో 26 శాతం వాటా కొన్న అంబానీ
 

అవునన్నా..కాదన్నా.. ఇద్దరు దిగ్గజ వ్యాపారస్థుల మధ్య ఎల్లప్పుడూ పోటీనే ఉంటుంది. తమతమ వ్యాపారాల్లో ఆధిపత్యపోరు సాగుతూనే ఉంటుంది. అలాంటిది ఇద్దరికీ ఒకేతరహా వ్యాపారాలు ఉంటే మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ కంపెనీ లాభాల కోసం ఎత్తుకుపైఎత్తులు వేస్తారు. కానీ అలాంటి భీకర వాతావరణం లేకుండా ఇద్దరు వ్యాపార సామ్రాజ్య సార్వభౌములు కలిశారు. వాటాలు పంచుకున్నారు. ఓ ప్రాజెక్టు విషయంలో మొదలైన భాగస్వామ్య బంధం భవిష్యత్తులో ఎలా సాగుతుందోననే ఉత్కంఠ మొదలైంది. నిన్నటి వరకూ వ్యాపార ప్రత్యర్థులుగా ఉండి నేటి నుంచి వ్యాపార భాగస్వాములుగా మారిన ఆ ఇద్దరూ మరెవరోకాదు దేశంలోనే వ్యాపార దిగ్గజాలుగా ఉన్న ముఖేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీలు. 

ఓ పవర్ ప్రాజెక్టు విషయంలో వీరిద్దరి మధ్య తాజాగా భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా అదానీ పవర్‌కు చెందిన మహాన్ ఎనర్జెన్‌ లిమిటెడ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఆర్‌ఐఎల్‌ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఈ ఇద్దరు దిగ్గజాలు వేర్వేరు వ్యాపారాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, అగ్రస్థానాన్ని అధిరోహించడం కోసం ఎవరి శైలిలో వారు పోటీపడుతున్నారు. ఆయిల్, గ్యాస్, రిటైల్, టెలికాం విభాగాల్లో ముఖేష్ అంబానీ విజయపరంపరతో ముందుకు వెళ్తున్నారు. ఇన్‌ఫ్రా, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మైనింగ్ వ్యాపారాల్లో అదానీ దూసుకెళ్తున్నారు. మీడియా, పునరుత్పాదాక ఇంధన రంగాలలో మాత్రం ఇద్దరి మధ్య పోటీ ఉంది. 

తాజా ప్రాజెక్ట్‌ ఒప్పందంతో ఇద్దరి మధ్య భాగస్వామ్యం కుదిరినా, కయ్యం ఉండదని చెప్పలేమని నిపుణులు భావిస్తున్నారు. వీరి వియ్యాలు.. కయ్యాలు ఎలా ఉన్నా వీరి వల్ల దేశానికి ఏదైనా మేలు జరిగితేనే ప్రయోజనం జరుగుతుందని చెబుతున్నారు. భారత్‌ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తే అందరూ హర్షిస్తారు. ఇద్దరూ గుజరాతీయులే. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. దిల్లీ పెద్దల ఆశీస్సులు ఇద్దరికీ పుష్కలంగానే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పదేళ్ల కాలంతో అదానీ గ్రూప్‌ సంస్థలు భారీ లాభాల్లోకి వెళ్లాయన్నది మాత్రం వాస్తవమని చెబుతున్నారు. 

ఇదీ చదవండి: వర్షం కురిస్తే ట్యాక్స్‌ కట్టాల్సిందే..!

అంబానీకి చమురు-గ్యాస్‌ నుంచి టెలికాం దాకా వ్యాపారాలున్నా.. అదానీ బొగ్గు తవ్వకం నుంచి విమానాశ్రయాల వరకు విస్తరించినా.. ఒక్క స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో మినహా అంబానీ, అదానీ ఒకరి వ్యాపార బాటలో మరొకరు తారసపడిందే లేదు. 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు అదానీ గ్రూప్‌ దరఖాస్తు చేసినా.. పబ్లిక్‌ నెట్‌వర్క్‌ కోసం దానిని వినియోగించలేదు. అంతే కాదు.. 2022లో అంబానీతో సంబంధమున్న ఒక కంపెనీ ఎన్‌డీటీవీలో తనకున్న వాటాలను అదానీకి విక్రయించింది కూడా. ఈ నెల మొదట్లో ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు అదానీ హాజరయ్యారు.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250