Sakshi News home page

సత్తా చాటాలని..!

Published Tue, May 7 2024 11:45 AM

సత్తా

● కంటాబంజీ స్థానానికి సీఎం

నవీన్‌ నామినేషన్‌

● కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న స్థానంలో పోటీ

● పశ్చిమ ఒడిశాలో బల నిరూపణకు

అవకాశం

భువనేశ్వర్‌: పశ్చిమ ఒడిశాలో భీకర రాజకీయ పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ గురువారం టిట్లాగడ్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కంటాబంజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. తమ ప్రియతమ నేతకు స్వాగతం పలికేందుకు దారి పొడవునా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కంటాబంజీ నామినేషన్‌తో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సవాలుతో కూడిన రాజకీయ యాత్రకు శంఖారావం చేశారు.

కాంగ్రెస్‌ కంచుకోట పడగొట్టాలని బిజూ జనతా దళ్‌ కంచుకోటగా గంజాం జిల్లా హింజిలి నిరూపితం. యథాతథంగా నవీన్‌ పట్నాయక్‌ ఈ నియోజకవర్గం నుంచి మొదటి నామినేషన్‌ దాఖలు చేశారు. రెండో నామినేషను పశ్చిమ ఒడిశా కంటాబంజీ నుంచి పోటీకి నామినేషన్‌ దాఖలు చేసి భీకర పోరుకు రంగ ప్రవేశం చేశారు. నవీన్‌ ప్రవేశంతో ఈ నియోజకవర్గంలో పోరు తారాస్థాయిలో ఉంటుందని అంచనా. గత 2019 ఎన్నికల్లో బిజూ జనతా దళ్‌ కంటాబంజీ అసెంబ్లీ స్థానంలో మూడో స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితిని అధిగమించి యావత్తు పశ్చిమ ఒడిశాలో తమ పార్టీ ఉనికిని బలోపేతం చేయడమే ధ్యేయంగా బీజేడీ అధినేత ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. కంటాబంజి నియోజకవర్గం కాంగ్రెసు కంచుకోటగా చలామణి అవుతుంది. మరోవైపు ఈ నియోజకవర్గంతో కూడిన బొలంగీరు లోక్‌సభ స్థానం భారతీయ జనతా పార్టీ అధీనంలో ఉంది. ఈ పోరులో గెలుపు సాధించి బొలంగీరు లోక్‌సభ ఎన్నికని ప్రభావితం చేసి యావత్తు పశ్చిమ ఒడిశాలో నవీన్‌ గ్లామర్‌ని తళుక్కుమనిపించే ఉత్సాహంతో నామినేషన్‌ దాఖలు చేశారు. నవీన్‌ పట్నాయక్‌ పోటీ పశ్చిమ ఒడిశాలో సమగ్ర రాజకీయ ముఖ చిత్రానికి కొత్త కవలికలు దిద్దుతుందనడంలో సందేహం లేదు.

బొలంగీర్‌లో బీజేపీ

భారతీయ జనతా పార్టీకి చెందిన సంగీతా కుమారి సింగ్‌ దేవ్‌ బలంగీర్‌ లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఈ స్థానం పరిధిలో కంటాబంజీ అసెంబ్లీ సెగ్మెంటు ఒకటి. బొలంగీర్‌ లోక్‌సభ స్థానంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సంగీతా కుమారి సింగ్‌ దేవ్‌కు కంటాబంజీ అసెంబ్లీ సెగ్మెంటులో అత్యధిక ఆధరణ లభించింది. 2019లో బీజేపీ అభ్యర్థిగా సంగీతా సింగ్‌దేవ్‌కు కంటాబంజీ సెగ్మెంట్‌ నుంచి అత్యధికంగా 33,765 ఓట్లు లభించాయి. ఈ పార్లమెంటరీ స్థానంలో మరో కీలక అసెంబ్లీ సెగ్మెంటు పట్నగొడొ. ఈ నియోజకవర్గానికి ఆమె భర్త కనక వర్ధన్‌ సింగ్‌దేవ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సంగీతా సింగ్‌దేవ్‌కు ఈ పట్నగొడొ నుంచి 7,983 ఓట్లు పోలయ్యాయి. 2019లో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తన సొంత ఇలాఖా గంజాం జిల్లా హింజిలితో పశ్చిమ ఒడిశా బర్‌గడ్‌ జిల్లా బీజేపూర్‌ నుంచి పోటీ చేశారు. దీంతో అప్పటివరకు కాంగ్రెసు అధీనంలో ఉన్న బీజేపూర్‌ శాసనసభ స్థానం బీజేడీ ఖాతాలో పదిలమైంది. ఈసారి ఆయన హింజిలితో పాటు బొలంగీర్‌ జిల్లా కంటాబంజీ నుంచి పోటీ చేయడం మరో విప్లవాత్మక మార్పుని ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు.

సత్తా చాటాలని..!
1/2

సత్తా చాటాలని..!

సత్తా చాటాలని..!
2/2

సత్తా చాటాలని..!

Advertisement

homepage_300x250