Sakshi News home page

మార్పు తీసుకురండి

Published Tue, May 7 2024 11:45 AM

మార్పు తీసుకురండి

మోసపోకండి..

రాయగడ: రాష్ట్ర ప్రజలు సీఎం నవీన్‌ పట్నాయక్‌ పాలనను ఇంకా నమ్ముతున్నారని, ఆయనపై అభిమానంతో ఓటు వేసి గెలిపిస్తే మరొకరు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, ఇంకా మోసపోకండి మార్పు తీసుకురండని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన ఆయన గురువారం స్థానిక తేజస్వి హోటల్‌లో విలేకర్లతో మాట్లాడారు. బీజేడీకి ప్రజలు గుడ్‌బై చెప్పాలన్నారు. దాదాపు 25 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు.

బాకై ్సట్‌ నిక్షేపాలు గుత్తేదారులకు తాకట్టు..

ఖనిజ, ప్రకృతి సంపదలకు నిలయమైన రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి ఏమాత్రం కనిపించడం లేదన్నారు. ముఖ్యంగా రాయగడ వంటి జిల్లాలోని బాకై ్సట్‌ గనులను అదాని, వేదంత్‌ వంటి కంపెనీలకు తాకట్టుపెట్టి చొద్యం చూస్తున్న ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. బాకై ్సట్‌ వంటి నిక్షేపాలు ఉన్న ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్నప్పటికీ ఆయా అనావాళ్లు అసలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నారు. పారిశ్రామిక ప్రగతితోనే నిరుద్యోగ సమస్యను నిర్మూలించగలమన్నారు.

హామీలను నెరవేర్చే పార్టీ కాంగ్రెస్‌..

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ కేవలం కాంగ్రెస్‌ మాత్రమేనని, ఈసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లొనే అభివృద్ధి అంటే ఏమిటొ చూపిస్తుందన్నారు. మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేసిందన్నారు. మహిళల కోసం ఉచితంగా ఆర్టీసీ బస్సు సేవలు అందిస్తున్నామన్నారు. రూ.500 లకే వంట గ్యాస్‌ను అందిస్తున్నామని వివరించారు. రెండు వందల యూనిట్ల లోపల ఉచిత విద్యుత్‌ను ఇస్తూ ప్రజల మెప్పు పొందుతున్నామన్నారు. అలాగే రైతులను ఆదుకుంటున్నామని వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

మజ్జిగౌరి అమ్మ దర్శనం..

ఎన్నికల ప్రచారానికి వచ్చిన భట్టీ మజ్జి గౌరమ్మ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను చేయించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

రాహుల్‌ గాంధీ సభను విజయవంతం చేయండి..

ఎన్నికల ప్రచారానికి శుక్రవారం రాయగడకు వస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని భట్టీ ప్రజలను కొరారు. రాష్ట్రంలో కాంగ్రేస్‌ పాలన వస్తే చేపట్టనున్న పథకాలు, హామీలను రాహుల్‌ గాంధీ ప్రకటిస్తారన్నారు. ఏఐసీసీ సాధారణ కార్యదర్శి షాన్‌వాష్‌ చౌదరి, విశ్వరంజన్‌ మహంతి, రాయగడ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పల స్వామి కడ్రక, కొరాపుట్‌ ఎంపీ అభ్యర్థి సప్తగిరి ఉలక, పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గా ప్రసాద్‌ పండా తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం

భట్టి విక్రమార్క

Advertisement

homepage_300x250