breaking news
-
Israel-Iran tensions: ఇజ్రాయెల్ ప్రతీకార దాడి
దుబాయ్: ప్రతీకార దాడితో పశ్చిమాసియా మళ్లీ భగ్గున మండింది. తమ భూభాగంపై ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేసి చూపించింది. తమ డ్రోన్లను రంగంలోకి దింపింది. అమెరికా తయారీ ఎఫ్–14 టామ్‌క్యాట్స్ యుద్ధవిమానాలు ఉన్న ఇరాన్‌లోని ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరం, అణు కార్యక్రమాల ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే ఇస్ఫహాన్ నగర గగనతలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లను కూల్చేశామని, దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్‌పై దాడి పని ఇజ్రాయెల్దేనని అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న శుక్రవారం రోజే ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడం గమనార్హం. అణుకార్యక్రమాలు జరిగే ఆగ్నేయ జెర్డెంజన్ ప్రాంతంలో శత్రు విమానాలు, డ్రోన్లను నేలమట్టం చేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ క్రియాశీలం చేసింది. ఈ అణుకేంద్రంలో చైనా సరఫరాచేసిన స్వల్పస్థాయి అణు పరిశోధనా రియాక్టర్లు ఉన్నాయి. పౌర అణు అవసరాల కోసం అణు ఇంథనాన్ని ఇక్కడ ఉత్పత్తిచేస్తారు. ఇదే నగరంలో భూగర్భ అణు శుద్ది కర్మాగారం ఉంది. దీనిని లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ఈ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. -
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు నిజమే: ఇటలీ
క్యాప్రి ఐలాండ్: పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్లో శుక్రవారం(ఏప్రిల్ 19) సంభవించిన పేలుళ్లు ఇజ్రాయెల్ పనేనని అమెరికా చెబుతోంది. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి నిమిషంలో సమాచారం అందిందని జీ7 దేశాలకు అమెరికా తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని క్యాప్రి ఐలాండ్‌లో జరుగుతున్న జీ7 మీటింగ్‌లో ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలోని న్యూక్లియర్ స్థావరాల సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. డ్రోన్ల కూల్చివేత కారణంగానే పేలుళ్ల శబ్దాలు వెలువడ్డాయని వెల్లడించింది. ఇటు ఇరాన్‌పై దాడుల సమయంలోనే అటు సిరియాపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. కాగా, ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసింది. అయితే ఈ డ్రోన్లు, మిసైళ్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇరాన్ దాడుల వల్లే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఇదీ చదవండి.. ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. ఇజ్రాయెల్ పనేనన్న అమెరికా!
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ చేసిన డ్రోన్, మిసైల్ దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని ఇస్ఫాహాన్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించాయని అమెరికా పేర్కొంది. ఇరాన్‌పై మిసైల్ ఇజ్రాయెల్ దాడి చేసినట్లు అమెరికా అధికాలు తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. తమ భూభాగంలో ఇప్పటి వరకు ఎలాంటి మిసైల్ దాడి జరగలేదని తెలిపింది. అదే సమయంలో కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌కు సుమారు 350 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫాహాన్ నగరంలోని అతిపెద్ద మిలిటరీ ఎయిర్ బేస్, పలు ఇరాన్ న్యూక్లీయర్ సైట్లు ఉన్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడి జరిగినట్లు అమెరికా మీడియా తెలిపింది. ఈ దాడులను ఇరాన్ కొట్టేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఈ దాడుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడుల నేపథ్యంలో ఇరాన్లో పలు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ‘ఇరాన్ రక్షణ వ్యవస్థ పలు డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసింది. ప్రస్తుతానికి ఎటువంటి క్షిపణీ దాడి జరిగినట్లు నివేదికలు లేవు’ అని ఇరాన్ ప్రతినిధి హుస్సేన్ దాలిరియన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇస్ఫాహాన్ సమీపంలోని ప్రధాన వైమానిక స్థావరం సమీపంలో పేలుళ్ల శబ్దం వినిపించినట్టు మరికొందరు తెలిపారు. అయితే కీలకమైన ఎయిర్ బేస్ సైట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ కొన్ని డ్రోన్లను ప్రయోగించి ఉండవచ్చని ఇరాన్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్, మిసైల్ దాడులకు పాల్పడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరాన్‌పై ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరిస్తూ వచ్చింది. తాజా దాడులతో పశ్చిమాసియా మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఒక వేళ యుద్ధం అంటూ ప్రారంభమయితే అది ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఆగదని.. ఇతర దేశాలకూ వ్యాపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
ముసుగులో గుద్దులాట కొనసాగేనా?
ఒకవైపు ఇజ్రాయెల్... మరోవైపు ఇరాన్, దాని భాగస్వాములు, ప్రచ్ఛన్న ప్రతినిధుల మధ్య సాగుతున్న ముసుగులో గుద్దులాటను ఒక స్థాయి వరకే కొనసాగించవచ్చు. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్ వైపుగా కమికేజ్ డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించడంతో ఆ తెర తొలగింది. తన ‘జియోనిస్ట్ శత్రువు’కు వ్యతిరేకంగా నాలుగున్నర దశాబ్దాల ఆవేశపూరిత వాగాడంబరం సాగించిన ఇరాన్ నిజానికి ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో లక్ష్మణరేఖను దాటినట్లయింది. ఇజ్రాయెల్ ప్రతీకారదాడి ఈ ప్రాంతాన్ని అగాథంలోకి తోస్తుంది. కానీ నిజంగా పరిస్థితి అలా ఉందా? మనం చాలా కాలంగా చూస్తున్న ముసుగులో గుద్దులాట నాటకంలో సరికొత్త అంకాన్ని చూస్తున్నామా అనేది ప్రశ్న. ప్రస్తుతం ఏడవ నెలలో అడుగుపెట్టిన గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, ఏ సమయంలో అయినా విస్తృతమైన ప్రాంతీయ పెనుమంటగా మారే ప్రమాదాన్ని కలిగివుంది. అయితే, పాలస్తీనా సమస్య పరిష్కారానికి మద్దతుగా ఇరాన్ తరచుగా చేసే తీవ్రమైన బెదిరింపుతో కూడిన ఆగ్రహ ప్రకటనలు, ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న ఒక అంతర్లీన వాస్తవాన్ని దాచిపెడుతున్నాయి. దాని అత్యున్నత నాయకుడైన అయతొల్లా అలీ ఖొమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం వాస్తవానికి చాలా జాగ్రత్తగానూ, ప్రమాదాన్ని కోరి ఆహ్వానించని తత్వంతోనూ సాగుతోంది. పైగా ముఖాముఖి ఘర్షణకు అది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాడి నిరోధం దిశగా ఇరాన్ ఇష్టపడే విధానం ఏమిటంటే, స్నేహపూర్వకంగా లేని దేశాలకు హెచ్చరికలను పంపడానికి తన ప్రతినిధుల (ప్రాక్సీలు) ద్వారా అసమాన యుద్ధంలో దాని అధునా తన సామర్థ్యాలను అమలు చేయడమే. ఒక పాత హిందీ పాటలోలా ‘అర్థమయ్యేవాళ్లకు అర్థమైంది’ అనేది దాని కార్యచరణ సూత్రం. తెహ్రాన్ లేదా దాని ఖుద్స్ బలగాలను హమాస్ దాడులతో అనుసంధానించడానికి తగిన నిర్ధారిత సాక్ష్యాధారం లేనప్పటికీ, అక్టోబరు 7న హమాస్ చేసిన దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని చాలామంది ఊహించారు. గాజాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన విధ్వంసక దాడిని ప్రారంభించినప్పుడు, లెబనాన్ నుండి ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకోవడానికి హెజ్బొల్లాకు చెందిన యుద్ధంలో రాటుదేలిపోయిన క్యాడర్లను ఇరాన్ పంపుతుందనే ఆందోళన వాస్తవంగానే ఉండింది. అలాగే, గాజాలోని తన హమాస్ మిత్రపక్షానికి మద్దతు ఇవ్వడానికి ఇరాన్ రెండవ ఫ్రంట్‌ను ప్రారంభించవచ్చని కూడా భావించారు. ఏమైనప్పటికీ, ఆరు నెలల తరువాత కూడా, ఇరాన్, హెజ్బొల్లా రెండూ ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌లో తమ హద్దులలోనే కొనసాగుతూ అసౌకర్యమైన సమ తౌల్యాన్ని కొనసాగించాయి. హెజ్బొల్లా వద్ద ఉన్న మారణాయుధాలు ప్రధానంగా ఉత్తర ఇజ్రాయెల్‌లో ఇప్పుడు జనాభా లేని గ్రామాలు, స్థావరాలకు వ్యతిరేకంగా ఉపయోగించబడ్డాయి. దక్షిణాన కొన్ని మైళ్ల దూరంలో ఉన్న సైనిక, పౌర లక్ష్యాలు హెజ్బొల్లా క్షిపణుల పరిధిలో ఉన్నప్పటికీ వాటిని తాకలేదు. వివాదాన్ని హెజ్బొల్లా తీవ్రతరం చేస్తే లెబనాన్ పై భయంకరంగా స్పందిస్తానని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్, సిరియాలోని అగ్రశ్రేణి హెజ్బొల్లా సముదాయం, సైనిక సంపత్తి లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. అయితే హెజ్బొల్లాపై నేరుగా దాడి చేయడానికి ఇజ్రాయెల్ సైతం దూరంగానే ఉంది. సంవత్సరాల తరబడి ఇరాన్ చే జాగ్రత్తగా పోషించబడిన మరొక ప్రచ్ఛన్న శక్తి యెమెన్‌లోని హౌతీలు. ఎర్ర సముద్రంలోని సముద్ర మార్గాలలో వాణిజ్య నౌకలతో విధ్వంస క్రీడ ఆడటానికి తమ డ్రోన్ లను, క్షిపణులను హౌతీలు సానబెట్టారు. హౌతీల ఆయుధ నిల్వలు, శిక్షణ, వ్యూహాల మూలాల గురించి పెద్ద సందేహమేం లేదు. అయితే రింగ్‌మాస్టర్‌గా ఉండటంలోనే ఇరాన్ సంతృప్తి చెందుతూ, పశ్చిమ దేశాలు తనపట్ల శత్రు వైఖరితో కొనసాగితే విఘాతం కలిగించగలిగే ప్రభావాన్ని నిశ్శబ్దంగా నొక్కిచెప్పింది. అయితే, ఏప్రిల్ 1న డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యా లయానికి చెందిన కాన్సులర్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి... సిరియా, లెబనాన్ లలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన ఖుద్స్ బలగాల అధిపతి హసన్ మహ్దవీని చంపినప్పుడు ఆ పెళుసైన సమతుల్యత దెబ్బతింది. అత్యంత కచ్చితంగా తలపెట్టిన ఈ దాడి మహ్దవీతో పాటు ఆరుగురు స్వదేశీయులను కూడా మట్టు బెట్టడం, ఇరాన్ ప్రభుత్వాన్ని మండించింది. 2023 డిసెంబర్లో కూడా సిరియాలో ఇరాన్ సీనియర్ కమాండర్ అయిన సయ్యద్ రజీ మౌసావీని ఇజ్రాయెల్ హతమార్చింది. తెహ్రాన్ లోని అతివాదుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది కాబట్టే నాయకత్వం చేసే తీవ్రమైన ప్రతీకార బెదిరింపులు ఇప్పుడు గట్టి చర్యతో సరిపోలాల్సి ఉంది మరి. చివరికి ఏప్రిల్ 13న తాను తలపెట్టదలచిన సైనిక చర్య గురించి దాదాపు రెండు వారాల పాటు టెలిగ్రాఫ్ ద్వారా ఇరాన్ ప్రభుత్వం సూచిస్తూనే వచ్చింది. ఈద్–ఉల్–ఫితర్ ఉత్సవాలు ముగిసిన వెంటనే దాడి జరుగనున్నట్లు విçస్తృతమైన అంచనాలు వెలువడ్డాయి. అలాగే జరిగింది కూడా. ఈ ప్రాంతంలోని దేశాలకు 72 గంటల నోటీసు ఇచ్చామనీ, విమానాలను నిలిపివేయడానికీ, వారి పౌరులకు హెచ్చరి కలు జారీ చేయడానికీ భారత్ సహా ఇతర దేశాలకు తగినంత సమయం ఇచ్చామనీ ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్ ప్రయోగించిన ‘99 శాతం’ డ్రోన్లు, క్షిపణులను... బలీయమైన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలు, అలాగే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్ ్స, ఆఖరికి జోర్డాన్ తో సహా అనేక మిత్రదేశాలు విజయవంతంగా అడ్డుకోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. 80కి పైగా డ్రోన్లు, ఆరు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటన ధ్రువీకరించింది. నెగెవ్ ఎడారిలోని ఒక ఇజ్రాయెలీ వైమానిక స్థావరంలో స్వల్పంగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతానికి, ఈ దాడి ఇరాన్ సామర్థ్యాలకు నిజమైన ప్రతిబింబం కాదు లేదా ఇజ్రాయెల్ వైమానిక రక్షణకు నిజమైన పరీక్ష కాదు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. గత వారాంతం వరకు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు గాజాలో జరుగుతున్న అనాలోచిత విధ్వంసం గురించీ, అక్కడి ప్రజల బాధల గురించీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కానీ ఇరాన్ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే, అమెరికా యంత్రాంగం ఇజ్రాయెల్‌కు తన ‘గట్టి మద్దతు’ను పునరుద్ఘాటించింది. భవిష్యత్ ప్రమాదాలను నిరోధించడానికి బ్రిటన్, ఫ్రాన్స్ తమ నావికా సంపత్తిని మోహరించాయి. శత్రుదుర్భేద్యమైనదని పేరొందిన ఇజ్రాయెల్ రక్షణ శక్తుల ఖ్యాతి అక్టోబరు 7న హమాస్ దాడితో కాస్త దెబ్బ తిన్నప్పటికీ, తాజాగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ లను, క్షిపణులను అధిక సంఖ్యలో తటస్థీకరించడంలో విజయం సాధించడం ద్వారా మళ్లీ తన్ను తాను నిలబెట్టుకోగలిగింది. గాజా ప్రస్తుతానికి మీడి యాలో పతాక శీర్షికలకు దూరంగా ఉంది. అంతేకదా! అమెరికా, భారత్, ఇతర దేశాలు తిరుగుదాడి పట్ల సంయమనం పాటించాలనీ, లేకుంటే అది మరింతగా పెరుగుతుందనీ హెచ్చరించడంతో నెత న్యాహు మళ్లీ కేంద్ర స్థానంలోకి చేరుకున్నారు. తన షాడో–బాక్సర్లు బలంగా పంచ్‌లు విసిరినందున, దాడుల నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నాననీ, అయితే ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగినట్లయితే తాను గట్టిగా ప్రతిస్పందిస్తాననీ ఇరాన్ సూచించింది. ఇక, ఇజ్రాయెల్‌లో రాజకీయ పార్టీలు నిలువునా చీలిపోయాయి. ప్రమాదకరమైన గీతను దాటినందుకు ఇరాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని రైట్ వింగ్ నాయకులు కోరుతున్నారు. ఇజ్రాయెల్ ప్రతిఘటనను ప్రారంభించడానికి ‘వెంటనే కదలాలి’ అని జాతీయ భద్రతా మంత్రి బెన్–గ్విర్ సూచించారు. మధ్యప్రాచ్యంలో భావితరాలు కూడా గుర్తుంచుకునేలా ఇజ్రాయెల్ గట్టిగా ప్రతిస్పందించాలని ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోత్రిచ్ పిలుపునిచ్చారు. బెన్నీ గాంట్జ్, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ వంటి మితవాదులు తీవ్రమైన ప్రతి చర్యకు వ్యతిరేకంగా సలహా ఇచ్చారు. బదులుగా ఇరాన్‌కు వ్యతిరేకంగా వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచుకోవాలని సూచించారు. దేశ రాజకీయాలకు వ్యతిరేకంగా అమెరికా పెడుతున్న ఒత్తిడిని బేరీజు వేసుకుని, తీవ్ర పర్యవసానాలు కలిగివుండే ఒక ప్రతిస్పందనను నెతన్యాహు రూపొందించనున్నందున రాబోయే కొద్ది రోజులు కీలకం కానున్నాయి. నవదీప్ సూరి వ్యాసకర్త ఈజిప్ట్, యూఏఈల్లో భారత మాజీ రాయబారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ప్రమాదపుటంచున...
ఇప్పటి దాకా ముసుగులో గుద్దులాటగా ఉన్న వ్యవహారం బట్టబయలైంది. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ పెద్దయెత్తున సాగించిన డ్రోన్, క్షిపణì దాడితో ఆ రెండు దేశాల మధ్య నాలుగు దశా బ్దాల పైగా లోలోపల సాగుతున్న కుమ్ములాట బయటపడింది. ముందుగా ఏప్రిల్ 1న సిరియా రాజధాని డెమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి, ఒక జనరల్ సహా పలువురు సైనికాధికారుల మృతితో అగ్గి రాజుకుంది. ప్రతీకారంగా గత శనివారం ఇరాన్ పంజా విసరడంతో వ్యవహారం ముదిరింది. యుద్ధం ఊసెత్తకపోయినా దెబ్బకు దెబ్బగా టెహరా న్పై తగిన చర్య చేపడుతామంటోంది టెల్ అవీవ్. అసలే అస్థిరతలో మునిగిన పశ్చిమాసియా ఈ శరవేగ పరిణామాలు, వ్యాఖ్యలతో ఏ క్షణమైనా పూర్తిస్థాయి యుద్ధంలో చిక్కుకుపోవచ్చు. చాలాకాలంగా ఇరాన్ తన వ్యూహాత్మక లక్ష్యాలకై పరోక్ష సహకారం అందిస్తూ ప్రాంతీయ తీవ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ పౌరులపైన, వివిధ దేశాల్లోని ఇజ్రాయెల్ ఆస్తులపైన ప్రయోగిస్తూ వచ్చింది. అయితే, ఇజ్రాయెల్‌తో ఎన్నడూ నేరుగా ఘర్షణకు దిగలేదు. తెర వెనుక నుంచి తాను చేసినవి ఒప్పుకోనూ లేదు. ఇజ్రాయెల్దీ అదే పంథా. మూడేళ్ళ క్రితం ఇరాన్‌కు చెందిన ముగ్గురు అణుశాస్త్రవేత్తల హత్యలో తన పాత్రను ఆ దేశమూ అంగీకరించ లేదు, అలాగని ఖండించనూ లేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులతో గాజా భూఖండం సంక్షోభంలో పడింది. సదరు హమాస్ దాడుల వెనుక ఇరాన్ పాత్ర గురించి కథలు కథలుంటే, అదే అదనుగా పాలెస్తీనీయుల గాజాను ఇజ్రాయెల్ సమూలంగా ధ్వంసం చేసేసింది. ఐరాస సహా ఎవరెన్ని చెప్పినా నెలల తరబడి ఇజ్రాయెల్ ఆగలేదు, గాజాపై దాడులు ఆపనూ లేదు. ఈ నేపథ్యం నుంచి తాజా ఘటనల్ని చూడాలి. చివరకిప్పుడు ఇరాన్ నేరుగా తన గడ్డ మీద నుంచే ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. కొన్ని దశాబ్దాలుగా పశ్చిమాసియాలో ఎన్నడూ లేనంతటి ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రయోగించిన 360 క్షిపణుల్లో చాలావాటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్‌ల సహకారంతో ఇజ్రాయెల్ నిలువరించగలిగింది. రాయబార కార్యాలయంపై దాడికి ప్రతిగా స్వీయ రక్షణ కోసమే తాము దాడి చేశామనీ, విషయం ఇంతటితో ముగిసిందనీ ఇరాన్ అంటోంది. ఇక, క్షిపణి దాడిని సమర్థంగా అడ్డుకున్నందున సంయమనం పాటించి, పరిస్థితి ప్రాంతీయ యుద్ధానికి దారి తీయకుండా చూడాలని అమెరికా సహా ఇతర మిత్రదేశాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అభ్యర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ సరేనన్నట్టు ఉంటూనే, ఇరాన్‌కు తగిన బదులిస్తామంటోంది. ఏమైనా ఇరాన్, ఇజ్రాయెల్‌లు దేనికది మధ్యప్రాచ్యంలో తమదే పై చేయి అని చూపేందుకు యత్నిస్తున్నాయి. అందులో భాగమే రెండు దేశాలూ ఇప్పుడు దాదాపు నేరుగా కయ్యానికి దిగడం! పశ్చిమాసియాలో పరిస్థితికి ఇరు దేశాల బాధ్యతా ఉంది. ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా పాలెస్తీనా భూభాగాల్ని బలవంతాన దిగ్బంధించి, కథ నడుపుతుంటే ప్రపంచపు పెద్దన్నలెవరూ ఎన్నో ఏళ్ళుగా పెదవి విప్పలేదు. పట్టించుకోకుండా వదిలేశారు. నిరుడు హమాస్ దాడితో ఇజ్రాయెల్ అహం దెబ్బ తిని, గాజాలో సామూహిక ఊచకోతకు దిగినప్పుడూ అమెరికా సహా ఎవరూ దాన్ని ఆపలేక పోయారు. ఇరాన్ సంగతికొస్తే, అదీ ఇష్టానుసారం వ్యవహరించింది. హెజ్బుల్లా, హమాస్, హౌతీల లాంటివన్నీ అది పరోక్షంగా పోషిస్తున్న పాములే. కొన్నేళ్ళుగా ఇరాక్, లెబనాన్, సిరియా, యెమన్ లలో ఇరాన్ పరోక్ష సహకారంతో నడుస్తున్న ప్రాంతీయ తీవ్ర వాద మూకలను నిలువరించడమే ఇజ్రాయెల్, అమెరికాల పని అయింది. వెరసి, ఇరాన్, ఇజ్రాయెల్‌ల తప్పిదాలు, స్వార్థంతో పక్కన చేరిన దేశాలతో పశ్చిమాసియా చిక్కుల్లో పడింది. తాజా ఘటనలతో యుద్ధం అంచున నిల్చుంది. ప్రతి యుద్ధం ప్రపంచంలో అనిశ్చితిని పెంచేదే. మరీ ముఖ్యంగా, ప్రపంచానికి ఇంధన భాండా గారం లాంటి పశ్చిమాసియా యుద్ధక్షేత్రంగా మారితే ఇక చెప్పేదేముంది! తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్ – ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొన్నది అందుకే! వ్యవహారాన్ని తెగేదాకా లాగి, ప్రపంచం రెండు శిబిరాలుగా చీలితే కష్టం. ఇరాన్ దాడితో పని లేకుండా గాజాలో యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అంటోంది. అంటే, ఇరాన్ – ఇజ్రాయెల్ సంక్షోభం ముగియనే లేదని స్పష్టమవుతోంది. తక్షణమే అంతర్జాతీయ సమాజం బరిలోకి దిగి, ముందు గాజాలో దాడులు, పాలెస్తీనాలో అమాయక పౌరుల మరణాలు ఆగేలా చూడాలి. ఇజ్రాయెల్‌కు 66 శాతం మేర ఆయుధాలిస్తున్న అమెరికా, అలాగే ఇతర ఆయుధ సరఫరా దేశాలు తమ సరఫరాలు తగ్గించగలిగితే మేలు. అంతకంతకూ అంతర్జాతీయంగా తాను ఒంటరి అవుతున్నానని ఇజ్రాయెల్ గుర్తించాలి. ‘అబ్రహమ్ ఒడంబడికల’ ద్వారా మితవాద అరబ్ దేశాలు నెయ్యానికి ముందుకు రావడంతో దానికి కలి గిన ప్రయోజనం పోతుంది. అయినా, ఇంతకు ముందు, ఇకపైన కూడా మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లు రెండు ప్రధాన సైనిక శక్తులు. ఇరుపక్షాలూ లక్ష్మణరేఖ దాటాయి. వాటి మధ్య ఘర్షణ చివరకు యుద్ధంగా పర్యవసిస్తే అది రెంటికీ నష్టమే. కాబట్టి, మంకుపట్టు వీడి, వెనక్కు తగ్గాలి. ప్రస్తుత ఉద్రిక్తతను చల్లార్చాలి. పొంచివున్న పెను యుద్ధం ముప్పును నివారించాలి. పశ్చిమాసి యాలో ఉద్రిక్తతలు కొనసాగితే, ప్రపంచ చమురు సరఫరాలు సైతం అస్తవ్యస్తమై, ధరలు పెరుగు తాయి. రష్యా నుంచి చమురు సరఫరా కోసం ఎర్రసముద్రంపై ఆధారపడే మన దేశానికీ ఇబ్బందే. భారత్ సూచించినట్టు మళ్ళీ దౌత్యమార్గాన్ని ఆశ్రయించడమే అన్ని వివాదాలకూ పరిష్కారం.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019