breaking news
Ad - Sakshi_Home_Sticky
-
గోద్రెజ్ ప్రాపర్టీస్ ధరఖాస్తు రిజెక్ట్ చేసిన రెరా
ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్‌కు భారీ షాక్ తగిలింది. గురుగ్రామ్, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్స్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ 2016కు అనుగుణంగా లేని కారణంగా గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ ప్రాజెక్ట్‌ల పొడిగింపు దరఖాస్తును రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తిరస్కరించింది. గోద్రెజ్ డెవలపర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ ఆ సంస్థ ప్రమోటర్లు రెరాకు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తులో లైసెన్స్ పునరుద్ధరణ, త్రైమాసిక పురోగతి నివేదిక (క్యూపీఆర్)లో అందించిన బ్యాంక్ బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాల్లో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల్ని సరిదిద్దాలని రెరా అనేక సార్లు గోద్రెజ్‌కు ఆదేశాలు చేసింది. అయితే, వాటిని సరిదిద్దడంలో సదరు నిర్మాణ సంస్థ ప్రమోటర్లు విఫలమయ్యారు. దీంతో తాజాగా గోద్రెజ్ డెవలపర్ల ప్రాజెక్ట్ పొడింపు ధరఖాస్తును రిజెక్ట్ చేసింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ సెక్టార్ 85, గురుగ్రామ్‌లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఎయిర్ ఫేజ్ 4 నిర్మాణాలు చేపడుతోంది. ఇందుకోసం రెరా నుంచి గోద్రెజ్ 2018 నుంచి 2023 వరకు రిజిస్ట్రేషన్ పొందింది. రిజిస్ట్రేషన్ తేదీ ముగియడంతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ గోద్రెజ్ ప్రాపర్టీస్ రెరా చట్టంలోని సెక్షన్ 6 కింద దరఖాస్తు చేసింది. దరఖాస్తును పరిశీలించిన రెరా.. ఆ దరఖాస్తులో అనేక లోపాలను గుర్తించింది. వాటిని సరిదిద్దాలని కోరింది. చివరికి తీరు మార్చుకోకపోవడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ దరఖాస్తును తిరస్కరించింది. -
చేతులు కలిపిన అంబానీ– అదానీ
న్యూఢిల్లీ: బిలియనీర్ పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తొలిసారి చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్‌కు చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఆర్ఐఎల్ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వెరసి అదానీ పవర్ పూర్తి అనుబంధ సంస్థ మహన్ ఎనర్జెన్ లిమిటెడ్‌లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను ఆర్ఐఎల్ సొంతం చేసుకోనుంది. రూ. 10 ముఖ విలువకే(రూ. 50 కోట్లు) వీటిని చేజిక్కించుకోవడంతోపాటు.. 500 మెగావాట్ల విద్యుత్‌ను సొంత అవసరాలకు ఆర్ఐఎల్ వినియోగించుకోనుంది. సొంత వినియోగ పాలసీలో భాగంగా ఆర్ఐఎల్ 20 ఏళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) ఎంఈఎల్‌తో కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ వెల్లడించింది. మొత్తం 2,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఎంఈఎల్ ప్లాంటులో 600 మెగావాట్ల యూనిట్‌ను సొంత అవసరాల పద్ధతిలో తెరతీయనున్నట్లు వివరించింది. -
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్‌లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్నాప్‌చాట్‌లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్ఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. 2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని అయ్యర్ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది. అత్యవసర రక్షణ చర్యలు సూచించండి వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్‌కుమార్ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. ► ఒరిజినల్ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్స్ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. ► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్ గ్రౌటింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. ► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. ► 3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి. ► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి. ► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. ► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లో జామ్ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్‌కు స్టీల్ షీట్ పైల్స్‌ను అదనంగా ఏర్పాటు చేయాలి. సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. -
జస్ట్ రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు, ఈ విద్యార్థి చాలా స్పెషల్!
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓ బాలుడు నాసాకి ఎంపికయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జస్ట్ అతడు చేసిన రూ. 150ల ప్రాజెక్టు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా నిర్వహించే ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్ టీమ్‌లో సెలక్టయ్యేలా చేసింది. ఓ సాదాసీదా ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటూ నాసాకి ఎంపికవ్వడమే కాకుండా తన అద్భుత మేధాతో అందర్నీ అబ్బురపరుస్తున్నాడు ఈ బాలుడు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీలోని చిన్నగ్రామమైన ఛాయ్సన్కు చెందిన 15 ఏళ్ల ఉత్కర్ష్ అనే బాలుడు నాసాకు వెళ్తున్నాడు. పదోవతరగతి చదువుతున్న ఈ ఉత్కర్ష్ జనవరిలో సైన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల్లో వివిధ పాఠశాల విద్యార్థులంతా సుమారు రూ. 25 వేల నుంచి లక్షలు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ప్రిపేర్ చేస్తే, ఉత్కర్ష్ కేవలం రూ. 150ల ప్రాజెక్టుతో పాల్గొన్నాడు. అంతమంది విద్యార్థుల మందు నిలబడగలనా? అనుకున్న ఉత్కర్ష్ ..తన అద్భుత ప్రతిభతో తయారు చేసిన వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదికూడా తక్కువ మొత్తంలో ప్రాజెక్టుని ప్రజెంట్ చేయడంతో ఉత్కర్షని అంతా ప్రశంసలతో ముంచెత్తారు. అతడిలో ఉన్న ఆ అసాధారణ మేధస్సే నాసా హ్యుమన్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్(హెచ్‌ఈఆర్‌సీ) అని పిలిచే ఇంజనీర్ డిజైన్ ఛాలెంజ్ 2024లో పాల్గొనే కైజెల్ టీమ్‌లో ఉత్కర్షని భాగమయ్యేలా చేసింది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మానవ అంతరిక్ష పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులనే భాగం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్‌ని నిర్వహిస్తుంది. ఆ రోవర్ ఛాలెంజ్‌లో ఉత్కర్ష్ తన బృందంతో కలసి పాల్గొననున్నాడు. ఈ ఛాలెంజ్ వచ్చే నెల ఏప్రిల్ 18 నుంచి 20, 2024 వరకు జరుగుతుంది. ఇక ఉత్కర్ష నేపథ్యం వచ్చేటప్పటికీ..ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వారి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. ఉత్కర్ష్ తన తాత సురేంద్ర సింగ్ చేసే వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుంటాడు కూడా. చిన్నతనంలోనే ఉత్కర్ష్ బ్రెయిన్ హేమరేజ్కి గురయ్యి దాదాపు మూడు నెలలు వెంటిలేటర్ ఉన్నట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. "మృత్యముఖం నుంచి కాపడుకున్నా మా బిడ్డ ఈ రోజు ప్రతిష్టాత్మకమైన నాసా వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఎంపిక కావడం అన్నది మాకెంతో గర్వంగా ఉంది". అని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక ఉత్కర్ష్ తోపాటు పదోవతరగతి చదువుతున్న టౌరుకు చెందిన లోకేష్ కుమార్, గుహ, గురుగ్రామ్‌కి చెందిన పల్లవి, ఫరీదాబాద్‌కి చెందిన అరుణ్ కుమార్, పానిపట్ నుంచి రోహిత్ పాల్, నోయిడా నుంచి ఓమ్ తదితర విధ్యార్థులు ఎంపికయ్యారు. ఎంత్రీఎం ఫౌండేష్ ఈ వైఎంఆర్డీ టీమ కైజెల్కి మద్దతు ఇస్తుంది. నాసా నిర్వహించే ఈ ఇంజనీరింగ్ ఛాలెంజ్‌లో భారత్ తరుఫు నుంచి ఎనిమిది టీమ్‌లను ఎంపిక చేయగా, వాటిలో ఎన్జీవో మద్దతు గల జట్టే ఈ కైజెల్ టీమే. (చదవండి: స్నానమే ఆమెకు శాపం! చేసిందా..నరకమే..!)
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019