breaking news
-
మన చదువుకు కీర్తి కిరీటం!
అంతర్జాతీయంగా మన ఉన్నత విద్యారంగం వెలుగులీనుతున్న వైనాన్ని వరసగా మూడో ఏడాది కూడా క్యూఎస్ (క్వాక్వరెలీ సైమండ్స్) జాబితా నిరూపించింది. బుధవారం ప్రకటించిన ఆ జాబి తాలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి అధ్యయనాల విభాగంలో 20వ ర్యాంకు సాధించి తనకెవరూ సాటిలేరని నిరూపించింది. వామపక్ష భావజాలం బలంగావున్న విద్యాసంస్థగా ముద్ర వున్న జేఎన్‌యూ ప్రతియేటా విద్యాప్రమాణాల విషయంలో తన సత్తా చాటుతూనే వస్తోంది. ఇక అహ్మదాబాద్ ఐఐఎం 25వ ర్యాంకు, బెంగళూరు, కలకత్తా ఐఐఎంలు 50వ స్థానంలోనూ వున్నాయి. డేటా సైన్స్‌లో, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో గువాహటి ఐఐటీ క్యూఎస్ జాబితాలో చోటు సంపాదించుకుంది. పరిశోధనా రంగంలో మన దేశం నాలుగో స్థానంలో వుండటం ఈసారి చెప్పుకోదగిన అంశం. ఈ విషయంలో మనం బ్రిటన్ను అధిగమించటం గమనించదగ్గది. ఒకప్పుడు మన పరిశోధనలకు పెద్ద విలువుండేది కాదు. రెండేళ్లుగా ఈ ధోరణి మారడం మంచి పరిణామం. క్యూఎస్ ర్యాంకుల జాబితా అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైనది. 96 దేశాల్లోని 1,559 విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు 55 శాస్త్రాల్లో ఎలావున్నవో అధ్యయనం చేసి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఇందుకు క్యూఎస్ పెట్టుకున్న కొలమానాలు ఆసక్తికరమైనవి. దేశంలోని విద్యాసంస్థలు వాటిని గమనిస్తే మన విద్యావ్యవస్థ ఎంతోకొంత మెరుగుపడుతుంది. విద్యా విషయక కార్య క్రమాల్లో, పరిశోధనల్లో ఒక విశ్వవిద్యాలయం పనితీరు ఎలావున్నదో అంతర్జాతీయంగా భిన్నరంగాల్లో నిష్ణాతులైనవారి అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే ఫలానా యూనివర్సిటీనుంచి వచ్చే పట్టభద్రుల్లో నైపుణ్యాలూ, సామర్థ్యమూ ఎలావున్నాయో వివిధ కంపెనీలనూ, సంస్థలనూ అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, చదువు విషయంలో విద్యార్థులకు అందుతున్న మద్దతు వగైరాలు ఆరా తీస్తారు. అధ్యాపకుల ప్రమాణాలతోపాటు అధ్యాపకవర్గంలో వైవిధ్యత చూస్తారు. అంతర్జాతీయ నేపథ్యంవున్న అధ్యాపకులు, విద్యార్థులు ఎందరున్నారన్నది లెక్కేస్తారు. శాస్త్ర సాంకేతిక విద్యలో, తత్వశాస్త్ర విద్వత్తులో మన ప్రతిభావ్యుత్పత్తులు సాటిలేనివన్న ఖ్యాతి వుండేది. ఐటీరంగంలో మనవాళ్ల బుద్ధికుశలత వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన దాఖ లాలు కనబడుతూనే వున్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల విషయంలో మన విశ్వవిద్యాల యాలు వెనకబడివుండేవి. ఆ కొలమానాలు, అందుకనుసరించే పద్ధతులు సక్రమంగా వుండవనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ కొందరు విద్యావేత్తలు అనేవారు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఆ ప్రమాణాలు అందుకోవటం తప్పదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలలా వుండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం మన గడప తొక్కాలంటే అది తప్పనిసరి. వివిధ దేశాల్లోని విద్యాసంస్థలందించే విద్య ఎలావున్నదో తులనాత్మక అధ్యయనం చేయటంవల్ల ఎవరు ఏ రంగంలో ముందంజలో వున్నారన్న సమాచారం వెల్లడవుతుంది. అది పై చదువులకెళ్లే విద్యార్థులకు మాత్రమే కాదు... పరిశోధకులకూ ప్రయోజనకారిగా వుంటుంది. అలాగే అంతర్జాతీయంగా ఎవరి భాగస్వామ్యం పొందితే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు మెరుగుపడతాయో విధాన నిర్ణేతలు నిర్ధారించుకుంటారు. అయితే సంపన్న, వర్ధమాన దేశాల విశ్వవిద్యాలయాల మధ్య పోటీ పెట్టడం ఎంత మాత్రమూ సరైంది కాదన్న వాదనలు ఎప్పటినుంచో వున్నాయి. పరిశోధనలకూ లేదా పరికల్పనలకూ సంపన్న దేశాల్లో ప్రభుత్వాలనుంచీ, ప్రైవేటు వ్యక్తులనుంచీ నిధుల రూపంలో అందే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక్కడ అది చాలా అరుదు. మన విశ్వవిద్యాలయాలు వెనకబడి వుండటానికి అదొక కారణం. ఇక ఇతర విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకోవాలి. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని తొలి యూపీఏ ఏలుబడిలో 2005లో దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ–గాట్స్ సంభాషణల్లో సూత్రప్రాయంగా అంగీకరించిన పర్యవసానంగా ఇతర రంగాలతోపాటు విద్య కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విదేశీ వర్సిటీలకు మన దేశం తలుపులు తెరిచింది. 2017లో నైరోబీలో జరిగిన డబ్ల్యూటీఓ సమావేశంలో ఎన్డీఏ సర్కారు సంతకం చేశాక 62 ఉన్నత విద్యాసంస్థలకు ‘ఆర్థిక స్వయంప్రతిపత్తి’ మొదలైంది. ఇది పరిమిత స్థాయిలోనైనా ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించటమే. పర్యవసానంగా ఉన్నత విద్యను అందుకోవటం నిరుపేద వర్గాలకు కష్టమవుతోంది. దానికితోడు అధ్యాపక నియామకాల్లోనూ, మౌలిక సదుపాయాలు కల్పించటంలోనూ ప్రభుత్వాలనుంచి మద్దతు కొరవడుతోంది. ఏతావాతా చాలా విశ్వవిద్యాలయాలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. ఇప్పుడు ఉన్నత శ్రేణి ర్యాంకులు పొందిన విద్యాసంస్థలకు దీటుగా ఇతర సంస్థలను కూడా తీర్చిదిద్దకపోతే, అన్ని వర్గాలకూ అందుబాటులోకి రాకపోతే ‘స్కిల్ ఇండియా’ వంటివి నినాదప్రాయమవుతాయని పాలకులు గుర్తించాలి. ఉన్నత విద్యను అందుకోవాలనుకునే పేద వర్గాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ విధానం కింద దేశంలోనే కాదు... అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థల్లో సీటు సంపాదించుకునేవారికి సైతం భారీ మొత్తాల్లో ఫీజులు చెల్లించటానికి సిద్ధపడుతోంది. వారు చదువుకునే కాలంలో అయ్యే వ్యక్తిగత ఖర్చు కూడా భరిస్తోంది. ఈ మాదిరి విధానం ఇతర రాష్ట్రాల్లో లేదు. క్యూఎస్ ర్యాంకుల జాబితా ఇలాంటి అంశాలపై పాలకులు దృష్టి సారించేలా చేయగలిగితే, లోపాలను సరిదిద్దగలిగితే అది మన విద్యా, వైజ్ఞానిక రంగాలను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. -
‘టెట్’ దరఖాస్తు గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు టెట్‌కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఎన్సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌కు టెట్ అవసరం. కానీ ఎస్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్‌తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్ డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్ రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) టెట్ అప్లికేషన్స్ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్లో టెట్ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సర్వీస్ టీచర్లలో ఎంత మంది టెట్ రాయాలి? ఏ పేపర్ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ దరఖాస్తుల గడువు పెంచాలి. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్ బెల్ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది. అప్పటివరకు ‘వాటర్ బెల్’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్ బెల్ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు. రోజూ మూడుసార్లు వాటర్ బెల్ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. రోజూ వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు తెలుసుకునేలా మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు. -
పాఠశాలల పునః ప్రారంభం తర్వాత కూడా కొనసాగనున్న “వాటర్ బెల్”
పాఠశాలల పునః ప్రారంభం (జూన్ 12వ తేదీ) తర్వాత కూడా “వాటర్ బెల్” విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు (ఏప్రిల్ 23వ తేదీ) వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా డీఈవోలకు సూచించారు. అంతేగాక మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని గుర్తించి నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలుగా వారు గుర్తించేలా పోస్టర్‌ను జతపరిచామని పేర్కొన్నారు. ఈ పోస్టర్లను పోస్ట్‌కార్డ్ సైజులో ముద్రించి ప్రతి మూత్రశాల మరియు టాయిలెట్ బ్లాక్ ముందు అతికించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా వస్తే పారదర్శకంగా ఉందని, నీరు అధికంగా త్రాగుతున్నారని అర్థం. లేత గోధుమ రంగు వస్తే ఆరోగ్యంగా ఉన్నారని, తగినంత నీరు త్రాగుతున్నారని అర్థం. లేత పసుపు రంగు వస్తే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగు వస్తే నీరు తక్కువగా త్రాగుతున్నారని, మరి కొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో వస్తే శరీరానికి సరిపడినంత నీరు అందడం లేదని అర్థం. ముదురు గోధుమ రంగులో వస్తే వెంటనే ఎక్కువ నీరు త్రాగాలని విద్యార్థులకు సూచించేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన టోషికో మొరిమోటో, యాసుయో ఆబే, అమెరికన్ స్కాలర్స్ పటేల్ ఏఐ మరియు లాస్ ఏంజిల్స్‌కు చెందిన బోర్రుడ్ ఎల్జి, నెదర్లాండ్స్‌కు చెందిన డచ్ స్కాలర్స్ మెక్కీ టీఈ, ఫాగ్ట్ ఎస్ ఈటీ ఏఐ, ఇతరులు నిర్వహించిన పరిశోధనలు ఈ విధానం యొక్క ఆవశ్యకతను నిర్ధారించాయని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
త్వరలో ఇంటర్, పది ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు. వీరి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం సుమారు 23 వేలమంది అధ్యాపకులను ఇంటర్ విద్యామండలి నియమించింది. పదో తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు. వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వేల్యూయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతేడాది ఏప్రిల్ 26న ఇంటర్, మే 6న టెన్త్ ఫలితాలు షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం గురువారంతో ముగియనుంది. తరువాత పునఃపరిశీలన, మార్కుల నమోదు వంటి ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 12వ తేదీ నాటికి ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం కూడా ఈనెల ఎనిమిదో తేదీ నాటికి పూర్తికానుంది. ఈ ఫలితాలను సైతం వారం, పదిరోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువమంది సిబ్బంది నియామకం, టెక్నాలజీ వినియోగం, ప్రతి మూల్యాంకన కేంద్రానికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2022–23 విద్యాసంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 26న, టెన్త్ ఫలితాలను మే 6వ తేదీన విడుదల చేశారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019