breaking news
-
All We Imagine as Light: గోల్డెన్ బరిలో మన బంగారం
డెబ్యూ ఫిక్షన్ ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ముంబైకి చెందిన పాయల్ కపాడియా. కాన్స్ ఫిల్మ్ఫెస్టివల్లోని ప్రిస్టీజియస్ కాంపిటీషన్ సెక్షన్ పామ్ డ ఓర్ (గోల్డెన్ పామ్)లో పాయల్ ఫిల్మ్ పోటీ పడనుంది. మూడు దశాబ్దాల తరువాత మన దేశం నుంచి ఈ విభాగానికి ఎంపికైన చిత్రం ఇదే... ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న పాయల్‌కు ఆర్థికశాస్త్రం కంటే సినిమా శాస్త్రమే ఎక్కువగా దగ్గరైంది. ఆ ఇష్టంతోనే ‘పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’లో చేరాలనుకుంది. రెండో ప్రయత్నంలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరింది. పాయల్‌కు తొలి గుర్తింపు ఆఫ్టర్నూన్ క్లౌడ్స్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2017)కు మన దేశం నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ఇది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు డైలాగ్ రైటింగ్ ఎక్సర్సైజ్లో భాగంగా ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ స్క్రిప్ట్ రాసుకుంది. పాయల్ శబ్దప్రేమికురాలు. ‘చెవులు మూసుకొని సినిమా చూస్తే ఏ ఫీలింగ్ ఉండదు’ అంటున్న పాయల్‌కు ఏ దృశ్యంలో ఎలాంటి శబ్దం ఉపయోగించాలో బాగా తెలుసు. ‘సినిమాలు ఎందుకు తీస్తారు?’ అనే ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా జవాబు చెప్పవచ్చు. పాయల్ చెప్పే జవాబు మాత్రం... ‘నన్ను నేను అర్థం చేసుకోవడానికి, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి చిత్రాలు తీస్తాను’ సినిమాను పాయల్ అర్థం చేసుకునే కోణం కూడా భిన్నమైనది. ‘సినిమా అనేది ΄్లాటే సర్వస్వంగా ఉండనక్కర్లేదు. చక్కని కవిత్వం చదివినట్లు ఉన్నా సరిపోతుంది’ అనేది ఆమె మనసులోని భావం. సోకాల్డ్ ఆడంబరాలు, పాపులర్ కల్చర్‌కు దూరంగా ఉండే ‘రిషి వ్యాలీ స్కూల్’లో చదువుకున్న చదువు పాయల్ ఆలోచనలను విశాలం చేసింది. ఇప్పుడంటే ప్రపంచ ‘చిత్ర’ పటంలో తనకంటూ కొంత గుర్తింపు సాధించింది పాయల్. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లితే మాత్రం ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు సంబంధించి ఫస్ట్ రిజెక్షన్ ఆమెను అమితంగా బాధించింది. కలల మేడ కళ్ల ముందే కుప్పకూలినట్లుగా అనిపించింది. ‘స్కూల్ రోజుల నుంచి పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరాలనేది నా కల. ఎందుకంటే నేను అభిమానించే ఎంతో మంది దర్శకులు అక్కడ చదువుకున్నారు. మొదట బాధ అనిపించినా ఆ తరువాత రెండో ప్రయత్నం చేయాలనుకున్నాను’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది పాయల్. రెండో ప్రయత్నం చేసి ఉండకపోతే ఆమె ప్రతిభ వృథాగా పోయేది. ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’కు లభించిన గుర్తింపుతో పాయల్ మనసులో ఆత్మవిశ్వాసం అనే బీజం పడింది. ‘ది లాస్ట్ మ్యాంగో బిఫోర్ ది మాన్సూన్’ ఫిల్మ్‌తో ఆ విత్తనం మొలకెత్తింది. ఈ షార్ట్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ ప్రైజ్ గెలుచుకుంది.‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది పాయల్. ఇది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (2021)లో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘గోల్డెన్ ఐ’ అవార్డ్ అందుకుంది. ఫిల్మ్‌మేకర్స్ డిజిటల్ ప్రపంచంలో ఉన్న ఈ కాలంలోనూ ‘ఫిల్మ్’ అంటే పాయల్‌కు ప్రత్యేక ఇష్టం. ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ను ఫిల్మ్ పైనే షూట్ చేసింది. ‘డిజిటల్ ఫిల్మ్‌తో పోల్చితే ఓల్డ్–స్కూల్ ఫిల్మ్‌లో ఇమేజ్‌కు సంబంధించిన ఈస్థెటిక్ క్వాలిటీ, సాఫ్ట్‌నెస్ భిన్నంగా ఉంటుంది’ అంటుంది పాయల్. ఫిల్మ్‌మేకింగ్ అనేది ఇలా అనుకోగానే అలా అయిపోదు. కొన్నిసార్లు చాలా టైమ్ తీసుకోవచ్చు. అందుకు ఎంతో ఓపిక అవసరం. అందుకే చిత్రనిర్మాణాన్ని శిల్పం చెక్కడంతో పోల్చుతుంది పాయల్. ‘చిత్రనిర్మాణం అనేది చాలా ఓపికగా శిల్పం చెక్కడం లాంటిది. ఆ శిల్పం ఎలా రూపుదిద్దుకోనుందో శిల్పికి కూడా తెలియదు. చిత్రం కూడా అంతే’ అంటుంది పాయల్. పాయల్ తల్లి నళిని మలాని ఆర్టిస్ట్. దేశవిదేశాలకు చెందిన అత్యుత్తమ సినిమాల క్యాసెట్లను ఇంటికి తీసుకువచ్చేది. సినిమాలపై పాయల్ ఆసక్తికి తల్లి ఫిల్మ్ కలెక్షన్ ఒక కారణం. ‘చూడాలేగానీ మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే ఎంతో అందం దాగుంది. అలాంటి అందాలను అమ్మ ఆస్వాదిస్తూ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది’ అంటుంది పాయల్. తల్లి ప్రభావం పాయల్‌పై కనిపిస్తుంది. ‘జీవనోత్సాహం నుంచే సృజన జనిస్తుంది’ అంటున్న పాయల్ తనదైన విజువల్ లాంగ్వేజ్‌ను తయారు చేసుకుంటోంది. మూడు దశాబ్దాల తరువాత... పాయల్ కపాడియా గుర్తింపును మరో స్థాయికి తీసుకు వెళ్లిన ఫీచర్ ఫిల్మ్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ముంబైలోని నర్స్ ప్రభ, భర్త, ప్రభ స్నేహితురాలు అను కేంద్రంగా సాగే చిత్రం ఇది. షాజీ ఎస్ కరుణ్ మలయాళ చిత్రం ‘స్వాహమ్’ తరువాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధాన పోటీకి ఎంపికైన చిత్రంగా ప్రత్యేకతను సాధించి ప్రశంసలు అందుకుంటోంది. ‘ఆల్ వి...’కి దర్శకత్వంతో పాటు రచన కూడా చేసింది పాయల్. ఈ చిత్రంలో దివ్య ప్రభ(మలయాళం సినిమా టేక్ ఆఫ్ ఫేమ్), కనీ కుస్రుతి (కేరళ కేఫ్ ఫేమ్), హృదు హరూన్ నటించారు. -
సూపర్ మహిళా గేమరే కాదు.. అంతకుమించిన అందగత్తె కూడా! (ఫొటోలు)
-
Payal Dhare: నంబర్ 1 మహిళా గేమర్
ఇటీవల ప్రధాని మోదీ దేశంలో టాప్ ఫాలోయింగ్ ఉన్న ఏడుగురు గేమర్స్‌ను కలిశారు. వారిలో ఒక్కతే అమ్మాయి పాయల్ ధారే. గేమ్స్‌ను ఆడుతూ తన వ్యాఖ్యానం వినిపిస్తూ ‘లైవ్ స్ట్రీమింగ్’ ద్వారా 35 లక్షల మంది ఫాలోయెర్లను సంపాదించుకున్న పాయల్ పురుషుల ఆధిపత్య రంగమైన గేమింగ్‌లో తనదైన స్థానం పొందారు. పాయల్ పరిచయం. వీడియో గేమ్స్ అనగానే మూడు విధాలైన భాగస్వాములు ప్రస్తావనకు వస్తారు. 1. గేమ్స్ ఆడేవాళ్లు 2. చలామణిలో ఉన్న గేమ్స్‌ను ఆడుతూ తమ వ్యాఖ్యానం వినిపిస్తూ (లైవ్ స్ట్రీమింగ్) వీడియోలు చేసేవారు, 3. గేమ్స్ తయారు చేసేవారు. మన దేశంలో 2014 తర్వాత సెల్ఫోన్ల అందుబాటు పెరిగాక గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే వారితోపాటు గేమ్స్ చుట్టూ షోస్ చేసేవారి (గేమర్స్) పలుకుబడి కూడా పెరిగింది. వీరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారారు. ఇక ఒరిజినల్‌గా మన దేశంలో గేమ్స్ తయారు చేసేవారు పై రెండు వర్గాలతో పోల్చితే తక్కువ. ఇటీవల ప్రధాని మోడి గేమ్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిన 7 మంది గేమర్స్‌ను న్యూఢిల్లీలో కలిసి వారితో మాటామంతి జరిపారు. తీర్థ్ మిత్ర, అనిమేష్ అగర్వాల్, అన్షు బిస్త్, నమన్ మాధుర్, మిథిలేష్, గణేష్ గంగాధర్ అనే యువ గేమర్‌లతోపాటు వీరితో పాల్గొన్న ఒకే ఒక మహిళా గేమర్ పాయల్ ధారే. 15000 మంది గేమర్స్ మన దేశంలో 15 వేల మంది గేమర్స్ ఉన్నారు. అంటే వీడియో గేమ్స్‌ను ఆడుతూ వాటిని వివరిస్తూ వాటిపై వ్యాఖ్యానం చేస్తూ ఇన్‌స్టా, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాపులర్ అయిన వారు. ఇలాంటి వారిలో అత్యంత ఆదరణ పొందిన వారికి లక్షల మంది ఫాలోయెర్స్ ఉంటారు. ఇదంతా గేమింగ్ కమ్యూనిటీ. గేమ్స్ చుట్టూ వీడియోలు చేసేందుకే మన దేశంలో దాదాపు 1500 స్టుడియో లు కూడా ఉన్నాయి. గేమ్స్‌ను స్వయంగా తయారు చేసే సాంకేతిక నైపుణ్యం లేని వారు కూడా ఉన్న గేమ్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. పాయల్ ధారే కూడా అలా పేరు పొందింది. సంవత్సరానికి 5 కోట్లు 23 ఏళ్ల పాయల్ ధారేకు ‘పాయల్ గేమింగ్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. ఈ చానల్లో ఆమె వీడియో గేమ్స్ ఆడుతూ తన సరదా వ్యాఖ్యానంతో వీడియోలు చేసి పెడుతుంటుంది. మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న గేమ్స్‌ను పరిచయం చేయడం లేదా ఆడటం వల్ల, సరదా వ్యాఖ్యానం చేయడం వల్ల గేమ్స్ అంటే ఇష్టం ఉన్న యువత అంతా ఈమె వీడియోలు ఫాలో అవుతుంటారు. దానివల్ల ఆమెకు సంవత్సరానికి రూ. 5 కోట్ల ఆదాయం అందుతోందని ఒక అంచనా. ఆశ్చర్యం ఏమంటే ఇంటర్ చదివే వరకూ కూడా పాయల్‌కు సెల్‌ఫోన్ లేదు. గేమ్స్ తెలియదు. పల్లెటూరి అమ్మాయి పాయల్ ధారేది మధ్యప్రదేశ్‌లోని చింద్వారా అనే చిన్న పల్లె. ఫోన్ కూడా చూడని ఆ అమ్మాయి 2021లో లాక్డౌన్ సమయంలో గేమ్స్ గురించి తెలుసుకుంది. ఆ సంవత్సరమే తన వీడియోలు రిలీజ్ చేయసాగింది. 2023 నాటికి అంటే కేవలం రెండేళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ పొందింది. ‘మా అమ్మ నేను గేమింగ్‌లోకి వెళతానంటే భయపడింది. మా నాన్న ప్రోత్సహించారు. వీడియో గేమింగ్‌లో ఆడపిల్లలకు అంత సులువుగా ప్రవేశం లభించదు’ అంటుంది పాయల్. ఇప్పుడు తనను చూసి కనీసం 200 మంది అమ్మాయిలు గేమింగ్‌లోకి వచ్చారని తెలిపింది. మంచి మార్గం కోసం ‘గేమ్స్‌ను తప్పించలేము. యువతకు మంచి లక్ష్యాలను ఏర్పరడానికి వీటిని మీరు ఉపయోగిస్తూ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి’ అని ప్రధాని గేమర్స్‌ను కోరారు. ‘మన పంచతంత్రం వంటి కథలను గేమ్స్‌కు వాడండి. పర్యావరణ సమస్యలు, స్వచ్ఛభారత్ వంటి అంశాలతో గేమ్స్ తయారు చేస్తే ఇండియన్ సంస్కృతి ఉన్న గేమ్స్ తయారు చేస్తే ఆటకు ఆట, బోధనకు బోధన సమకూరుతాయి’ అని ప్రధాని అన్నారు. చదువుకు తగిన సమయం ఇస్తూ, ఒకవేళ ఏదైనా ఉపాధి ఉంటే ఆ ఉపాధి, ఉద్యోగాల్లో ఉంటూ జీవనానికి తగు గ్యారంటీ ఉన్నప్పుడు గేమింగ్‌లోకి వచ్చి ఆ రంగంలో నిలదొక్కుకోవాలని గేమర్స్‌కు సూచించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కాన్స్ చిత్రోత్సవంలో భారతీయ చిత్రాలు
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం చరిత్ర సృష్టించింది. కాన్స్ చలన చిత్రోత్సవంలో ప్రధాన విభాగంగా భావించే పామ్ డ ఓర్’ అవార్డు పోటీలో నిలిచింది ఈ మలయాళ చిత్రం. ముంబైకి చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డ ఓర్’ అవార్డు కోసం పోటీలో నిలిచినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవం మే 15 నుంచి 25 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన అవార్డులు, స్క్రీనింగ్ కానున్న సినిమాల జాబితాను ప్రకటించారు నిర్వాహకులు. కాన్స్‌లో అత్యధిక బహుమతిని అందించే పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’తో పాటు అమెరికన్ ఫిల్మ్ ‘అనొర’, యూకే ఫిల్మ్ ‘ఓహ్.. కెనడా’, ఫ్రెంచ్ ఫిల్మ్ ‘బీటింగ్ హార్ట్స్’, పోర్చుగల్ ఫిల్మ్ ‘గ్రాండ్ టూర్’ వంటి దాదాపు 20 చిత్రాలు నిలిచాయి. ఇక ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో బ్రిటిష్ ఇండియన్ దర్శకురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’, బల్గేరియన్ దర్శకుడు కోన్స్టాటిన్ బోజనోవ్ దర్శకత్వంలో భారతీయ నటీనటులు భాగమైన ‘ది షేమ్‌లెస్’ చిత్రాలతో పాటు చైనా ఫిల్మ్ ‘బ్లాక్‌డాగ్’, ‘సెప్టెంబర్ సేస్’, జపాన్ ఫిల్మ్ ‘మై సన్‌షైన్’ వంటి 15 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక ‘అవుట్ ఆఫ్ కాంపిటిషన్’ విభాగంలో ‘ఫూరియోషియా: ది మ్యాడ్మాక్స్ సాగ’, ‘రూమర్స్’తో పాటు మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిడ్నైట్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది సఫర్’తో కలిసి నాలుగు చిత్రాలు, కాన్స్ ప్రీమియర్‌లో ‘ఇట్స్ నాట్ మీ’తో పాటు ఆరు చిత్రాలు, స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది బ్యూటీ ఆఫ్ ఘాజా’తో కలిపి ఐదు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ పోటీ పడుతోంది. ఈ విభాగంలో 1994లో మలయాళ చిత్రం ‘స్వాహం’ నామినేషన్‌ను దక్కించుకున్నా, అవార్డు గెల్చుకోలేకపోయింది. ఈ సినిమాకు షాజీ నీలకంఠన్ కరుణ్ దర్శకత్వం వహించారు. అలాగే ఇదే విభాగంలో అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రం ‘నీచా నగర్’. 1946లో విడుదలైన ఈ హిందీ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. ‘నీచా నగర్’ చిత్రం తర్వాత ‘అమర్ భూపాలి’, ‘ఆవారా’ వంటి చిత్రాలు పామ్ డ ఓర్’కు నామినేషన్ దక్కించుకున్నా అవార్డు గెల్చుకోలేకపోయాయి. 30 ఏళ్లకు ఈ విభాగంలో పోటీ పడుతున్న భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’కు అవార్డు వస్తుందా? అనేది చూడాలి. ఈసారి పామ్ డ ఓర్’ విభాగంలో విజేతను నిర్ణయించే జ్యూరీ అధ్యక్షురాలిగా అమెరికన్ నటి గ్రెటా గెర్విక్ వ్యవహరిస్తున్నారు. ఆల్ వీ ఇమాజిన్... కథేంటంటే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ప్రభ, అనులు ముంబైలో పని చేస్తుంటారు. ఈ ఇద్దరూ వారి వారి రిలేషన్షిప్స్లో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఈ ఇద్దరూ ఓ రోడ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశమని సమాచారం. ఈ మలయాళ చిత్రానికి రచయిత–దర్శకురాలు, ఎడిటర్ పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఇక పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. గతంలో పాయల్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ 2015లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్‌కు ఎంపిక అయింది. అలాగే పాయల్ దర్శకత్వంలో వచ్చిన మరో డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ 2021లో జరిగిన కాన్స్ ఫెస్టివల్లో ‘గోల్డెన్ ఐ’ అవార్డును గెలుచుకుంది. మరి.. ఈసారి కూడా పాయల్ అవార్డును గెలుస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సంతోష్ కథేంటంటే... బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరికి దర్శకురాలిగా ‘సంతోష్’ తొలి చిత్రం. ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. వితంతువు సంతోష్‌కి తన భర్త చేసే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం దక్కుతుంది. బలహీన వర్గానికి చెందిన ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఆ పై హత్యకు సంబంధించిన కేసుని ఛేదించే దర్యాప్తు బృందంలో సంతోష్ భాగం అవుతుంది. ఈ కేసుని ఆమె ఎలా హ్యాండిల్ చేసింది? అనేది కథాంశం. మరి.. ఈ చిత్రం కూడా అవార్డు దక్కించుకుంటుందా? చూడాలి. -
ఇండియన్ సినిమాకు అరుదైన ఘనత.. దాదాపు 30 ఏళ్ల తర్వాత!
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఇండియన్ సినిమాకు చోటు లభించింది. పాయల్ కపాడియా డైరెక్షన్లో తెరకెక్కించిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' కేన్స్‌లో పామ్ డి ఓర్ అవార్డుకు నామినేట్ అయింది. పాయల కపాడియా తెరకెక్కించిన మొదటి ఫిక్షన్ చిత్రమిది. ఈ ఏడాది మే 14 నుంచి 25 వరకు జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారాల కోసం పోటీలో నిలిచింది. దాదాపుగా పామ్ డి ఓర్ అవార్డు కోసం పోటీ పడుతున్న మొదటి భారతీయ చిత్రం ఇదే కావడం గమనార్హం. కాగా.. గతంలో 1994లో షాజీ ఎన్ కరుణ్ తెరకెక్కించిన 'స్వహం' మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ప్రముఖ హాలీవుడ్ చిత్రాలతో కపాడియా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' పోటీ పడుతోంది. ఈ ఏడాది జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు జ్యూరీకి 'లేడీబర్డ్', 'బార్బీ' డైరెక్టర్ గ్రెటా గెర్విగ్ అధ్యక్షత వహించనున్నారు. అంతే కాకుండా బ్రిటీష్-ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి చిత్రం 'సంతోష్' కూడా అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగానికి ఎంపికైంది. కాగా.. గతంలో పాయల్ కపాడియా డాక్యుమెంటరీ 'ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్' 2021 ఎడిషన్‌లో ఉత్తమ డాక్యుమెంటరీగా గోల్డెన్ ఐ అవార్డ్‌ను గెలుచుకుంది. 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' అనే మూవీని ఒక నర్సు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన భారతీయ చిత్రాలలో చేతన్ ఆనంద్, వి శాంతారామ్, రాజ్ కపూర్, సత్యజిత్ రే, ఎంఎస్ సత్యు, మృణాల్ సేన్ రచనలు ఉన్నాయి. 'నీచా నగర్' పామ్ అవార్డ్ గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది. Explore the dark heart of India with Sandhya Suri’s sophomore feature SANTOSH, in Official Selection at UN CERTAIN REGARD.#Santosh #SandhyaSuri @shahanagoswami @sunita_rajwar #GoodChaos @hautetcourt #LionfishFilms @BFI @Festival_Cannes #Cannes2024 #UnCertainRegard pic.twitter.com/UClJuS7rtW — mk2 films (@FilmsMk2) April 11, 2024 ALL WE IMAGINE AS LIGHT – Payal KAPADIA#Competition #Cannes2024 — Festival de Cannes (@Festival_Cannes) April 11, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019