Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

నేనే చంపేశా..

Published Thu, Apr 18 2024 10:55 AM

మృతుడు నారాయణదాస్‌ (ఫైల్‌) - Sakshi

చేవెళ్ల: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగంగా తనకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో మేన బావను హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఊరేళ్ల సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. చేవెళ్లకు చెందిన కడమంచి నారాయణదాస్‌(46) జాతీయ అంబేడ్కర్‌ అవార్డు గ్రహీత, రియల్‌ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి ఊరేళ్ల సమీపంలో ఓ ఫాంహౌస్‌ ఉంది. కొద్ది రోజులుగా ఇందులో మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తన మేన బావమర్ది తూర్పాటి భాస్కర్‌తో కలిసి ఫాంహౌస్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పాడు. చీకటి పడినా రాకపోవడంతో మృతుడి భార్య పలుమార్లు ఫోన్‌ చేసింది. ప్రతీసారి లిఫ్ట్‌ చేసిన భాస్కర్‌.. బావ దూరంగా ఉన్నాడని చెప్పాడు. అర్ధరాత్రి తర్వాత చేవెళ్ల పీఎస్‌కు వెళ్లిన భాస్కర్‌.. నారాయణదాస్‌ను గొడ్డలితో నరికి చంపానని చెప్పి లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూసే వరకు నారాయణదాస్‌ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిజేశారు. మృతుడికి భార్య మాణెమ్మ, ఇద్దరు కుమారులున్నారు.

డబ్బులు ఇవ్వకపోవడంతోనే..

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే నారాయణదాస్‌ చాన్నాళ్లుగా భాస్కర్‌ను తన వెంట తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో షాబాద్‌ మండలం నాగరకుంటలోని ఓ భూమికి సంబంధించిన డీల్‌లో రూ.25లక్షలు ఇస్తానని భాస్కర్‌కు చెప్పాడు. ఇది పూర్తయి చాలా రోజులైనా డబ్బు ఇవ్వకుండా దాటవేస్తున్నాడు. దీంతో కొద్ది రోజులుగా భాస్కర్‌ అతనికి దూరంగా ఉంటున్నాడు. మంగళవారం డబ్బు అడగ్గా ఇస్తాలే నేనెక్కడికి వెళ్లట్లేదుగా అని చెప్పిన నారాయణదాస్‌.. భాస్కర్‌ను తీసుకుని ఊరెళ్లలోని ఫాంహౌస్‌కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి అక్కడే మద్యం తాగారు. ఈ క్రమంలో డబ్బుల విషయం మరోసారి చర్చకు రావడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సమయంలో కింద పడిపోయిన నారాయణదాస్‌ లేస్తే తనను చంపేస్తాడని భావించిన భాస్కర్‌ అక్కడే ఉన్న గొడ్డలితో మెడపై దాడి చేశాడు. అతడు చనిపోయాడని నిర్ణయించుకుని ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు.

హత్యపై అనుమానాలు

నారాయణదాస్‌ హత్య ఒక్కడివల్ల జరగలేదని, దీనిపై నిజానిజాలు తేల్చాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అక్కడే పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

డబ్బుల విషయంలో గొడవ

గొడ్డలితో దాడి చేసి మేన బావను హతమార్చిన నిందితుడు

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250