Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఆ చట్టానికి కోరలు ఎక్కువే!

Published Wed, Apr 17 2024 4:11 AM

Sakshi Guest Column On Prevention of Money Laundering Act

విశ్లేషణ

ప్రారంభం నుంచీ మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) వరుసగా అనేక సవరణలకు గురై మరింత కఠినంగా మారింది. దాంతో చట్ట అన్వయా నికీ, వ్యక్తిగత స్వేచ్ఛకూ మధ్య సాధించాల్సిన సమతూకపు ఆవశ్యకత పెరుగుతోంది. పీఎంఎల్‌ఏ నిబంధనలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదని చెప్పడం ద్వారా ఈడీకి ఉన్న విస్తారమైన అధికారాలను 2002లో సుప్రీంకోర్టు తీర్పు దృఢపరిచింది.

ఈ తీర్పు ఫెడరల్‌ ఏజెన్సీకి అనవసరమైన వెసులు బాటు కల్పించిందని మానవ హక్కుల న్యాయవాదులు విమర్శించారు. ఏ రుజువూ లేకుండానే ఆరు నెలలు నిర్బంధంలో గడిపి, బెయిల్‌ మీద విడుదలైన ‘ఆప్‌’ ఎంపీ సంజయ్‌ సింగ్‌ కేసు ప్రాథమిక హక్కులపై పీఎంఎల్‌ఏ కలిగిస్తున్న ప్రభావాలను పునఃపరిశీలించవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.

ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న పోరాటంలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎమ్‌ఎల్‌ఏ) ఒక ముఖ్యసాధనం. 2005 జూలైలో అమలులోకి వచ్చి నప్పటి నుండి ఈ చట్టం సమూల మార్పులకు గురైంది. 2009, 2012, 2015, 2018, 2019, 2023లో ఈ చట్టానికి చేసిన పలు సవ రణలు... అక్రమ ఆస్తులకు వ్యతిరేకంగా దేశం ప్రదర్శిస్తున్న కఠిన వైఖరిని ప్రతిబింబిస్తాయి. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన తాజా పరిణామం... కఠినమైన చట్టాన్ని అన్వయించడంలో న్యాయపరమైన పర్యవేక్షణ, జవాబుదారీతనాలకు సంబంధించిన క్లిష్టమైన అవసరాన్ని గుర్తించింది. మనీలాండరింగ్‌లో తన ప్రమేయం ఉన్నట్లు రుజువు లేకుండానే ఆరు నెలలు నిర్బంధంలో గడిపిన తర్వాత, సింగ్‌ బెయిల్‌ పిటీషన్‌పై సవాలు చేయకూడదని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) నిర్ణయించుకుంది.

గత కొన్ని సంవత్సరాలుగా, ప్రత్యేకించి 2022లో ‘విజయ్‌ మదన్‌లాల్‌ చౌదరి’ కేసుపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తర్వాత, మనీలాండరింగ్‌ చట్టం నిబంధనలను రాజ్యాంగ సూత్రా లతో సమతుల్యం చేయాలని సుప్రీంకోర్టును ఎక్కువగా కోరడం జరుగుతోంది. పీఎంఎల్‌ఏ నిబంధనలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదని నొక్కి చెబుతూ ఈడీకి ఉన్న విస్తారమైన అధికారాలను ఆ తీర్పు దృఢపరిచింది. జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం (ఈయన పదవీ విరమణ చేశాక లోక్‌పాల్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు), అక్రమాస్తుల నిరోధ సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యల అవసరాన్ని నొక్కి చెప్పింది.

పైగా, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) కింద భారతదేశ బాధ్యతలను నెరవేర్చడంలో ఈ చట్టం పాత్రను ధర్మాసనం గుర్తించింది. ఈ తీర్పు ఈడీని బలోపేతం చేసినప్పటికీ, వ్యక్తిగత స్వేచ్ఛలు, విధానపరమైన భద్రతలను పణంగా పెట్టి, ఫెడరల్‌ ఏజెన్సీకి అనవసరమైన వెసులుబాటు కల్పించిందని న్యాయ నిపుణులు, మానవ హక్కుల న్యాయవాదులు విమ ర్శలు గుప్పించారు. న్యాయం, వ్యక్తిగత హక్కుల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి బదులుగా, ఈ తీర్పు ఈడీ అధికారాన్ని దుర్వినియోగం చేయగలదనే భయాందోళనలకు తావిచ్చింది. 

ఈ తీర్పు వెలువడిన కేవలం ఒక నెల తర్వాత, మరో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ దానిపై రివ్యూ పిటిషన్లను అంగీకరించింది. నిందితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) కాపీని తిరస్కరించడం, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యత నిందితుడి మీద ఉండటం– రెండు అంశాలను పునఃపరిశీలించడానికి ధర్మాసనం అంగీకరించింది. 2022 తీర్పుపై రివ్యూ పిటిషన్‌ పెండింగులో ఉండగా, వివిధ ఇతర కేసుల్లో మనీలాండరింగ్‌ చట్టం నిబంధనలను సుప్రీంకోర్టు వివరించాల్సి వచ్చింది, కొన్నిసార్లు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారాల పరిధిని న్యాయస్థానం పరిమితం చేసింది. తదనంతరం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులలో కొన్ని విజయ్‌ మదన్‌ లాల్‌ చౌదరి తీర్పునకు విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి.

ఉదాహరణకు, 2023 అక్టోబర్‌లో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంది. మనీలాండరింగ్‌ కేసుల్లో నిందితులకు వారిని అరెస్టు చేసిన కారణాల కాపీని ఈడీ తప్పనిసరిగా అందించాలని ధర్మాసనం ఆదేశించింది. మౌఖికంగా మాత్రమే సమాచారాన్ని అందించడం రాజ్యాంగ హక్కు ఉల్లంఘనగా పరిగణించబడుతుందని పేర్కొంది. అయితే, 2022 తీర్పు, నిందితు డిని అరెస్టు చేయడానికి గల కారణాలను వెల్లడించడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(1)కి తగినంత సమ్మతి కలిగి ఉందని చెప్పింది. వారి అరెస్టుకు కారణాలు తెలియజేయకుండా లేదా వారు ఎంచుకున్న న్యాయవాదిని సంప్రదించే హక్కును తిరస్కరిస్తూ, అరెస్టు చేసిన ఎవరినైనా సరే కస్టడీలో ఉంచకూడదని పేర్కొంది. 2023 తీర్పును సమీక్షించాలని కేంద్రం, ఈడీ గతనెలలో చేసిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చడమైనది.

అదేవిధంగా, 2023 ఆగస్టులో తమిళనాడు మంత్రి వి సెంథిల్‌ బాలాజీ మెడికల్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పులో, అక్రమాస్తుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 19 కింద అరెస్టు చేసే అధికారాలను జాగ్రత్తగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. విధాన పరమైన లేదా ముఖ్యమైన ఉల్లంఘనలు ఉన్నట్లయితే, అరెస్టు చేసిన వ్యక్తిని న్యాయమూర్తులు వెంటనే విడుదల చేయాలని ఈ తీర్పు పేర్కొంది. ఈ తీర్పు అధికార దుర్వినియోగాన్ని నిరోధించడంలోనూ, సరైన కారణం లేకుండా అరెస్టులు శిక్షార్హమైనవి కాదని నిర్ధారించడంలోనూ న్యాయవ్యవస్థ పాత్రను బలపరిచింది.

2023 అక్టోబర్‌లో, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన మరో తీర్పు, సత్వర విచారణను కోరుకోవడం ప్రాథమిక హక్కుగా నొక్కి చెప్పింది. అదే సమయంలో అక్రమాస్తుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 45 ఆరోపించినట్లుగా నేరాభియోగాలకు తాము పాల్పడలేదని నిందితులే రుజువు చేసుకోవాలంటూ వారిపై ప్రాథమికంగా మోపే భారం అనేది వారి బెయిల్‌ మంజూరుకు సంపూర్ణ అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ‘నిందితుడికి నిమిత్తం లేని కారణాల వల్ల విచారణ కొనసాగనప్పుడు, సరైన కారణాలు ఉంటే తప్ప, బెయిల్‌ మంజూరు చేసే అధికారాన్ని ఉపయోగించుకునేలా న్యాయస్థానం మార్గనిర్దేశం చేయవచ్చు. విచారణకు సంవత్సరాల కాలం పట్టే చోట ఇది నిజం’ అని చెప్పింది.

2023 నవంబర్‌లో పవన దిబ్బూర్‌ కేసులో ఇచ్చిన తీర్పులో, మనీలాండరింగ్‌ దర్యాప్తు ప్రారంభించడానికి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 120బీ కింద శిక్షార్హమైన నేరపూరిత కుట్ర మాత్రమే సరిపోదనీ, 2002 చట్టం కింద షెడ్యూల్డ్‌ నేరంగా ఆ కుట్ర ఉండాలనీ ప్రకటించింది. ఈ తీర్పు ఆధారంగానే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై నమోదైన కేసును సుప్రీంకోర్టు గత నెలలో కొట్టేసింది.

సంజయ్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం విషయంలో పురోగమిస్తున్న న్యాయశాస్త్రానికి మరొక ఉదాహరణ. రాజకీయ లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టపరమైన యంత్రాంగాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తుంది. ఈ కేసు దృఢమైన న్యాయ పరిశీలన ప్రాముఖ్యతను గుర్తుచేస్తోంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడంలో ప్రభుత్వ అధికారాల మధ్య సమతుల్యతను తిరిగి అంచనా వేయ డానికీ, పునశ్చరణ చేయడానికీ ఒక విస్తృత ధర్మాసనం ద్వారా 2022 తీర్పును సమగ్రంగా సమీక్షించవలసిన అవసరాన్ని కూడా ఇది గుర్తుచేస్తోంది.

ఇతర కేసులతో పాటు సంజయ్‌ సింగ్‌ కేసు, మనీలాండరింగ్‌ చట్టపరిధిలో ఉన్న కీలకమైన అంశాన్ని సూచిస్తోంది. ప్రాథమిక హక్కులపై మనీలాండరింగ్‌ చట్టం కలిగిస్తున్న ప్రభావాలను పూర్తిగా పునఃపరిశీలించవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. స్వేచ్ఛను కాపాడడానికి ఉద్దేశించిన న్యాయం రాజీ పడకుండా చూసేందుకు ఒక విస్తృత ధర్మాసనం ద్వారా పునఃపరిశీలన చేయాలని ఇది సూచిస్తోంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రాథమిక స్వేచ్ఛలను సవాలు చేస్తూనే ఉన్నందున, అమలు యంత్రాంగాలు న్యాయ, నిష్పక్షపాత సూత్రాలను అధిగమించకుండా చూడటంలో న్యాయవ్యవస్థ జాగ రూకతా పాత్ర అనివార్యమవుతోంది.

ఉత్కర్ష్‌ ఆనంద్‌ 
వ్యాసకర్త జర్నలిస్ట్, కాలమిస్ట్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250