Sakshi News home page

సివిల్స్‌ టాపర్‌కు ఘన సత్కారం

Published Tue, Apr 23 2024 8:30 AM

భువనేష్‌రామ్‌ను సత్కరిస్తున్న కలెక్టర్‌  - Sakshi

తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా ఆవడి సరస్వతినగర్‌కు చెందిన భువనేష్‌రామ్‌ సివిల్స్‌లో 41వ ర్యాంకును సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో రాష్ట్రంలో టాపర్‌గా నిలిచిన భువనేష్‌రామ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను కలెక్టర్‌ సోమవారం ఉదయం తన కార్యాలయానికి పిలిపించి సత్కరించారు. 27 ఏళ్ల వయస్సులో ఐఏఎస్‌కు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. భువనేష్‌రామ్‌ విజయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువతకు సూచించారు. దీంతో పాటు పోటీ పరీక్షలకు ఎంపికవుతున్న విద్యార్థులతో భువనేష్‌రామ్‌ ముఖాముఖి నిర్వహించి వారిని ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని యువతకు సూచించిన ఆయన, ఉన్నత స్థాయికి చేరుకున్న తరువాత నిరుపేదలకు సేవ చేయాలనే సంకల్పం ఉండాలని సూచించారు. డీఆర్వో రాజ్‌కుమార్‌, భువనేష్‌ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల స్వీకరణ

కొరుక్కుపేట: విద్యా హక్కు (ఆర్‌టీఈ) చట్టం కింద తమిళనాడు రాష్ట్రంలోని ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో (మైనారిటీ స్కూల్స్‌ మినహా) 2024–25 విద్యా సంవత్సరానికి ఎల్‌కేజీ, 1వ తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ సోమవారం ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. మే 20లోగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రైవేట్‌ పాఠశాలల డైరెక్టర్‌ తెలిపారు. ఇతర వివరాలకు www.rte.tnshools.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మే 26న లాటరీ ద్వారా సీట్లు కేటాయిస్తామన్నారు.

ఆ నగదు మనీలాండరింగ్‌ పరిధిలోకి రాదు!

కోర్టుకు ఈడీ వివరణ

సాక్షి, చైన్నె: ఎన్నికల సమయంలో పట్టుబడే నగదు మనీ లాండరింగ్‌ కేసు పరిధిలోకి రాదుని మద్రాసు హైకోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోమవారం వివరణ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని కోర్టు సమగ్ర వివరాలను సమర్పించాలని ఆదేశించింది. వివరాలు..ఎన్నికల తనిఖీలలో భాగంగా తిరునల్వేలికి రైలులో తరలిస్తున్న రూ. 4 కోట్ల నగదును తాంబరంలో అధికారులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. విచారణలో ఈ నగదు తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నయనార్‌ నాగేంద్రన్‌కు చెందినట్టు తేలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్వతంత్ర అభ్యర్థి రాఘవన్‌ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. ఎలాంటి సమాధానం రాక పోవడంతో హైకోర్టు తలుపు తట్టారు. ఈ వ్యవహారంపై సోమవారం ఈడీ అధికారులు కోర్టుకు వివరణ ఇచ్చారు. పట్టుబడ్డ ఈ నగదు మనీ లాండరింగ్‌ కేసు పరిధిలోకి రాదు అని వివరణ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఈ నగదు పట్టుబడిన దృష్ట్యా, ఆదాయ పన్నుశాఖ, పోలీసుల విచారణ పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వివరణతో సంతృప్తి చెందని కోర్టు సమగ్ర వివరాలను ఈనెల24వ తేదీన సమర్పించాలని ఆదేశించారు. అదే సమయంలో ఈ నగదు విషయంగా విచారణకు రావాలని నయనార్‌ నాగేంద్రన్‌కు ఇప్పటికే తాంబరం పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తన లాయర్ల ద్వారా హాజరు కాకపోవడానికి గల కారణాలు, తనకు మరో పది రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ తాంబరం పోలీసులకు నయనార్‌నాగేంద్రన్‌ సమాచారం పంపించడం గమనార్హం.

తిరుత్తణి బస్టాండులో

ఆక్రమణల తొలగింపు

తిరుత్తణి: తిరుత్తణి బస్టాండ్‌లో ఆక్రమణలు పెరగడంతో ప్రయాణికులు ఎండలో ఇబ్బంది పడేవారు. పైగా ప్రయాణికుల పట్ల వ్యాపారులు దురుసుగా వ్యవహరించడంతో మున్సిపల్‌ కమిషనర్‌ అరుల్‌ సోమవారం తన సిబ్బందితో వెళ్లి పండ్లు, బొమ్మలు, పువ్వుల దుకాణాలు తొలగించారు. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

చిదంబరం నటరాజ స్వామి ఆలయ గుర్రం మృతి

తిరువొత్తియూరు: చిదంబరం నటరాజ ఆలయంలో అశ్వపూజ కోసం ఒక గుర్రాన్ని రాజా అనే పేరుతో సంరక్షిస్తున్నారు. ఇటీవల రాజా అస్వస్థతకు గురికావడంతో గత 4 రోజులుగా పశువైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆదివారం చికిత్స పొందుతూ రాజా మృతి చెందింది. గత 4 సంవత్సరాలుగా తిల్‌లై నటరాజ సేవలో నిమగ్నమై ఉన్న అశ్వరాజు ఆత్మకు శాంతి కలగాలని భక్తులు, దీక్షితులు పూలమాలలు వేసి నివాళులర్పించి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250