breaking news
-
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఉగాది సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలలో ప్రముఖ ఆకర్షణగా నిలిచింది "జయంత విజయం" పద్యనాటకం. ఓర్లాండో ప్రవాసాంధ్రులను మంత్రముగ్ధులను చేసింది. మహాభారతంలో అత్యంత కీలకమైన విరాటపర్వం ఘట్టాన్ని కేంద్రీకరించుకుని నాటి, నేటి తరాలను అలరించే విధంగా రూపొందించారు. ఈ రంగస్థల దృశ్యకావ్యం, భారతీయ పురాణాలు, ఇతిహాసాల ధార్మికత్వాన్ని చాటి చెప్పేలా ప్రేక్షకులను అలరించింది. తటవర్తి గురుకులం వారి పద్యకల్పద్రుమంలో భాగంగా, తటవర్తి కళ్యాణ చక్రవర్తి రచించిన ఈ నాటకం, తిక్కన విరాటపర్వంలో పద్యాలను సులభమైన తెలుగు నేపథ్యంతో మేళవించి, సుమారు వేయి మందికి పైగా హాజరైన ప్రేక్షకులను విస్మయులయ్యేలా చేసింది. అత్యంత సందోహ సంతోష సంబరంగా వెలసిన "క్రోధి" నామ సంవత్సర ఉగాది వేడుకలలోప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓర్లాండో తెలుగు సంఘం అద్యక్షుడు కిశోర్ దోరణాల సమన్వయంతో, చెరుకూరి మధుగారి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ నాటకంలో వెంకట శ్రీనివాస్ పులి, దీకొండ జయశ్రీ, నిడమర్తి కృష్ణ, యఱ్ఱాప్రగడ శాయి ప్రభాకర్, కసిరెడ్డి ఇంద్రసేన, శీలం గోపాల్, నిడమర్తి అరుణ, ఏనపల్లి మహేందర్, దివాకర్ల పవన్ కుమార్ మరియు దివాకర్ల ప్రసూన ముఖ్య పాత్రధారులు కాగా, శ్రీధర్ ఆత్రేయ అందించిన నేపధ్య సంగీతం RJ మామ మహేష్ కర్టెన్ రైజర్ వాయిస్ ఓవర్ ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచాయి. -
Ugadi 2024: ఆన్లైన్లో ఆటా సాహిత్య వేదిక ఉగాది వేడుకలు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న అంతర్జాలం వేదికగా శారద సింగిరెడ్డి సారథ్యంలో నిర్వహించిన శ్రీ క్రోధి నామ సంవత్సర "తెలుగు వసంతం" సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆకట్టుకుంది. త్రిభాషా మహాసహస్రావధాని , ప్రణవ పీఠాధిపతులు వద్దిపర్తి పద్మాకర్, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సాహిత్య పరిషత్తు ప్రాంత అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, శృంగేరి శారదా పీఠ ఆస్తాన పౌరాణికులు డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ, అవుసుల భానుప్రకాష్ అవధాని , అధ్యక్షులు సాహితీ గౌతమి కరీంనగర్ శ్రీ నంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గణనాథుని కీర్తనతో రాలీ,నార్త్ కరోలీనా నుండి వైభవ్ గరిమెళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా , విశిష్ఠ అతిథుల వినోదభరిత విజ్ఞాన విశ్లేషణ, చతురత ఇమిడిన బోధన , సంస్కార సాంప్రదాయ సమ్మిళిత సుభాషిత సందేశాలతో రాశి ఫలాలు , పంచాంగ శ్రవణం, పద్య గద్య గాన ప్రసంగాదులతో ఆద్యంతం హృద్యంగా సాగిన ఈ సాహితీ కార్యక్రమం ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలందుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మధు బొమ్మినేని పేరు పేరునా ప్రత్యేక అభినందనలను తెలిపారు. అలాగే 2024 సంవత్సరం అట్లాంటా లో జూన్ 7,8,9 తేదీలలో జరుగ నున్న18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్‌కు అందరికీ పేరుపేరున సాదర ఆహ్వానాన్ని పలికారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమానికి నంది శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా అతిథులందరూ ఉత్సాహంగా గడిపారు. చివరిగా ఆటా లిటరరీ సభ్యులు మాధవి దాస్యం విశిష్ఠ అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
దివ్యం.. భవ్యం.. రమ్యం రామచరితం
పితృవాక్పాలన, ధర్మవర్తన, సదా సత్యమే పలకడం, ప్రజానురంజకమైన పాలనను అందించడం.. వంటి ఎన్నో లక్షణాలను బట్టి అందరి గుండెల్లో దేవుడిగా కొలువు తీరాడు రాముడు. అయితే మన నిత్యజీవితంలో అసలు రామ శబ్దం లేనిదెప్పుడు? చిన్నప్పుడు లాల పోసి శ్రీరామ రక్ష చెప్పడం దగ్గరనుంచి ‘రామాలాలీ.. మేఘశ్యామాలాలీ’ అనే జోలపాటతో బిడ్డలను నిద్ర పుచ్చడం వరకు... అందరి జీవితాలలో రాముడు ఒక భాగంగా మారిపోయాడు. నేడు ఆ జగదభిరాముడు ఇలపై పుట్టినరోజు.. అంతేనా... ఆదర్శదంపతులుగా పేరు ΄పొందిన సీతారాముల పెళ్లిరోజు కూడా. ఈ సందర్భంగా ఆ పురుషోత్తముడి గురించి... ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు. దశరథ మహారాజ తనయుడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యంతోబాటు సర్వ సంపదలనూ, అన్నిసుఖాలనూ విడనాడి నారదుస్తులు ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్యవాసం చేశాడు. ఎన్ని కష్టాలొచ్చినా వెరవలేదు. తాను నమ్మిన సత్య, ధర్మమార్గాలనే అనుసరించాడు. ఒక మంచి కొడుకులా, అనురాగాన్ని పంచే భర్తలా, ఆత్మీయతను అందించే అన్నలా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే రాజులా ... అందరితో అన్ని విషయాలలోనూ వినమ్రతతో మెలిగే మర్యాద పురుషోత్తముడిలా... ఇలా ఎవరితో ఏవిధంగా ఉండాలో ఆ విధంగానే నడుచుకున్నాడు. అన్నివేళలా ధర్మాన్నే పాటించాడు. ఆపన్నులకు స్నేహహస్తాన్ని అందించాడు. ఆత్మీయులకు, మిత్రులకు అండగా నిలిచాడు. తాను అవతార పురుషుడినని అనలేదు. అనుకోలేదు కూడా... దేవుడినని ఎన్నడూ చెప్పుకోలేదు. ఎవరికీ ఏ ధర్మాన్నీ బోధించలేదు. తాను ఆచరించినదే ధర్మం – అనుకునే విధంగా వ్యవహరించాడు. అందుకే ధర్మం రూపు దాల్చితే రాముడిలా ఉంటుందేమో అనుకునేలా ప్రవర్తించాడు. సంపూర్ణావతారం ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలన్నింటిలోనూ సంపూర్ణమైనవి రామావతారం, కృష్ణావతారాలే. మిగిలినవి అంశావతారాలు. అంటే అప్పటికప్పుడు ఆవిర్భవించినవి. మత్స్య, కూర్మ, హయగ్రీవ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, కల్కి అవతారాలు. మానవాళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్ది, సన్మార్గంలో నడిపించడం కోసం మానవుడిలా పుట్టాడు. అందరిలాగే ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అయితేనేం, ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. అందుకే కదా... అతి సామాన్యులనుంచి అసామాన్యుల వరకు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించి, సకల గుణాభిరాముడయ్యాడు. కల్యాణ వైభోగం ఆ శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యతిథి శ్రీరామ నవమి. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారు. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ పూజాదికాలు, రామనామ పారాయణం చేస్తారు. అసలు చైత్ర మాసప్రారంభం నుంచే ఇంటింటా, వాడవాడలా, వీధివీధినా చలువ పందిళ్లు, మామిడాకు తోరణాలు... ఇలా ప్రతిచోటా కళ్యాణోత్సవ సంరంభాలు మొదలవుతాయి. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. పుట్టినరోజునే పెళ్లి వేడుకలా.!? శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఆనాడు రాముని జన్మదిన వేడుకలు జరిపించాలి. అయితే శ్రీ సీతారామకళ్యాణం జరిపించడంలోని అంతరార్థం ఏమిటనేదానికి పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం ఏమి చెబుతోందంటే– ఆ పరమాత్ముడు అవతారమూర్తిగా ఏ రోజున ఈ పుణ్యపుడమిపై అవతరిస్తే ఆ రోజునే కళ్యాణం జరిపించాల్సి ఉందనీ, ఒకవేళ ఆ తిథి తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించడం సంప్రదాయమని పేర్కొంది. అందుకే లోక కళ్యాణం కోసం సీతారాములకు çపుణ్యక్షేత్రమైన భధ్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు అభిజిత్ లగ్నంలో పెళ్లి వేడుకలు జరిపిస్తున్నారు. శ్రీరామ నవమినాడు ఏం చేయాలి? ఈరోజు రామునితోబాటు సీతాదేవి ని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా పూజించాలి. రామునికి జన్మనిచ్చిన కౌసల్యను, దశరథుని కూడా స్తుతించడం సత్ఫలితాలనిస్తుంది. సీతారామ కళ్యాణం జరిపించడం, ఆ వేడుకలలో పాల్గొనడం, చూడడం, శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించడం, విసన కర్రలు దానం చేయడం మంచిది. సమర్పించవలసిన నైవేద్యం పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర ΄పొంగలి, చెరకు, విప్పపూలు నివేదించాలి. సీతారామ కళ్యాణ తలంబ్రాలను ధరిస్తే ఆటంకాలు తొలగి సత్వరం వివాహం అవుతుందని పెద్దలంటారు. నిత్యజీవితంలో రాముడు... లాల పోసేటప్పుడు శ్రీరామ రక్ష, జోలపాడేటప్పుడు రామాలాలీ మేఘ శ్యామాలాలీ... ఓదార్పుగా అయ్యోరామ... అనకూడని మాట వింటే రామ రామ... పద్దు పుస్తకాలనుప్రారంభిస్తూ శ్రీరామ... కూర్చునేటప్పుడు లేచేటప్పుడూ రామా... ఇలా ఆయన అందరి నాలుకలమీదా నర్తిస్తూనే ఉన్నాడు... ఉంటాడు. అల్లరి చేస్తే కిష్కింద కాండ, కఠినమైన ఆజ్ఞ ఇస్తే సుగ్రీవాజ్ఞ విశాలమైన ఇంటి గురించి చెప్పేటప్పుడు లంకంత ఇల్లు పాతవాటి గురించి చెప్పాలనుకుంటే ఇక్ష్వాకుల కాలం నాటిది... సామెతలు: రామాయణంలో పిడకల వేట; రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు... చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఆకారం గురించి చెప్పాలంటే రాముడిలా ఆజానుబాహువంటారు. ఎంతకీ చూడ్డానికి రాబోతే సీతకన్నేశావంటారు. సైన్యంలా వస్తే రామదండు అంటారు. చక్కని జంటను సీతారాముల్లా ఉన్నారంటారు. ఎవరైనా కొట్టుకుంటే రామరావణ యుద్ధమంటారు. అందరిళ్లలోని గిల్లి కజ్జాలను ఇంటంటి రామాయణమంటారు. రాముడు మనకు విలువలను, వ్యక్తిత్వాన్నీ నేర్పితే రామాయణం మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది. రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరిమీదా ప్రసరించాలని కోరుకుంటూ.... – డి.వి.రామ్ భాస్కర్ తారక మంత్రం ‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే .. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే శ్లోకం విష్ణుసహస్ర నామంతో సమానమైనదంటారు. మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ, ఓం నమశ్శివాయల నుంచి తీసుకున్న అక్షరాల కలయిక అయిన రామనామాన్ని జపిస్తే ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల కలిగే ఫలితం కంటె ఎక్కువ ఫలం కలుగుతుంది. మన పెదవులు రామనామంలోని ‘రా’ అనే అక్షరాన్ని పలికినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అవి లోపలకు రాకుండా మూసుకుంటాయి. కాబట్టి ‘రామ’ అనే రెండక్షరాల తారక మంత్రాన్ని సదా స్మరిస్తుండడం వల్ల పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని కబీరుదాసు, భక్త రామదాసు, తులసీదాసు వంటి మహాభక్తులు ఉవాచించారు. శుభప్రదం... రామచరిత పారాయణం రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. దేశం సుభిక్షంగా ఉంది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటి రాజుకొసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరుదాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామమయం’’ అని వేనోళ్ల స్తుతించారు. ఆ పురాణ పురుషుని పుణ్యచరితమైన రామాయణాన్ని విన్నా, చదివినా, అందులోని శ్లోకాలను, ఘట్టాలను మననం చేసుకున్నా, శుభం కలుగుతుందని ప్రతీతి. 12 గంటలకు ఎందుకు? రాముడు త్రేతాయుగంలో వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని భద్రాద్రిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశం నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. తానీషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలం నుంచి– ఆనాటి సాంప్రదాయం మేరకు నేటికీ భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమర్పించడం ఆనవాయితీ -
Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..
Sri Rama Navami 2024 చైత్ర మాసం శుక్ల పక్ష నవమి రోజున శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపు కుంటారు. ఈ సందర్బంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడంఆనవాయితీ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. బెల్లంతో చేసిన పానకం, వడ పప్పును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అందరి జీవితాలు విరాజిల్లుతాయని పెద్దలు చెబుతారు. శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే.. ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలంటే శ్రీ రామ నవమి రోజున రాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే రాముడిని శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సంపర్పించడం ద్వారా కూడా ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే, ఐదు గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి, తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందట. రామాయణాన్ని పఠించడం, హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కూడా సంతోషం కలుగుతుందట. సంపద, శ్రేయస్సు వృద్ధి అవుతుంది. నవమి రోజున దుర్గ అమ్మవారిని కూడా పూజిస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దుర్గా దేవిని పూజించి ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతారు. రామాలయానికి కుంకుమ జెండాను దానం చేయడంతోపాటు, దేవతలకు పసుపు ఆహారాన్ని సమర్పిస్తారు. శ్రీరాముడికి కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుందని విశ్వాసం. ప్రధానంగా రామమందిరంలో 'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్తనామతత్తుల్యం శ్రీరామ నామ వరాననే'ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుందని రామభక్తుల విశ్వాసం. రామనవమి రోజున దేవుడికి పసుపు బట్టలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్న దానం, వస్త్రదానం చేస్తారు. ఈ రోజు హనుమంతుని విగ్రహం దగ్గర చందనం తీసుకుని.. సీతమ్మవారి పాదాలకు పూస్తే కోరిన కోరికలు నెరవేరతాయట. -
Sri Rama Navami 2024: శ్రీరామనవమి ముహూర్తం, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామనవమి విషిష్టత ఏంటో తెలుసుకుందాం. అయోధ్య రాజు దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన శుభ సందర్భమే శ్రీరామ నవమి. త్రేతా యుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ,పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 2024లో రామ నవమి ఎప్పుడు? చైత్ర నవరాత్రులు ఈ సంవత్సరం ఏప్రిల్ 9, మంగళవారం ప్రారంభమయ్యాయి.ఏప్రిల్ 17 న రామ నవమి పండుగతో ముగుస్తాయి. రామ నవమి శుభ ముహూర్తం రామ నవమి, ఏప్రిల్ 17,బుధవారం. ముహూర్తం - ఉదయం 11:03 -మధ్యాహ్నం 01:38 వరకువ్యవధి - 02 గంటల 35 నిమిషాలు అని పండితులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రామనవమిని ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రామజన్మభూమిగా భావించే అయోధ్యలో, శ్రీరాముని జన్మదినోత్స వేడుకలు కోలాహలంగా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అయోధ్యకు వస్తారు.ఈ ఏడాది ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామజన్మభూమి దేవాలయంలో రామ్ లల్లా తొలి వేడుకులు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. సీతారామకళ్యాణం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు అయిన శ్రీరాముడికి - అందాల సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగింట. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే పద్నాలుగేళ్లు అరణ్యవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని భక్తుల విశ్వాసం. చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. రామ భక్తులు రామాయణం భాగవత గ్రంథాలను పఠిస్తారు. సీతారామ లక్ష్మణులతోపాటు హనుమంతుడిని కూడా పూజిస్తారు. వడపప్పు, పానకం పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైందట. అందుకే శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెపుతుంది.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019