Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Lok Sabha Elections History: ఎన్నికలు ఎందుకింత హాటు?

Published Fri, Apr 19 2024 4:30 AM

Lok sabha elections 2024: History of Lok Sabha elections - Sakshi

2004 నుంచి మండుటెండల్లోనే ఎన్నికలు

వాజ్‌పేయి సర్కారు ముందస్తుకు వెళ్లడం వల్లే!

తొలి సార్వత్రిక ఎన్నికలు అక్టోబర్‌–ఫిబ్రవరిల్లో

1989 దాకా జనవరి–మార్చిలోపే పోలింగ్‌

ఎండలు బాబోయ్‌ ఎండలు... ఏప్రిల్లోనే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఇక మే నెల మొదలైతే నిప్పుల కొలిమే! ఎన్నికల సిబ్బందితో పాటు దాదాపు 100 కోట్ల మంది ఓటర్లకు ఈసారి వేసవి సెగ మామూలుగా తగలడం లేదు. ఎన్నికలు ఇలా దంచికొడుతున్న ఎండల్లో జరగడానికి కారణం నూటికి నూరుపాళ్లూ రాజకీయాలే. అవును! తొలి లోక్‌సభ ఎన్నికలు అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి దాకా చలికాలంలోనే జరిగాయి. 2004లో జరిగిన ముందస్తు ఎన్నికల పుణ్యమా అని 20 ఏళ్లుగా ఇదుగో,
ఇలా మండే ఎండల్లో జరుగుతున్నాయి.

అక్టోబర్‌ టు అక్టోబర్‌...
స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా 1951–52లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి దాకా ఈ ప్రక్రియ సుదీర్ఘంగా నడిచింది. నెహ్రూ ప్రధానిగా తొలి లోక్‌సభ 1952 ఏప్రిల్‌ 17 నుంచి 1957 ఏప్రిల్‌ దాకా కొనసాగింది. అక్కణ్నుంచి 1980 దాకా లోక్‌సభ ఎన్నికలు జనవరి, ఫిబ్రవరి, లేదంటే మార్చిలోనే జరిగాయి. 1984లో ఇందిర హత్యానంతరం ప్రధాని అయిన రాజీవ్‌ గాంధీ లోక్‌సభను రద్దు చేయడంతో డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిగాయి.

1989లో సెపె్టంబర్, అక్టోబర్‌ నెలల్లో జరిగాయి. సంకీర్ణ ప్రభుత్వాలు సరిగా నడవక చివరికి రెండేళ్లకే లోక్‌సభ రద్దయింది. దాంతో 1991 మే, జూన్‌ నెలల్లో ఎన్నికలు జరిగాయి. ఎండాకాలంలో జరిగిన తొలి ఎలక్షన్లు అవే. 1996లోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లోనే ఎన్నికలు జరిగాయి. రెండేళ్లకే లోక్‌సభ రద్దవడంతో 1998 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. వాజ్‌పేయి సర్కారు 13 నెలలకే కుప్పకూలి 1999లో ఎన్నికలు సెపె్టంబర్, అక్టోబర్‌ మధ్య జరిగాయి.

ఇప్పుడు మనందరినీ ఠారెత్తిస్తున్న ఎండాకాలపు ఎన్నికలకు 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే కారణం. బీజేపీ ఆర్నెల్ల ముందే లోక్‌సభను రద్దు చేసి ఏప్రిల్, మే నెలల్లో మండే ఎండల్లో ఎన్నికలకు వెళ్లింది. అలా ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ మండుటెండల్లో మొదలైన సార్వత్రిక ఎన్నికల సీజన్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. తర్వాత 2009, 2014, 2019లోనూ ఎండా కాలంలోనే ఎన్నికలు జరిగాయి. ఇలా రెండు దశాబ్దాలుగా ఏప్రిల్‌–జూన్‌ ఎన్నికల ‘వేడి’ కొనసాగుతూ వస్తోంది.
 

మార్చడం కుదరదా?
చట్టప్రకారం లోక్‌సభ గడువు తీరేలోగా ఎన్నికలు జరిగి కొత్త సభ కొలువుదీరాల్సిందే. తదనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్‌ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు జూన్‌ 16తో ముగుస్తుంది. ఆలోపు ఎన్నికల తతంగమంతా పూర్తయి కొత్త సభ్యులతో 18వ లోక్‌సభ కొలువుదీరాలన్నమాట. కనుక ఎన్నికల తేదీలను మరీ ముందుకు, వెనక్కు జరపడం కుదరదు. అంటే మళ్లీ మధ్యంతరమో, ముందస్తు ఎన్నికలో వస్తే తప్ప ఈ షెడ్యూల్‌ మారబోదు. అప్పటిదాకా మనమంతా ఇలా ఎండల్లో ఓటెత్తకా తప్పదు!!

లోక్‌సభ ఎన్నికలు జరిగిన తీరు...
ఏడాది                         పోలింగ్‌ తేదీలు  
1951–52                అక్టోబర్‌ 25 – ఫిబ్రవరి 21
1957                      ఫిబ్రవరి 24 – మార్చి 14
1962                      ఫిబ్రవరి 19–25
1967                      ఫిబ్రవరి 17–21
1971                      మార్చి 1–10
1977                      మార్చి 16–20
1980                      జనవరి 3–6
1984                      డిసెంబర్‌ 24–28
1989                      నవంబర్‌ 22–26
1991                      మే 20 – జూన్‌ 15
1996                      ఏప్రిల్‌ 27 – మే 7
1998                      ఫిబ్రవరి 16–28
1999                      సెపె్టంబర్‌ 5 – అక్టోబర్‌ 3
2004                      ఏప్రిల్‌ 20 – మే 10
2009                      ఏప్రిల్‌ 16 – మే 13
2014                      ఏప్రిల్‌ 7 – మే 12
2019                      ఏప్రిల్‌ 11 – మే 19
2024                      ఏప్రిల్‌ 19 – జూన్‌ 1

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250